భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహకవర్గానికి గవర్నర్ అధిపతిగా ఉంటారు. దేశమంతటికి రాష్ట్రపతి ప్రాధాన్యత వహించినట్లే రాష్ట్రమునకు గవర్నర్ ప్రాధాన్యత వహిస్తాడు. భారత రాజ్యాంగములోని 154వ ప్రకరణను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారమంతయు గవర్నరు అప్పగించబడినది.

నియామకము : 

155వ ప్రకరణను అనుసరించి రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు. సాధారణముగా గవర్నర్ పదవీకాలము 5 సంవత్సరములు కానీ గవర్నర్ రాష్ట్రపతి ఇష్టము ఉన్నంతకాలము మాత్రమే అధికారములో కొనసాగుతారు. గవర్నర్ తన పదవీకాలము లోపు ఏదైనా కారణం వలన రాజీనామా చేయవచ్చు లేదా రాష్ట్రపతిచే తొలగించబడవచ్చును. గవర్నర్ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపవలెను. ఒక వ్యక్తి ఎన్ని మార్లు అయినా గవర్నర్‌గా నియమింపబడవచ్చును. సాధారణముగా ఒక రాష్ట్రమునకు ఒకే గవర్నర్ ఉంటాడు. అయితే 1956లో సవరించిన రాజ్యాంగమును అనుసరించి ఒక వ్యక్తిని రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్ గా నియమింపవచ్చును. 

అర్హతలు: 

గవర్నర్ నియమింపబడు వ్యక్తి భారతపౌరుడై ఉండాలి. కనీసం 15 సంవత్సరములు నిండిన వయస్సు కలిగినవాడై ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములలో ఏ లాభదాయకమైన వదవిలో ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర శాసనసభలలో సభ్యుడిగా కూడా ఉండకూడదు. గవర్నర్ నియామకములో కొన్ని సాంప్రదాయాలు పాటింపబడతాయి. సాధారణముగా ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్ర గవర్నర్ గా నియమించరు. అలాగే ఒక రాష్ట్రానికి గవర్నర్ ను నియమించుటకు ముందుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించటం కూడా ఒక సాంప్రదాయమే.

సంబంధిత అంశాలు :  భారత రాష్ట్రపతి

జీతభత్యాలు-స్థానము : 

రాజ్యాంగములోని రెండవ షెడ్యూలు ప్రకారము గవర్నర్ నెలసరి జీతము రూ.3,50,000. ఇవికాక ఇతర సౌకర్యాలు ఉంటాయి. గవర్నర్‌కు ఉచిత నివాససౌకర్యము కలుగచేయబడుతుంది. గవర్నర్ పదవి రాజ్యాంగం కొన్ని మినహాయింపులు కల్పించినది. గవర్నర్ తన అధికారాలను నిర్వర్తించుటలో ఏ న్యాయస్థానమునకు జవాబుదారీ కాదు. అతనిపై పదవిలో ఉన్నంత వరకు ఏ క్రమినల్ కేసులు పెట్టరాదు. 361 వ అధికరణ ప్రకారం అరెస్టు చేయరాదు. గవర్నర్‌ సివిల్ కోర్టులో దావా వేయాలంటే రెండునెలలు ముందుగా నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. 

అధికారాలు : 

1. కార్యనిర్వాహణాధికారాలు : 

రాజ్యాంగములోని 166వ ప్రకరణను అనుసరించి రాష్ట్ర సకల కార్యనిర్వాహణాధికారాలు గవర్నర్ కు ఇవ్వబడ్డాయి. ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులు, విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు, అడ్వకేట్ జనరల్ మొదలైన వారిని గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికి గవర్నర్ అధ్యక్షుడిగా (ఛాన్సలర్) వ్యవహరిస్తాడు. రాష్ట్ర పరిపాలానా వ్యవహారాలను రాష్ట్రపతి కోరినప్పుడు ఆయనకు నివేదిస్తాడు. మొదలైనవి గవర్నర్ నిర్వహించు కార్యానిర్వాహణాధికారాలలో ముఖ్యమైనవి. 

సంబంధిత అంశాలు : భారత రాష్ట్రపతి అధికారాలు

2 శాసనా నిర్మాణాధికారాలు : 

168వ ప్రకరణను అనుసరించి రాష్ట్ర శాసనసభలో గవర్నర్ అంతర్భాగము. అందుచేత గవర్నర్ కు కొన్ని శాసనాధికారాలు కూడా ఉంటాయి. రాష్ట్ర శాసనసభ సమావేశపరచుట, పొడిగించుట, రద్దుచేయుట.సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పాటైన నూతనసభనుద్దేశించి, ప్రతిసంవత్సరము ఏర్పాటు అయిన ప్రథమ సమావేశమును ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తాడు. శాసనసభలచే ఆమోదింపడిన బిల్లులు గవర్నర్ యొక్క ఆమోదముద్రతో చట్టాలుగా మారుతాయి. కనుక కొన్ని ప్రత్యేక బిల్లులను మాత్రము గవర్నర్ రాష్ట్రపతియొక్క అనుమతి కొరకై పంపగలడు. ఆర్థిక బిల్లులను, బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టుటకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఆర్డినెన్సులను జారీచేయు అధికారము గవర్నరు కలదు. గవర్నర్‌కు రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను నియమించు అధికారము ఉంది. ఒక వేళ ఆ రాష్ట్రములో విధానమండలి ఉంటే దానిమొత్తము సభ్యులలో 1/6వ వంతు సభ్యులను నియమించే అధికారము కూడా గవర్నర్‌కు కలదు. 

3. న్యాయనిర్వహణాధికారాలు : 

కొన్ని అత్యవసర పరిస్థితులలో గవర్నర్ రాష్ట్ర న్యాయస్థానాలు విధించిన శిక్షలు తగ్గించవచ్చు. వాయిదా వేయవచ్చు రద్దు చేయవచ్చు/క్షమించవచ్చు.. 161 అధికరణ ప్రకారం గవర్నరుకు గల ఈ న్యాయాధికారాలు ఆయన పాలించే రాష్ట్రానికే పరిమితమై ఉంటాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకములో రాష్ట్రపతి సాధారణముగా గవర్నర్‌ను సంప్రదిస్తాడు. ఇదిగాక జిల్లా న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారము గవర్నర్‌కు గలదు. రాజ్యాంగానికి రక్షకుడిగా కూడా గవర్నర్ వ్యవహరిస్తాడు.

సంబంధిత అంశాలు :  ఉపరాష్ట్రపతి

ప్రత్యేక అధికారాలు : 

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినపుడు లేదా ఆర్థిక అస్థిరత్వము ఏర్పడినపుడు లేదా రాజ్యాంగ సూత్రాలను అనుసరించి ఆ రాష్ట్రపాలన కొనసాగక పోయినప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక సమర్పించి రాష్ట్రములో రాష్ట్రపతిపాలన ప్రవేశపెట్టమని రాష్ట్రపతిని గవర్నర్ అభ్యర్థించవచ్చు. ఇది రాష్ట్ర గవర్నర్‌కు గల ప్రత్యేక అధికారము.

సంబంధిత అంశాలు : ప్రధానమంత్రి