భారత రాజ్యాంగము ప్రకారం భారతదేశమునకు ఒక రాష్ట్రపతి ఉంటాడు. రాజ్యాంగము ద్వారా లభించిన అధికారముతో అతడు భారతదేశ కార్యనిర్వాహకవర్గమునకు అధిపతిగా వ్యవహరిస్తాడు. భారతదేశములో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమును బ్రిటను రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పరచుకొన్నప్పటికీ రాష్ట్రపతి వంశపారపర్యంగా కాకుండా ఎన్నిక ద్వారా నియమించబడుతాడు. రాష్ట్రపతిని దేశానికి ప్రధమ పౌరునిగా వర్ణిస్తారు. 

ఎన్నిక విధానము:

భారత రాజ్యాంగంలోని 55వ ప్రకరణలో సూచించిన విధంగా భారత రాష్ట్రపతి పరోక్ష పద్ధతిద్వారా ఎన్నికవుతాడు. భారత రాష్ట్రపతిని ఎన్నుకోవటానికి ఒక (ఎలెక్టోరల్ కాలేజి) నియోజకగణము ఏర్పడుతుంది. పార్లమెంటులోని ఉభయసభల్లో ఎన్నిక కాబడిన సభ్యులు, రాష్ట్రాలలోని విధాన సభల్లో ఎన్నిక కాబడిన సభ్యులు దీనిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నిక విధానము ద్వారా జరుగుతుంది. ఈ ఎన్నిక విధానాన్ని ఐర్లాండు రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. 55వ ప్రకరణ రాష్ట్రపతి ఎన్నికల్లో సాధ్యమయినంతవరకు వివిధ రాష్ట్రాల ప్రాతినిధ్యములో ఏకరూపత ఉండాలని పేర్కొనడం వలన రాష్ట్ర శాసనసభ్యుని ఓటు విలువను కేంద్ర శాసనసభ్యుని ఓటు విలువను నిర్ణయించారు. ఈ సూత్రములను ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ ప్రతిపాదించగా రాజ్యాంగ పరిషత్ దీనిని ఆమోదించింది. 

ఓట్ల విలువలు ఈ క్రింది విధముగా నిర్ణయిస్తారు

ఓట్ల విలువను నిర్ణయించుటలో 1/2 కన్న శేషము ఎక్కువ వస్తే ఒకటిగా తీసుకొంటారు. తక్కువ వచ్చిన లెక్కలోకి తీసుకోరు. 

రాష్ట్రపతి అర్హతలు:

రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని అర్హతలను కలిగి ఉండవలెను. ఈ అర్హతలను గూర్చి 58 మరియు 59 ప్రకరణలు తెలియజేస్తాయి. భారతపౌరుడై ఉండవలెను. 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయి ఉండాలి. లోక్ సభకు సభ్యుడిగా ఎన్నిక అగుటకు కాలసిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. భారత ప్రభుత్వము లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వము లేదా ఏ స్థానిక అధికారము క్రింద ఆదాయము కలిగిన ఏ పదవిలో కూడా ఉండకూడదు. భారత పార్లమెంటుచే ఆమోదించబడిన ఇతర అన్ని అర్హతలు కలిగి ఉండాలి. 

రాష్ట్రపతి పదవి కాలము:

సాధారణముగా రాష్ట్రపతి పదవీకాలము 5 సంవత్సరములు. పదవి కాలము పూర్తికాకముందే రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయవచ్చును. అతడు తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. రాజ్యాంగములోని 61వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానము ద్వారా తొలగించవచ్చును. భారత తొలి రాష్ట్రపతి డాక్టరు బాబు రాజేంద్రప్రసాదు ఒక వ్యక్తి రాష్ట్రపతిగా రెండు పర్యాయాలు మించి ఉండకూడదనే సాంప్రదాయాన్ని నెలకొల్పారు.

రాష్ట్రపతి పదవికి ఏవిధంగానైనా ఖాళీ ఏర్పవడినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగుతాడు. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన నాయ్యమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతాడు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలు మించి ఉండరాదు. 6 నెలల లోపు రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. 

సంబంధిత అంశాలు :  ఉపరాష్ట్రపతి

రాష్ట్రపతిని తొలగించు విధానము:

61వ ప్రకరణ రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని సవివరముగా తెలుపుతుంది. రాజ్యాంగమును ఉల్లంఘించిన నేరమునకుగాని, జాతి వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న నేరానికిగాని, రాష్ట్రపతి పై మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశ పెట్టవచ్చును. అభియోగమును అమలుచేయు పద్ధతి: రాష్ట్రపతి పై ఆరోపణలు చేయు తీర్మానము పార్లమెంటులోని ఏ సభలోనైనను ప్రవేశ పెట్టవచ్చును. అయితే తీర్మానాన్ని ప్రవేశ పెట్టటానికి ముందుగా 14 రోజుల వ్యవధితో ఆ సభలోని సభ్యులలో కనీసము 4 వ వంతు సభ్యులు (1/4) సంతకము చేసి రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది.

సభలో చర్చించబడిన తరువాత ప్రత్యేక మెజారిటీతో తీర్మానమును ఆ సభ ఆమోదించవలెను. అనగా కనీసము సభలోని మొత్తము సభ్యులలో 2/3 వ వంతు తీర్మానాన్ని ఆమోదించాలి. మహాభియోగ తీర్మానములోని అంశములను గూర్చి రెండవసభ ఒక కమిటీ ద్వారా లేదా తానే స్వయంగా విచారిస్తుంది. ఈ విచారణలో రాష్ట్రపతి స్వయంగాగాని లేదా తన ప్రతినిధి ద్వారాగానీ తీర్మానంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చును. ఈ విచరణానంతరము ఆరోపణలు రుజువై రెండవ సభలోని సభ్యులు కూడా 2/3 వ వంతు ఓట్లతో తీర్మానాన్ని బలపరపచిన రోజు నుండి రాష్ట్రపతి తన పదవినుండి తొలగించబడతాడు. 

సంబంధిత అంశాలు : భారత రాష్ట్రపతి అధికారాలు

భారత రాష్ట్రపతి జీతభత్యాలు హోదా:

రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షములో ప్రమాణ స్వీకారము చేయవలెను. రాష్ట్రపతి జీతభత్యాలు పార్లమెంటు ద్వారా నిర్ణయింపబడతాయి. అయితే అతని పదవీకాల సమయములో పార్లమెంటు వానిని తగ్గించలేదు. పార్లమెంటు ఆమోదించిన బిల్లును అనుసరించి రాష్ట్రపతికి నెలకు 5,00,000 రూపాయల వేతనము మరియు ఇతర భత్యములు లభించును. అతని నివాసము ఢిల్లీలోని రాష్ట్రపతి భవనము. రాష్ట్రపతి ప్రధమ భారతపౌరుడు. పదవీ కాలములో అతనిపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదు. అరెస్టు చేయకూడదు. రాష్ట్రపతి యొక్క చర్యలు ఏ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలులేదు.

సంబంధిత అంశాలు : ప్రధానమంత్రి

భారత రాష్ట్రపతుల జాబితా

డా. రాజేంద్ర ప్రసాద్ - జనవరి 26, 1950 నుండి  మే 13, 1962

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ - మే 13, 1962 నుండి మే 13, 1967

డా.జాకీర్ హుస్సేన్ - మే 13, 1967 నుండి  మే 3, 1969

వరాహగిరి వేంకటగిరి(తాత్కాలిక)- మే 3, 1969 నుండి  జూలై 20, 1969

ఎం.హిదయతుల్లా (తాత్కాలిక)- జూలై 20, 1969  నుండి  ఆగష్టు 24, 1969

వరాహగిరి వేంకటగిరి-ఆగష్టు 24, 1969 నుండి  ఆగష్టు 24, 1974

ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ఆ -గష్టు 24, 1974 నుండి  ఫిబ్రవరి 11, 1977

బి.డి.జట్టి (తాత్కాలిక)-ఫిబ్రవరి 11, 1977 నుండి జూలై 25, 1977

నీలం సంజీవరెడ్డి - జూలై 25, 1977 నుండి జూలై 25, 1982

జ్ఞాని జైల్ సింగ్జూ -లై 25, 1982నుండి  జూలై 25, 1987

ఆర్.వెంకటరామన్- జూలై 25, 1987నుండి జూలై 25, 1992

డా.శంకర దయాళ్ శర్మ -జూలై 25, 1992 నుండి జూలై 25, 1997

కె.ఆర్.నారాయణన్ - జూలై 25, 1997 నుండి  జూలై 25, 2002

డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - జూలై 25, 2002 నుండి జూలై 25, 2007

ప్రతిభా పాటిల్ - జూలై 25, 2007నుండి  జూలై 25, 2012

ప్రణబ్ ముఖర్జీ - జూలై 25, 2012నుండి జూలై 25, 2017

రామ్‌నాథ్‌ కోవింద్‌ - జూలై 25, 2017 నుండి నేటి వరకూ


సంబంధిత అంశాలు : గవర్నర్