కార్యనిర్వహణ అధికారాలు:

భారత రాజ్యాంగములోని 63 వ ప్రకరణ ప్రకారం కేంద్ర కార్యనిర్వహణ అధికారములన్నీ కూడా రాష్ట్రపతికి ఇవ్వబడినవి. భారత ప్రభుత్వ కార్యకలాపాలన్ని రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతాయి. కేంద్రప్రభుత్వ ఉన్నత అధికారులను నియమించు అధికారము రాష్ట్రపతికి గల ఒక ప్రధానమైన కార్యానిర్వహణ అధికారంగా చెప్పవచ్చును. రాష్ట్ర గవర్నర్లు, లెఫ్ట్సేంటు గవర్నర్లు, రాయబారులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ఛైర్మన్ మరియు సభ్యులు, ప్రధాన ఎన్నికల అధికారి, ఆర్థిక సంఘం అధ్యక్షుడు మొదలైనటువంటి ఉన్నత అధికారులందరు రాష్ట్రపతిచే నియమించబడతారు. ప్రధానమంత్రిని, ఆయన సలహాపై ఇతర కేంద్రమంత్రులను రాష్ట్రపతి నియమిస్తాడు. కేంద్ర పాలిత ప్రాంతాలను అజమాయిషీ చేయు బాధ్యత కూడా రాష్ట్రపతిదే. రాష్ట్రపతికి అధికారులను నియమించే అధికారమే కాకుండా తొలగించు అధికారము కూడ కలదు. రాష్ట్రపతి కేంద్రమంత్రులను వేరువేరుగా తొలగించగలడు. అటార్నీ జనరలను, గవర్నర్లలను మొదలైన వారిని తొలగించే అధికారము రాష్ట్రపతికి కలదు. 

సంబంధిత అంశాలు :  భారత రాష్ట్రపతి

శాసన నిర్మాణ అధికారములు: 

భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఒక అంతర్భాగము. భారత రాష్ట్రపతి కార్యనిర్వహక వర్గ అధిపతి అయినప్పటికి శాసనసభలో ఒక భాగమై ఉన్నాడు. రాష్ట్రపతియొక్క శాసన నిర్మాణ అధికారములు : రాజ్యాంగములోని 85 వ ప్రకరణ ప్రకారము కేంద్ర శాసనసభలను సమావేశపరచుట, పొడిగించుట , రద్దుపరచుట దేశములో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత పార్లమెంటు యొక్క తొలిసమావేశమును మరియు ప్రతి సంవత్సరము మొదటి సమావేశమును ఉద్దేశించి ప్రసగించుట. ఉభయ శాసనసభలు ఆమోదించిన బిల్లులపై తన ఆమోదముద్ర వేయుట. శాసనసభలో ఏదేని బిల్లును గూర్చి చర్చ జరుగుచున్నపుడు సలహాలు, సందేహాలు పంపుట, పెండింగ్ బిల్లుల గూర్చి సత్వర చర్యలు తీసుకోమని సందేశము పంపుట. ఉభయ సభలమధ్య బిల్లుల విషయములో ఏవైనా అభిప్రాయ బేధములు కలిగినపుడు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం. పార్లమెంటుకు మొత్తము 14 మందిని (12 మందిని రాజ్యసభకు, 2 లోకసభకు) నామినేట్ చేయడం, పార్లమెంటు సమావేశములో లేనపుడు ఏవైనా ముఖ్య ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై ఆర్డినెన్స్ జారీ చేయడం, ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ కమిషన్ మొదలగు సంస్థలు సమర్పించిన నివేదికలను పార్లమెంటు ముందు ఉంచడం. 

సంబంధిత అంశాలు :  ఉపరాష్ట్రపతి

న్యాయ నిర్వాహణధికారాలు: 

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారము, తొలగించు అకారము రాష్ట్రపతికి కలదు. 72 వ ప్రకరణలో రాష్ట్రపతి యొక్క ప్రత్యేక న్యాయధికారాలు పేర్కొనబడినవి. ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించుట లేదా వాయిదావేయుట, ఒక విధమైన శిక్షను మరొక విధమైన శిక్షగా మార్చుట లేదా క్షమించుట మొదలగు అధికారాలు కూడా రాష్ట్రపతికి కలవు. ఉరిశిక్ష విషయములో కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారము కలదు. ఇవేగాక 143 వ ప్రకరణ ప్రకారం కొన్ని ముఖ్య సమస్యలను సుప్రీంకోర్టు సలహాకై నివేదించే అధికారము కూడా రాష్ట్రపతికి కలదు. 

ఆర్థికాధికారములు:

ఆర్థిక బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టుటకు రాష్ట్రపతి అనుమతి తీసుకోనవలెను. ఈయన అనుమతి లేనిదే బిల్లును ప్రవేశపెట్టరాదు. కేంద్రం ప్రవేశపెట్టే సాంవత్సరిక బడ్జెటు రాష్ట్రపతి అనుమతి పొందిన తరువాతే పార్లమెంటులో ప్రవేశ పెట్టబడుతుంది. రాజ్యాంగంలోని 280 ప్రకరణ ప్రకారము ఒక ఆర్ధిక కమిషన్‌ను ప్రతి 5 సంవత్సరములకొకసారి రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ ఆర్ధిక కమిషన్ చేసిన సిఫార్సులను రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతాడు. ఇదేగాక ఆర్థిక సంబంధమైన సాంవత్సరిక నివేదకలు రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెటడం జరుగుతుంది. భారత ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. ఏవేని అత్యవసర ఖర్చులు ఏర్పడినప్పుడు రాష్ట్రపతికి ఈ నిధిని ఉపయోగించుకొను అధికారము కలదు. 

సంబంధిత అంశాలు : ప్రధానమంత్రి

సైనిక, మరియు దౌత్య సంబంధ అధికారాలు: 

భారత సర్వసైన్యాధక్షుడిగా రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. త్రివిధ దళాధిపతులను నియమించే అధికారం రాష్ట్రపతికి గలదు. రాష్ట్రపతి నేషనల్ డిఫెన్స్ కమిటీకి అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు. ఈ కమిటి నిర్ణయాల మీద ఆధారపడి యుద్ధాన్ని ప్రకటించుటకుగాని, విదేశాలతో సంధి జరుపుకొనుటకుగాని అతనికి అధికారము కలదు. భారత రాష్ట్రపతి భారతదేశము యొక్క అంతర్జాతీయ వ్యవహారాలన్నింటిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. మనదేశ రాయబారులను ఇతర దేశాలలో నియమించడం, మన దేశమునకు వచ్చు రాయబారులను ఆహ్వానించడం మొదలైన అధికారాలు రాష్ట్రపతికి గలవు, విదేశీ రాయబారులు మన దేశమునకు వచ్చినపుడు ముందుగా రాష్ట్రపతిని సందర్శించి ఆయన ఆమోదాన్ని పొందాలి. ఇవేగాక రాష్ట్రపతి, ఇతర దేశములతో భారత స్నేహ సంబంధాలు మెరుగు పరచేందుకు ఆయా దేశాలకు సందర్శించవచ్చు.

ఆసాధారణాధికారాలు:

భారత రాష్ట్రపతికి మూడు రాకాలైన అసాధారణాధికారాలు ఉన్నాయి. భారతదేశ భద్రతకు ఏ విదేశీ దాడివలనగాని లేదా దేశములోనే సాయుధపోరాటము వల్లగాని ప్రమాదము , వాటిల్లినప్పుడు 352 వ ప్రకరణ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి గలదు. ఈ సందర్భముగా ప్రాథమిక హక్కులను సైతం రద్దుపరచే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. 

సంబంధిత అంశాలు : గవర్నర్

దేశములో ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు 360 వ ప్రకరణను అనుసరించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారము రాష్ట్రపతికి కలదు. ఈ సందర్భముగా రాష్ట్రపతి ప్రభుత్వ ఉద్యోగుల జీత, భత్యములను తగ్గించుటకు ప్రభుత్వ గ్రాంటులను తగ్గించుటకు అధికారము కల్గి ఉంటాడు. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిలో రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడిన ఆర్థికబిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. 

ఏ రాష్ట్రములోనైనా రాష్ట్ర యంత్రాంగం రాజ్యాంగ సూత్రాలను అనుసరించి పనిచేయుట లేదని గవర్నరు నివేదిక ద్వారా రాష్ట్రపతి భావించినట్లయితే 356 వ ప్రకరణను అనుసరించి ఆ రాష్ట్రములో రాష్ట్రపతి పాలనను విధించే అధికారము రాష్ట్రపతి కలదు. 

సంబంధిత అంశాలు : ముఖ్యమంత్రి

భారత రాష్ట్రపతికి అసాధారణ అధికారాలు రాజ్యాంగములో కల్పించబడినప్పటికీ మొత్తము అధికారాలు కేవలము నామమాత్రమైనవే. ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించి అధికారాలన్నీ పార్లమెంటు ద్వారా ఏర్పరచబడిన మంత్రిమండలికే చెంది ఉంటాయి. రాష్ట్రపతి కేవలము మంత్రివర్గ సలహాలను అనుసరించి మాత్రమే పనిచేస్తారు. కానీ కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి స్వతంత్రముగా వ్యవహరించడం కూడా భారత రాజకీయాలలో కన్పిస్తుంది. భారత రాజ్యాంగము ప్రధానమంత్రి నియామకం గూర్చి స్పష్టంగా పేర్కొనబడనప్పటికీ పార్లమెంటరీ సాంప్రదాయమును అనుసరించి లోకసభలో అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీ నాయకుడిని ప్రధాని పదవికి రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. లోక్ సభలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో రాష్ట్రపతి దేశ స్థిరత్వాన్ని ఆధారంగా చేసుకొని తనకు గల అధికార పరిధి మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలడు.