లోక్ సభ తీర్మానాలు 

అవిశ్వాస తీర్మానం

ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తిమంత రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. దీన్ని లోక్ సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఏ అంశంపై అనే విషయం చెప్పాలిసన అవసరం లేదు. సాధారణంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయం స్పీకర్‌కు గల విచక్షణాధికారం. స్పీకర్ అనుమతినిస్తే, అనుమతించిన పది రోజుల్లోగా స్త్రీకర్ నిర్ణయించిన తేదీల్లో చర్చ, దాని తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 

విశ్వాస తీర్మానం:

దీన్ని లోక్ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశ పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాసతీర్మానాన్ని 1979 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని సభా విశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించారు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది. విశ్వాస తీర్మానం లోక్ సభలో చర్చకు రాకుండానే, చరణ్ సింగ్ రాజీనామా చేశారు. ఇలా విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తొలి ప్రధానిగా చరణ్ సింగ్ గుర్తింపు పొందారు. 

వాయిదా తీర్మానం:

ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశ పెట్టేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్లించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ ఉండదు. 

సావధాన తీర్మానం:

ప్రజా ప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సావధాన తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి 'అధికార వ్యాఖ్య'ను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్‌కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి. స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలు చర్చ జరుగుతుంది. 

కోత తీర్మానాలు:

ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ మొత్తంలో కొంత తగ్గింపు కోరుతూ చేసే తీర్మానాలే కోత తీర్మానాలు. ఇవి మూడు రకాలు. 1. విధాన, 2. పొదుపు, 3. నామమాత్రపు కోత తీర్మానాలు. 

విధాన కోత తీర్మానం:

ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించాల్సిందిగా చేసేదే విధాన కోత తీర్మానం. 

పొదుపు కోత తీర్మానం:

ఇది ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తంలో కొంతమేర తగ్గించాలనే తీర్మానం. 

నామమాత్రపు కోత తీర్మానం:

ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తాన్ని వంద రూపాయలకు తగ్గించాల్సిందిగా చేసే తీర్మానం. కోత తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేస్తాయి. ఇప్పటివరకు కోత తీర్మానాలను లోక్ సభ ఒక్కసారి కూడా ఆమోదించలేదు. కోత తీర్మానం లోకసభ ఆమోదం పొందితే తప్పనిసరిగా ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఈ తీర్మానాలన్నీ కార్యనిర్వాహక శాఖను అదుపులో ఉంచి, అది తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా చేయడానికి ఉపయోగపడతాయి.


 RELATED TOPICS 

భారత పార్లమెంట్ - రాజ్య సభ