రక్తకణాలు

ఇవి మూడు రకాలు. అవి ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్తఫలికికలు. రక్త కణాలు ఎముక మజ్జ నుంచి ఏర్పడుతాయి. పిండాభివృద్ధిలో వీటిని కాలేయం ఏర్పరుస్తుంది. రక్తం, రక్తకణాలు ఏర్పడడాన్ని హీమోపాయిసస్ అంటారు. శరీరంలోని మరో ముఖ్య ద్రవం శోషరసం. ఎర్రరక్త కణాలు లేని ద్రవం శోషరసం. శరీర కణజాలాల మధ్య ప్రత్యేక నాళాల్లో శోషరసం ప్రవహిస్తుంది. దీనిలో తెల్ల రక్తకణాలు ఉంటాయి కాబట్టి ఇదికూడా రోగనిరోధక శక్తిలో పాల్గొంటుంది. 

ఎర్ర రక్తకణాలు: 

ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో 4.5 నుంచి 5 మిలియన్ల ఎర్రరక్తకణాలు ఉంటాయి. శరీరంలో సుమారు 32 బిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు ఆ తర్వాత అవి ప్లీహంలో నశిస్తాయి. ఎముక మజ్జలో ఇవి ఏర్పడడాన్ని ఎరిత్రోపాయిసిస్ అంటారు. ఇవి ద్విపుటాకారంలో ఉంటాయి. అభివృద్ధి చెందిన క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం, ఇతర కణభాగాలు ఉండవు. కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. హీమోగ్లోబిన్లో రెండు భాగాలు ఉంటాయి. అవి.. హీం, గ్లోబిన్. ఇనుమును ఫెర్రస్ రూపంలో కలిగి ఉన్న కర్బన పదార్థం హీం. గ్లోబిన్ ఒక ప్రొటీన్. రక్తం ఎరుపురంగులో ఉండటానికి కారణమైన వర్ణకం హీమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ల రవాణాను నిర్వహిస్తుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది. హీమోగ్లోబిన్ ఏర్పడడానికి, ఎర్రరక్తకణాలు అభివృద్ధి చెందడానికి ఇనుము, విటమిన్ బి12 (సైనకోబాలమిన్), విటమిన్ బి2 (ఫోలిక్ ఆమ్లం) అవసరమవుతాయి. ఆహారంలో ఇవి లోపిస్తే అనీమియా (రక్తహీనత) సంభవిస్తుంది. 

తెల్ల రక్తకణాలు: 

వీటిని ల్యూకోసైట్లు అంటారు. శరీర రక్షక భటులుగా వ్యవహరిస్యాఇ. వీటి జీవితకాలం కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు.  గ్రాన్యులోసైట్లు, ఎగ్రాన్యులోసైట్లు. గ్రాన్యులోసైట్ల కణద్రవ్యంలో ప్రత్యేక కణికలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మూడు రకాలు. అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఎగ్రాన్యులోసైట్లు రెండు రకాలు. మోనోసైట్లు, అసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్, అలర్జీ చర్యల్లో పాల్గొంటాయి. న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిలో ప్రధానమైనవి లింఫోసైట్లు. ఇవి రెండు రకాలు. అవి T, B లింఫోసైట్లు. T లింఫోసైట్లు మళ్లీ రెండు రకాలు. అవి CD4/ T4 కణాలు, CD8 కణాలు. శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి దాన్ని నాశనం చేసే ప్రక్రియను T లింఫోసైట్లు ప్రారంభిస్తాయి. వీటి ద్వారా సెల్యులార్ ఇమ్యూనిటీ లభిస్తుంది. వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతి దేహకాల (యాంటి బాడీస్) ను విడుదల చేసి ఇమ్యూనిటీని అందించేవి B లింఫోసైట్లు. ఈ రకమైన ఇమ్యూనిటీ హ్యుమోరల్ ఇమ్యూనిటీ తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణంగా పెరిగితే ల్యుకేమియా లేదా రక్త కేన్సర్ వస్తుంది. వీటి సంఖ్య అసాధారణంగా తగ్గడం ల్యూకోపినియా. 

రక్త ఫలకికలు: 

ఇవి నిజమైన కణాలు కాదు. ఎముక మజ్జలో మెగాక్యారియో సెట్ల నుంచి ఏర్పడిన ఖండితాలు. వీటి జీవితకాలం 3-10 రోజులు. ప్రతి క్యూబక్ మిల్లీ మీటరు రక్తంలో 2.56 లక్షలు ఉంటాయి. గాయమైనప్పుడు రక్త స్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి. గాయమైన ప్రాంతంలో ఇవి విచ్ఛిన్నం చెంది థ్రాంబోప్లాస్టిన్ పదార్థాన్ని విడుదలచేస్తాయి. ఇవి రక్తంలోని ప్రాథాంబినను థ్రాంబిన్ గా మారుస్తాయి. ఆ తర్వాత థ్రాంబిన్ చర్య ద్వారా రక్తంలోని ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా మారుస్తాయి. ఫైబ్రిన్ ప్రొటీన్ పోగులుగా మారి సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చి రక్తం నష్టాన్ని నివారిస్తుంది. ఈ ప్రక్రియలో 13 ప్రధాన రక్తస్కందన కారకాలు, కొన్ని అనుబంధ కారకాలు పాల్గొంటాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని హిపారిన్ నివారిస్తుంది. రక్త సంకోచానికి కావాల్సిన ఖనిజం కాల్షియం. అనుబంధ కారకాల్లో ముఖ్యమైంది. విటమిన్-కె. ఏ చిన్న దెబ్బ తగిలినా రక్తస్కంధనం జరగని వ్యాధి హీమోఫీలియో. కృత్రిమ రక్తస్కందన కారకాలుగా ఉపయోగించేవి సిట్రేట్లు, ఆక్సలేట్లు, డైకెమరల్.


 RELATED TOPICS 

విటమిన్లు 

మొక్కల వర్గీకరణ

జంతువుల వర్గీకరణ

రక్త వర్గాలు, ప్రసరణ

కిరణజన్య సంయోగక్రియ

మానవ వ్యాధులు

మానవునిలో జీర్ణవ్యవస్థ