లోక్ సభ సమావేశాలు 

కోరం:

లోక్ సభ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు సంఖ్యను కోరంగా పరిగణిస్తారు. కోరం ఉన్నదీ లేనిదీ నిర్ధారించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. స్పీకర్ లోక్ సభ అధ్యక్షుడు. సభలో కోరం లేకపోతే స్పీకర్ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.

సాధారణ, ప్రత్యేక సమావేశాలు రాజ్యాంగ నిబంధన 85 ప్రకారం 6 నెలల వ్యవధికి తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు లోక్ సభ సాధారణ సమావేశాలు నిర్వహించాలి. ఏ రెండు సమావేశాల మధ్య వ్యవధి 6 నెలలు మించరాదు. లోకసభ రద్దయిన సందర్భంలో మాత్రం ఈ నియమం వర్తించదు. సాధారణంగా లోక్ సభ సమావేశాలను ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు నిర్వహిస్తారు. అవి: 1. బడ్జెట్ సమావేశాలు, 2. వర్షాకాల సమావేశాలు, 3. శీతాకాల సమావేశాలు. 

బడ్జెట్ సమావేశాలు:

సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడోవారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య ఈ సమావేశాలు నిర్వహిస్తారు. మొదట రైల్వే బడ్జెట్, తర్వాత సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎక్కువ కాలం బడ్జెట్ పై దృష్టి సారించడం వల్ల ఈ సమావేశాలను బడ్జెట్ సమావేశాలు అంటారు. 

వర్షాకాల సమావేశాలు:

సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమవుతాయి. జులై-ఆగష్టు నెలల్లో కొనసాగుతాయి. చలికాల లేదా

శీతాకాల సమావేశాలు:

నవంబరు మొదటివారంలో ప్రారంభమవుతాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో కొనసాగుతాయి. అతి తక్కువ కాలం ఉండే సమావేశాలివే.

అవసరమైతే రాష్ట్రపతి లోకసభ ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటుచేయవచ్చు. లోకసభ సమావేశం లేని కాలంలో నేరుగా రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తే, రాష్ట్రపతి 14 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు, విదేశీ నేతల దేశ పర్యటన, మహనీయుల ఉత్సవాల వంటి సందర్భాల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేయవచ్చు.

లోకసభ రద్దు - దాని ప్రభావం 

రాష్ట్రపతి ప్రకటన ద్వారా లోకసభ సమావేశం ప్రొరోగ్ అవుతుంది. అంటే లోకసభ అప్పటి సమావేశకాలం ముగిసిందని, మరోసారి సమావేశమయ్యేంత వరకు విరామకాలమని అర్థం. లోక్ సభను ప్రొరోగ్ చేయడం వల్ల లోక్ సభ పరిశీలనలో ఉన్న బిల్లులు రద్దుకావు.

లోకసభ కాలపరిమితి 

ముగిసిన తర్వాత, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి లోకసభను రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేస్తారు. లోకసభను రద్దుచేసిన తేదీ నుంచి ఆరునెలలోగా నూతన లోకసభను ఏర్పాటేచేయాలి. ఈ కాలంలో లోకసభ పరిశీలనలో ఉన్న బిల్లులు రద్దయిపోతాయి. రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు కూడా లోకసభ పరిశీలనలో ఉండినప్పటికీ రద్దవుతాయి. ఒక బిల్లు ఆమోదం విషయంలో రెండుసభల మధ్య అభిప్రాయభేదం కారణంగా ఉభయసభల సంయుక్త సమావేశానికి నోటీసు జారీచేసిన తర్వాత ఒకవేళ లోకసభ రద్దయినట్లయితే, ఆ బిల్లు రద్దుకాదు.


 RELATED TOPICS 

భారత పార్లమెంట్ - రాజ్య సభ