మొక్కల వర్గీకరణ

భూమిపై ఉండే మొక్కలను పుష్పించే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని రెండు విభాగాలుగా విభజించారు. అవి: 1) పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగాములు, 2) పుష్పించే మొక్కలు లేదా ఫానిరోగాములు. పుష్పించని మొక్కలు ప్రాథమికమైనవి. వీటిని తిరిగి థాలో ఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనే రకాలుగా విభజించారు. 

థాలో ఫైటా

కాండం, వేరు, పత్రాలు అనే నిర్మాణాలు నిర్దిష్టంగా ఉండని వాటిని థాలో ఫైటా మొక్కలు అంటారు. శైవలాలు, శిలీంద్రాలు థాలో ఫైటాకు చెందుతాయి. శైవలాలు ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. ఇవి స్వయం పోషకాలు. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, వాల్వాక్స్ లాంటివి శైవలాలకు ఉదాహరణ. శిలీంద్రాలు పరపోషిత థాలో ఫైటా జీవులు ఈస్ట్, బూజులు వీటికి ఉదాహరణ.

బ్రయోఫైటా 

ఈ మొక్కలు తడిగోడలు, తడినేల మీద పెరుగుతాయి. ఇవి దట్టంగా తివాచీలా లేదా వెల్వెట్ వస్త్రంలా మెత్తగా ఉంటాయి. ఈ మొక్కల కాండం నుంచి మూల తంతువులు లేదా వైజాయిడ్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి భూమిలోని లవణాలను, నీటిని గ్రహిస్తాయి. వీటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంథరీడియా, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియా అంటారు. బ్రయోఫైటా మొక్కలను సాధారణంగా మాస్ మొక్కలని పిలుస్తారు.

టెరిడోఫైటా

ఈ  మొక్కలు మరింత స్పష్టంగా వేరు, కాండం, పత్రాలు అనే నిర్మాణాలు ఉంటాయి. కాండం నుంచి అబ్బురపు వేర్లు ఉర్భవిస్తాయి. టెరిడోఫైటా మొక్కలను సాధారణంగా ఫెర్లు అంటారు. వీటి పత్రాలను ఫ్రాండ్సు అంటారు. వీటి అడుగు భాగాన సిద్ధబీజాశయ పుంజం (సోరస్) ఏర్పడి వీటిలో సిద్ధబీజాశయాలు ఏర్పడతాయి. వీటి జీవితచక్రంలో సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. ఫెర్న్ మొక్కలను ఎక్కువగా అలంకరణ కోసం పెంచుతారు.

పుష్పించే మొక్కలను ఫలాలు లేదా విత్తనాలు ఏర్పడే స్థానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) వివృత బీజాలు లేదా జిమ్నో స్పర్ములు 2) అవృత బీజాలు లేదా ఆంజియోస్పర్ములు. వివృత బీజ మొక్కలను నగ్న విత్తనాలున్న మొక్కలు అంటారు. ఇవి విత్తనాలను నేరుగా మొక్కపై ఉత్పత్తి చేస్తాయి. వీటిలోని పుష్పాలను శంకువులు లేదా కోన్స్ అంటారు. సైకస్, నీటమ్ లాంటివి వివృతబీజ మొక్కలకు ఉదాహరణ.

బీజదళాల సంఖ్యను బట్టి ఆవృతబీజాలను తిరిగి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) ద్విదళ బీజాలు 2) ఏకదళ బీజాలు. ద్విదళ బీజ విత్తనాల్లో రెండు బీజదళాలు ఉంటాయి. వీటిలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. చిక్కుడు, మామిడి, టొమాటో మొదలైనవి వీటికి ఉదాహరణ. ఏకదళ బీజ విత్తనాల్లో ఒకే బీజదళం ఉంటుంది. వీటిలో పీచువేరు వ్యవస్థ ఉంటుంది. వరి, గోధుమ, జొన్న, కొబ్బరి లాంటివి ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ. ఆవృత బీజాల నుంచే మానవుడికి అవసరమైన ఆహార పదార్థాలు, దుస్తులు లాంటివి సమకూరుతున్నాయి.


RELATED TOPICS 

విటమిన్లు 

జంతువుల వర్గీకరణ

రక్తకణాలు

రక్త వర్గాలు, ప్రసరణ

మానవ వ్యాధులు

మానవునిలో జీర్ణవ్యవస్థ

కిరణజన్య సంయోగక్రియ