మానవ వ్యాధులు

మన సాధారణ ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పు కనిపిస్తే దాన్ని వ్యాధి అనొచ్చు. లేదా సక్రమంగా పని చేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోలపరిచే పరిస్థితిని వ్యాధి అంటారు. 

వ్యాధులు రెండు రకాలు. అవి 1) పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉదాహరణకు తొర్రి పెదవి, పుట్టు చెవుడు, పుట్టు గుడ్డి మొదలైనవి. 2) ఆర్జిత వ్యాధులు. వ్యాక్తి జీవితకాలంలో సూక్ష్మజీవుల వల్ల లేదా పోషకాహార లోపం, గాయాలు లాంటి కారణాల వల్ల వచ్చే వ్యాధులను ఆర్జిత వ్యాధులు అంటారు. 

ఆర్జిత వ్యాధులు రెండు రకాలు. అవి: 1) ఇతరులకు వ్యాపించనివి. 2) ఇతరులకు వ్యాపించేవి (అంటు వ్యాధులు). మధు హేహం, రేచీకటి, రక్తపోటు, కీళ్లనొప్పులు లాంటివి ఒకరి నుంచి మరొకటి వ్యాపించవు. వైరస్, బ్యాక్టీరియా, శిలీంద్రాల్లాంటి సూక్ష్మ జీవుల వల్ల వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. వీటిని అంటు వ్యాధులు అంటారు.

అంటు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మానవ శరీరంలోకి ప్రవేశించే ముందు అవి ఉండే ప్రదేశాన్ని లేదా ఆవాసాన్ని ఆశ్రయం (రిజర్వాయర్) అంటారు. ఈ ఆశ్రయాలు మూడు రకాలు. అవి: 1) మానవ ఆశ్రయాలు 2) జంతు ఆశ్రయాలు 3) నిర్జీవ ఆశ్రయాలు. మానవుడిలో వైరస్, బ్యాక్టీరియా, శిలీంద్రాలు, ప్రోటోజోవా పరాన్న జీవులు ఆశ్రయం పొందుతూ వ్యాధులను కలిగిస్తాయి. కీటకాలు, ఎలుకలు, పందులు, కుక్కల్లాంటివి జంతు ఆశ్రయాలకు ఉదాహరణ. వీటిలో ఉన్న సూక్ష్మజీవులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మానవుడికి సంక్రమించి వ్యాధిని కలిగిస్తాయి. ఈ జంతు ఆశ్రయజీవుల్లో వ్యాధి కారక సూక్ష్మజీవులు ఉంటూ వాటికి హాని కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. ఏ ఆశ్రయజీవి అయితే సూక్ష్మజీవులను ఒకవ్యక్తి నుంచి మరోవ్యక్తికి వ్యాపింపజేస్తుందో దాన్ని వాహకం (Carrier) అంటారు. వాహకాలు వ్యాధిని ప్రత్యక్షంగా వ్యాప్తి చెందిస్తాయి. ఉదాహరణ మలేరియా వ్యాధికి ఆడ ఎనాఫిలిస్ దోమలు, ఫైలేరియా (బోదకాలు) వ్యాధికి ఆడ క్యూలెక్స్ దోమలు వాహకాలుగా ఉంటాయి. వాహకాలను అదుపులో ఉంచి వ్యాధులను నియంత్రించవచ్చు. గాలి, నీరు, నేల, మనుషుల నుంచి వచ్చే తుంపరల్లాంటి వాటిలో ఉండే సూక్ష్మజీవులు మానవులకు సంక్రమించి వ్యాధులను కలుగజేస్తాయి. ఇవన్నీ నిర్జీవ ఆశ్రయాలకు ఉదాహరణ. 

వ్యాధులు వ్యాపించే విధానం

ఆశ్రయంలో ఉండే వ్యాధి జనక సూక్ష్మజీవులు గాలి, నీరు, ఆహారం, కీటకాలు, ప్రత్యక్ష తాకిడి లాంటి వాటి ద్వారా వ్యాపించి వ్యాధులను కలగజేస్తాయి. వ్యాధి గ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వ్యాధి జనకాలు గాలిలో విడుదలవుతాయి. ఈ గాలిని ఆరోగ్యవంతుడైన మానవుడి పీల్చుకున్నప్పుడు వ్యాధి వస్తుంది. జలుబు, ఫ్లూజ్వరం, డిప్తీరియా, కోరింతదగ్గు, క్షయ, న్యూమోనియా లాంటివి ఈ విధంగానే వ్యాపిస్తాయి. కలుషితమైన నీరు లేదా ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటిలోని సూక్ష్మజీవులు మానవుడికి సంక్రమించిచ వ్యాధులను కలిగిస్తాయి. కలరా, టైఫాయిడ్, అతిసారం, అమీబియాసిస్, పోలియో లాంటివి నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. మలేరియా, బోదకాలు, డెంగీ, ఎల్లో ఫీవర్, చికున్ గున్యా లాంటివి దోమల వల్ల వ్యాపిస్తాయి. రేబిస్ వైరస్లు ఉన్న కుక్క కోతి, పిల్లి లాంటివి కరవడం వల్ల రేబిస్ వస్తుంది. నేలలో, కలుషితమైన వస్తువులపై ఉండే సూక్ష్మజీవుల వల్ల డిప్తీరియా వస్తుంది. గజ్జి, తామర లాంటివి ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాపిస్తాయి. 

వ్యాధి పద్ధతి

మానవుడికి సూక్ష్మజీవుల వల్ల వ్యాధి సంక్రమించి అది తగ్గేవరకు ఉన్న దశలను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) సంక్రమణదశ 2) పొదిగే కాలం 3) వ్యక్తమయ్యే దశ 4) అంత్య దశ. వివిధ రకాల ఆశ్రయాల్లో ఉన్న వ్యాధి జనకసూక్ష్మ జీవులు గాలి, నీరు, ఆహారం, కీటకాల్లాంటి వాటి ద్వారా మానవుడికి సంక్రమిస్తాయి. మానవ శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు వెంటనే వ్యాధిని కలిగించవు. దీనికి కొద్ది సమయం పడుతుంది. తక్కువ సంఖ్యలో మానవుడిలోకి చేరిన సూక్ష్మజీవులు సరైన కణజాలాన్ని ఎంచుకుని అక్కడ స్థిరపడి, తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటూ ఆ కణజాలాన్ని నష్టపరుస్తాయి లేదా విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మానవుడికి వ్యాధి వస్తుంది. ఇలా సూక్ష్మజీవులు ప్రవేశించిన నాటినుంచి వ్యాధి వ్యక్తమయ్యే దశ వరకు ఉన్న సమయాన్ని పొదిగే కాలం అంటారు. పొదిగే కాలం వ్యాధిని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు క్షయ 2-10 వారాలు, డిప్తీరియా 2-6 రోజులు, కోరింత దగ్గు 7-14 రోజులు, టైఫాయిడ్ 1-3 వారాల పొదిగే కాలం ఉంటుంది. పొదగే కాలంలో సూక్ష్మజీవులు తమ సంఖ్యను వృద్ధిచెందించుకుని ఆతిథేయిని నష్టపరచడం వల్ల రోగ లక్షణాలు వ్యక్తమవుతాయి. ఈ దశనే వ్యక్తమయ్యే దశ అంటారు. రోగ లక్షణాలు వేర్వేరు వ్యాధులకు వివిధ రకాలుగా ఉంటాయి. వీటిని బట్టి వైద్యులు వ్యాధిని నిర్ధారించి తగిన ఔషధాలను ఇస్తారు. చికిత్స వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు చనిపోయి వ్యాధి తగ్గుతుంది. ఈ దశనే వ్యాధి అంత్యదశ అంటారు. దీని తర్వాత రోగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కాలాన్ని రికవరీ పీరియడ్ గా వ్యవహరిస్తారు.

 RELATED TOPICS 

విటమిన్లు 

మొక్కల వర్గీకరణ

జంతువుల వర్గీకరణ

రక్తకణాలు

రక్త వర్గాలు, ప్రసరణ

కిరణజన్య సంయోగక్రియ

మానవునిలో జీర్ణవ్యవస్థ