జంతువుల వర్గీకరణ

జంతువులన్నింటిని వెన్నెముక లక్షణం ఆధారంగా రెండు రకాలుగా విభజించారు. అవి: 1) అకశేరుకాలు లేదా వెన్నెముకలేని జంతువులు 2) సకశేరుకాలు లేదా వెన్నెముక కలిగిన జంతువులు. 

అకశేరుకాలు : 

1. ప్రోటోజోవా

2. ఫొరిఫెరా

3. సీలెంటరేటా

4. ప్లాటి హెల్మింథిస్ని

5. మాటి హెల్మింథిస్

6. నిలేడా

7. ఆర్థ్రోపోడా 

8. మొలస్కా 

9. ఇఖైనోడర్మేటా 

ప్రోటోజోవా : ఇవి జంతువుల్లో ప్రాథమిక జీవులు. ఇవి ఏకకణయుతంగా నిర్దిష్ట కేంద్రకంతో ఉంటాయి. ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. అమీబా, పారామీషియం, వర్టి సెల్లా, ప్లాస్మోడియం, యూగ్లినా లాంటివి ప్రోటోజోవాజీవులకు ఉదాహరణ. 

పొరిఫెరాజీవులు : ఇవి బహుకణ జీవులు. వీటి శరీరంలో అనేక రంధ్రాలు ఉంటాయి. ఇవి స్థానబద్ద జీవులు. వీటికి ఉదాహరణ స్పంజికలు. 

సీలెంటరేటా : ఈ జీవులు రెండు పొరలతో కూడిన దేహాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. శరీరం మధ్యలో కుహరం ఉంటుంది. నోటి చుట్టూ స్పర్శకాలు లేదా టెంటకిల్స్ అనే నిర్మాణాలుంటాయి. ఇవి ఆహార సేకరణకు, గమనానికి ఉపయోగపడతాయి. హైడ్రా అనేది సీలెంటరేటాకు చెందిన జీవి.

ప్లాటి హెల్మింథిస్ : ఈ జీవులు బల్లపరుపుగా ఉండే జీవులు. వీటి శరీరంలో మూడు పొరలుంటాయి. కాబట్టి ఇవి త్రిస్తరిత జీవులు. ఈ విభాగంలో ఎక్కువగా జీవులు పరాన్న జీవనం గడుపుతాయి. ఉదాహరణకు మానవుడి జీర్ణనాళంలో నివసించే బద్దెపురుగు. 

నిమాటి హెల్మింథిస్ : ఇవి  పొడవుగా, స్తూపాకారంగా రెండు చివరల మొనదేలి ఉంటాయి. ఇవి దారపు పోగుల్లా ఉంటాయి. వీటికి ఉదాహరణ మానవుడి పేగులో నివసించే ఏలికపాము. 

అనిలెడా : ఈ జీవుల్లో శరీరం స్తూపాకారంగా ఉండి శరీరమంతా ఉంగరాల్లాంటి ఖండితాలు ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. వానపాము, జలగ వీటికి ఉదాహరణ.

ఆర్థ్రోపోడా : వీటికి కీళ్లతో కూడిన కాళ్లు ఉంటాయి. ఇవి జంతురాజ్యంలో అత్యధికంగా ఉండే జీవులు. ఈగ, బొద్దింక లాంటి కీటకాలతోపాటు సాలెపురుగు, తేలు, పీతలాంటి జంతువులు. ఈ విభాగానికి చెందుతాయి. 

మొలస్కా : మెత్తటి శరీరం ఉన్న జీవులు మొలస్కా విభాగానికి చెందుతాయి. వీటికి రక్షణగా శరీరంపైన పెంకు లాంటి కర్పరముంటుంది. ఇవి సముద్రాల్లో, మంచి నీటిలో నివసిస్తాయి. నత్త, ఆల్చిప్ప, ముత్యాలను ఏర్పరిచే ముత్యపు చిప్పలు వీటికి ఉదాహరణ. 

ఇఖైనోడర్మేటా : జీవుల చర్మం మందంగా ముళ్లతో ఉంటుంది. ఇవి పూర్తిగా సముద్రపు జీవులు. సముద్ర నక్షత్రం, సముద్ర దోసకాయలు, సీఅర్చిన్ లాంటి జీవులు వీటికి ఉదాహరణ.

సకశేరుకాలు

వెన్నెముక ఉన్న జంతువులు అభివృద్ధి చెందిన జీవులు. వీటిని చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనే విభాగాలుగా విభజించారు. 

చేపలు : ఇవి జలచర జీవనం గడుపుతాయి. వీటి శరీరంపై పొలుసులుంటాయి. రెండు గదుల గుండె ఉంటుంది. దేహ ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీటిని శీతలరక్త జీవులు అంటారు. ఉదాహరణకు సొరచేప, కొర్రమట్ట, క్యాట్ ఫిష్ మొదలైనవి. 

ఉభయచరజీవులు : ఇవి నీటిలోను, నేలపైనా జీవిస్తాయి. చర్మం తడిగా ఉండి, గుండె మూడు గదులతో ఉంటుంది. వీటికి చలించడానికి ఒక జంత అంగాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ కప్ప. 

సరీసృపాలు : ఇవి భూమిపై పాకే జంతువులు. వీటి శరీరంపై పొలుసులు ఉంటాయి. వీటి గుండె అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులతో ఉంటుంది. మొసలి, బల్లి లాంటి జీవుల్లో గమనానికి రెండు జతల అంగాలు ఉంటాయి. పాము, తాబేలు, మొసలి సరీసృపాలకు చెందిన జీవులు.

పక్షులు : ఇవి ఎగరడానికి తగిన దేహ అనుకూలనాలను చూపుతాయి. శరీరంపై ఈకలుంటాయి. ముందరి జత అంగాలు రెక్కలుగా మార్పు చెంది ఎగరడానికి ఉపయోగపడతాయి. నోరు ముందుకు సాగి ముక్కుగా మార్పు చెంది ఉంటుంది. ఇవి ఉష్ణరక్తజీవులు. శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారకుండా స్థిరంగా ఉంటుంది. నాలుగు గదుల గుండెతో ఉంటాయి. 

క్షీరదాలు : ఇవి క్షీరగ్రంథులను కలిగి ఉంటాయి. శరీరంపై వెంట్రుకలు, దంతాలు అనేక రకాలుగా ఉండి, విభాజక పటలం (డయాఫ్రమ్) ఉండటం వీటి ముఖ్య లక్షణం. ఇవి కూడా ఉష్ణరక్త జంతువులు. మానవుడు, కోతి తిమింగలం, ఆవు లాంటివి క్షీరదాలకు ఉదాహరణ.


 RELATED TOPICS 

విటమిన్లు 

మొక్కల వర్గీకరణ

రక్తకణాలు

రక్త వర్గాలు, ప్రసరణ

కిరణజన్య సంయోగక్రియ

మానవ వ్యాధులు

మానవునిలో జీర్ణవ్యవస్థ