ఎర్రరక్తకణాల్లోని ప్రత్యేక ప్రతిజనకాల ఆధారంగా మానవ రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజించారు. A, B, O రక్తవ్యవస్థను తొలిసారిగా ల్యాండ్ స్టీనర్ గుర్తించారు. మానవ ఎర్రరక్తకణాలపై A, B ప్రతిజనకాలు ఉండటం లేదా లేకపోవడం ఆధారంగా మనుషులు నాలుగు వర్గాలు. A గ్రూపు ఎర్రరక్తకణాల్లో A అనే ప్రతిజనకం ఉంటుంది. B గ్రూపు ఎర్ర రక్తకణాలపై B ప్రతి జనకం ఉంటుంది. ఎర్ర రక్తకణాలపై A, B ప్రతిజనకాలు రెండూ ఉన్నవారు AB గ్రూపునకు చెందుతారు. ఈ రెండు ప్రతిజనకాలూ లేనివారు O గ్రూపునకు చెందుతారు. A గ్రూపు రక్తాన్ని B గ్రూపు వారికి ఇస్తే A ప్రతిజనకానికి విరుద్దంగా B వ్యక్తి శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై రక్తం గడ్డకడుతుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అదేవిధంగా B గ్రూపు రక్తాన్ని A గ్రూపు వారికి ఇస్తే ఇదే సమస్య వస్తుంది. కాబట్టి A గ్రూపు వారికి A గ్రూపు రక్తాన్ని, B గ్రూపు వారికి B గ్రూపు రక్తాన్ని ఇవ్వాలి. ఐతే వీరిద్దరికీ O గ్రూపు రక్తాన్ని ఇవ్వొచ్చు. అదేవిధంగా AB గ్రూపు వారికి A, B, 0 గ్రూపు రక్తాన్ని ఇవ్వొచ్చు. కాబట్టి AB గ్రూపు వారు విశ్వగ్రహీతలు. O గ్రూపు వారి రక్తాన్ని అందరికీ ఇవ్వొచ్చు. కాబట్టి వీరు విశ్వదాతలు. వీరికి మాత్రం O గ్రూపు రక్తాన్నే ఇవ్వాలి. A, B ప్రతిజనకాలకు అదనంగా మనిషి ఎర్ర రక్తకణాలపై Rh ప్రతిజనకాన్ని కూడా ల్యాండ్ స్టీనర్, వీనర్ గుర్తించారు. ABO రక్త వ్యవస్థకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఎర్ర రక్తకణాలపై Rh ప్రతిజనకం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. దీన్ని కలిగి ఉన్నవారిని Rh పాజిటివ్ అని, లేనివారిని Rh నెగిటివ్ అని సంబోధిస్తారు. అరుదుగా ఎవరిలో లేని ప్రతిజనకం కొందరి ఎర్రరక్తకణాల్లో ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ బాంబే ప్రతిజనకం. బాంబే రక్త గ్రూపునకు చెందినవారిలో బాంబే ప్రతిజనకం (H) ఉంటుంది.
రక్త ప్రసరణ
శరీరంలో రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అకశేరుకల్లో నాడీ జనిత, సకశేరుకాలలో కండర జనిత గుండె ఉంటుంది. మనిషిలో నాలుగు గదుల గుండె ఉంటుంది. ఊపిరితిత్తుల మధ్యలో మీడియా సీనియం అనే కుహరంలో గుండె అమరి ఉంటుంది. గుండెలోని పై గదులు కర్ణికలు. కింది గదులు జఠరికలు. గుండె లయ ఒక కండర కణుపులో మొదలవుతుంది. దీన్ని లయారంభకం అంటారు. మానవుడి గుండెలో రెండు లయారంభకాలు ఉంటాయి. సిరాకర్ణికా కణుపు గుండె కుడికర్ణిక కుడివైపు పై భాగంలో ఉంటుంది. రెండోది కర్ణికా జఠరికా కణుపు. ఇది కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉంటుంది. సిరా కర్ణికా కణుపు వద్ద జనించిన సంకోచ తరంగాలు కర్ణికలకు మాత్రమే పరిమితమవుతాయి. దీని నుంచి సంకోచ తరంగాలను అందుకున్న కర్ణిక, జఠరిక కణుపు హిస్ కండరకట్ట ద్వారా జఠరికలకు చేరుతాయి. ఈ విధంగా మొత్తం గుండె సంకోచిస్తుంది. గుండె సంకోచం సిస్టోల్. గుండె సడలిక డయాస్టోల్. కీర్ణకల సంకోచం ద్వారా రక్తం జఠరికల్లోకి చేరుతుంది. జఠరికల సంకోచం ద్వారా మళ్లీ రక్తం కర్ణికల్లోకి చేరకుండా ప్రత్యేక కవాటాలు అడ్డుకుంటాయి. ఎడమ కర్ణిక, జఠరికల మధ్య అగ్రద్వయ లేదా మిట్రల్ కవాటం, కుడి కర్ణిక, జఠరికల మధ్య అగ్రత్రయ కవాటం ఉంటాయి.
శరీరంలోని సిరలు వివిధ భాగాల నుంచి సేకరించిన మలిన/ ఆమ్లజని రహిత రక్తాన్ని ఊర్ధ్వ, నిమ్న మహా సిరల ద్వారా గుండె కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. ఐతే ఒక్క పుపుస సిర మాత్రమే ఊపిరితిత్తుల నుంచి శుద్ద/ ఆమ్లజని సహిత రక్తాన్ని ఎడమ కర్ణికలోకి విడుదల చేస్తుంది. కర్ణికలు సంకోచిస్తాయి. జఠరికల్లోకి రక్తం చేరుతుంది. ఎడమ జఠరికలోకి చేరిన శుద్ద రక్తం మహాధమని ద్వారా శరీరంలోని ధమనుల్లోకి చేరుతుంది. కుడి కర్ణికలోకి చేరిన మలిన రక్తం ఒక పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ విధంగా శరీరంలోని ధమనులన్నీ గుండె ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తాన్ని అన్ని శరీర భాగాలకూ సరఫరా చేస్తాయి. ఒక పుపుస ధమని మాత్రమే గుండె కుడి జఠరిక నుంచి మలిన రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఈ రకంగా గుండె కుడి భాగంలో మలిన రక్తం, ఎడమ భాగంలో శుద్ధ రక్తం స్వతంత్రంగా సరఫరా కావడం ద్విరక్త ప్రసరణ అంటారు.
RELATED TOPICS

.jpg)



Pages