ప్రధానమంత్రి పార్లమెంటరీ ప్రజాస్వామ్యములో అత్యుత్తమమైన అధికారాలు గలిగి అధిక ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. లోకసభ నాయకుడు, మంత్రులలో ప్రథముడు. 

ప్రధాని నియామకము - అర్హతలు:

భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి నియామకము గురించి ప్రత్యేకంగా ఎక్కడా పేర్కొనలేదు. రాజ్యాంగపు 76వ ప్రకరణనునసరించి రాష్ట్రపతి ప్రధానమంత్రిని అతని సలహాపై ఇతర మంత్రులను నియమిస్తాడు. కానీ సాంప్రదాయాన్ని అనుసరించి లోక్ సభలో అధికస్థానాలు సంపాదించిన పార్టీ అధ్యక్షుణ్ణి రాష్ట్రపతి ప్రభుత్వము ఏర్పాటుచేయమని ఆహ్వానిస్తాడు. అయితే ఇది కేవలం సంప్రదాయము మాత్రమే.

సంబంధిత అంశాలు :  భారత రాష్ట్రపతి

ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నిక కావల్సిన అర్హతలు కల్గి ఉండాలి. అతను పార్లమెంటు సభ్యుడై ఉండాలి. ఒకవేళ పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తే, ఆ వ్యక్తి 6 నెలలలోపల పార్లమెంటుకు తప్పకుండా ఎన్నిక కావాల్సి ఉంటుంది. పార్లమెంటులో ప్రధానమంత్రి ఏ సభలో సభ్యుడుగా ఉండవలెననే విషయములో రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనలేదు. సాంప్రదాయమును అనుసరించి ప్రధానమంత్రి ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన లోకసభకు చెందివుండవలెను. శ్రీ లాల్‌బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధి ఆ సమయానికి రాజ్యసభలో సభ్యురాలుగా ఉండి కూడా ప్రధానమంత్రిగా నియమింపబడ్డారు. పి.వి.నరసింహారావు ప్రధాని అయ్యే నాటికి ఏ సభలో సభ్యులు కారు. దేవెగౌడ ప్రధాని అయ్యే నాటికి ఏ సభలో సభ్యులు కారు. 

సంబంధిత అంశాలు : భారత రాష్ట్రపతి అధికారాలు

ప్రధానమంత్రి హోదా, అధికారాలు:

రాజ్యాంగపు 74, 76, 78 ప్రకరణాలు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని హోదాను: ప్రధాని పాత్రను తెలియజేస్తాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యములో ప్రధాని ప్రజలకు నాయకత్వము వహిస్తాడు. పార్లమెంటుకు మంత్రివర్గము, మంత్రివర్గమునకు ప్రధానమంత్రి నాయకత్వము వహించును. ప్రధాని క్యాబినెట్కు మూలస్తంభము వంటి వాడు. వాస్తవానికి ప్రభుత్వాధికారమంతయూ ప్రధాని చేతుల్లో ఉంటుంది. ఈయన అధికారాలు చాల విస్తృతమైనవి. అయితే రాజ్యాంగము ఎక్కడను ప్రధానమంత్రికి విస్తృతమైన అధికారాలు ఇచ్చినట్లుగా కనబడదు. కాని రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, మన రాజ్యాంగ కర్తలు అనుసరించిన బ్రిటిషు పార్లమెంట్ విధానం ప్రకారం ప్రధానమంత్రికి కొన్ని అధికారాలు అప్పగించబడినవి.

సంబంధిత అంశాలు :  ఉపరాష్ట్రపతి

ప్రధానమంత్రి మంత్రిమండలిని ఏర్పరుస్తాడు. మంత్రివర్గ సంఖ్యను నియంత్రిస్తాడు. మంత్రివర్గ 'ర్యాంక్'లను నిర్ణయిస్తాడు మరియు వారికి వివిధ శాఖలను నిర్ణయించుటలో స్వతంత్ర అధికారం కలిగి ఉంటాడు. మంత్రులను రాజీనామా చేయమని కోరే అధికారము, వారిని తొలగించమని రాష్ట్రపతిని కోరే అధికారము, మంత్రులశాఖలను బదిలీ చేయు అధికారము మొదలైన అధికారాలు అన్నీ ప్రధానమంత్రి కల్గి ఉంటాడు. ప్రధానమంత్రికి లోకసభను రద్దుచేయమని రాష్ట్రపతిని కోరే అధకారము కూడా కలదు. ప్రధానమంత్రికి గల ఇతర అధికారాలు : క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. మంత్రుల మధ్య ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు లేదా వివాదాలు ఏర్పడ్డప్పుడు వాటిని పరిష్కరించి సమన్వయ పరుస్తాడు. వివిధ మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ ప్రధానిదే. క్యాబినెట్లో చర్చించే అంశాలపై సంపూర్ణాధికారం కలిగి ఉంటాడు. ఏవి అంశాలను చర్చించాలో, ఏఏ అంశాలు అవసరం లేదో ప్రధానే నిర్ణయిస్తాడు. ప్రధాని నీతి ఆయోగ్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు. ప్రధానిమంత్రి లోకసభకు నాయకుడి హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన విధానాలను, పార్లమెంటులో ప్రకటిస్తాడు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సరైన వివరణ ఇవ్వలేదని భావిస్తే తను కల్పించుకొని ఆ ప్రశ్నలకు వివరణ ఇస్తాడు. ప్రధానమంత్రి రాష్ట్రపతికి, మంత్రిమండలికి మధ్య సంధాన కర్తగా కూడా వ్యవహరిస్తాడు.

సంబంధిత అంశాలు : గవర్నర్