1942 ఏప్రిల్ 6 న విశాఖపట్నం, కాకినాడ మీద జపాన్ యుద్ధ విమానాలు బాంబులు వేశాయి. అప్పుడు ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని గుంటూరుకు తరలించారు. మే 1, 1942 న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అలహాబాద్ లో సమావేశమై, స్వాతంత్ర్యాన్ని ప్రాతిపదికగా గ్రహించి మాత్రమే భారతదేశం బ్రిటతో గాని, ఏ ఇతర దేశంతో గాని వ్యవహరించడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.
జూలై 6 న వార్థాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీజీ సలహాతో ఒక తీర్మానాన్ని రూపొందించింది. అందులో భారత భూమిపై బ్రిటీష్ వారి పాలన అంతం కావలెనని, దాస్యబద్దమగు భారతదేశం తననుగాని, తక్కిన ప్రపంచాన్ని గాని నాజీ వాదం నుండి, ఫాసిజం నుండి సైనిక వాదం నుండి తదితర విభిన్న సామ్రాజ్య వాదాలనుండి రక్షింపజాలదని స్పష్టం చేసింది. ఆ తర్వాత 1942, ఆగస్టు 8 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమైంది. ఆ సమావేశంలో గాంధీజీ ప్రసంగిస్తూ 'పోరాటం వల్ల మన స్వాతంత్ర్యాన్ని ఆర్జించి తీరుతామని ఇది తన జీవితంలో తుది పోరాటమని పేర్కొన్నారు. ఆయన ప్రసంగం తర్వాత కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
బ్రిటిష్ అధికారం భారత భూమి నుండి వెంటనే వైదొలగాలని, భారత స్వాతంత్ర్యం గుర్తింపబడాలని, భారతదేశం తనను తాను పరిపాలించుకోవడానికి బాధ్యతాయుత స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడవలెనని ఆ తీర్మానం వాంఛించింది. అంతేగాక అహింసా సూత్రబద్దంగా ఒక ప్రజా పోరాటాన్ని కొనసాగించడానికి కావలసిన చర్యలు తీసుకొను అధికారాన్ని వర్కింగ్ కమిటీకి ఈ తీర్మానం కల్పించింది. ఈ తీర్మానం ఆమోదింపబడిన వెంటనే సమావేశానికి హాజరైన ప్రముఖ కాంగ్రెస్ నాయకులనేగాక, దేశంలోని ప్రముఖ కాంగ్రెస్ వాదులను ప్రభుత్వం అరెస్టుచేసి, ఖైదీలుగా నిర్భంధించింది.
కర్నూలు సర్క్యులర్ (ఆంధ్ర సర్కులర్):
బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను ముందుగానే ఊహించిన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ ఒక నిర్దేశ పత్రాన్ని (సర్కులర్) అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి పది రోజులు ముందుగానే జారీచేసింది. ఈ సర్క్యులర్‌ను 1942, జూలై 29 న కళావెంకటరావు రూపొందించారు. ఈ సర్క్యులర్ ప్రతులు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాలన్నింటికి పంపబడినను కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఆఫీసును శోధించినపుడు మాత్రమే ఈ ప్రతులు లభించినందువలన దీనికి 'కర్నూలు సర్క్యులర్' అని పేరు వచ్చింది. క్విట్ ఇండియా తీర్మానం తర్వాత డిటెన్యూలుగా తీసుకొని పోబడిన వారిలో డా|| భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాలరెడ్డి మున్నగువారున్నారు.
కర్నూలు సర్కులర్ లో గాంధీజీ ఉత్తర్వు ఇచ్చిన తర్వాతనే శాసనోల్లంఘనోద్యమం జర్మనుల మెరుపుదాడి రీతిలో మొదలు పెట్టవలెనని ఉన్నది. అహింసా విధానం తు.చ. తప్పకుండా ఆ ఉద్యమంలో అనుసరింపవలెనని ప్రభుత్వం ఏర్పరచిన ఏ చట్టాన్ని ధిక్కరించినా అహింసా నియమానికి లోబడి ఉండవలెనని అందులో చెప్పబడింది. ఈ సర్క్యులర్ జిల్లా సంఘాలన్నింటికీ పంపబడింది. ఆంధ్రా అంతట టెలిఫోన్ తీగలు తెంపడం, గొలుసులాగి రైళ్ళు ఆపడం, కార్మికులు సమ్మెలు జరపడం, టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయడం, లాయర్లు కోర్టులను బహిష్కరించడం మున్నగునవి ఎన్నో దీనిలో ఉన్నాయి. ఉద్యమాన్ని దశలవారీగా నడపాలని ఈ సర్క్యులర్ లో సూచించారు. అవి : నిషేధపుటాజ్ఞలు ఉల్లంఘించడం, ఉప్పు తయారు చేయడం, నిషేధింపబడిన సంఘ సభ్యులు బహిరంగంగా తిరగడం, పన్నుల నిరాకరణ, ప్రభుత్వ భవనాలపై కాంగ్రెస్ పతాకాలు ఎగరవేయడం, కాంగ్రెస్ వారు కాంగ్రెసేతరులు అని భేదం పాటించకుండా ప్రజలందరిని ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయాలన్నారు. ఈ విధంగా క్విట్ ఇండియా ఉద్యమానికి ఆంధ్ర ప్రాంతం సన్నద్ధమైంది. పోరాటాన్ని తుది వరకు కొనసాగించాలనే ఆదేశాలతో పాటు 'విజయమో - వీరస్వర్గమో' అనేది ఈ పోరాట నినాదంగా ఇవ్వబడింది. ఈ పోరాటంలో పాల్గొనే వారు ఖద్దరు నూలువడికి, ఖద్దరును ధరించేవారై యుండవలెననే నియమాన్ని కాంగ్రెస్ సడలించినందువలన సామాన్య ప్రజలు కూడా ఈ ఉద్యమంలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం ఇవ్వబడింది.
ఆంధ్రలో ఉద్యమ ప్రభావం
1942, ఆగస్టు 9 న బొంబాయిలో కాంగ్రెస్ నాయకులందరి అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఆంధ్రలో సమావేశాలు జరిపి ప్రభుత్వ చర్యను ఖండించారు. ఊరేగింపులు, ప్రదర్శనలు జరిపారు. దుకాణాలు మూసివేశారు. దుకాణాలు తెరిచి అందులో వున్న సామానులు అమ్మవలసినదని, పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వర్తకులు ఖాతరు చేయలేదు. విదేశీ వస్త్రాలు, కల్లు అమ్మకాలకు వ్యతిరేకంగా పికెటింగులు చేశారు. ఆంధ్రాలో ప్రముఖ నాయకులనందరినీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. క్రమేణా కార్యకర్తలను కూడా కస్టడీలోనికి తీసుకున్నారు. చాలా సందర్భాలలో కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ వారు ఇచ్చిన సర్కులర్ ధోరణిలోనే ఆంధ్రాలో ఉద్యమం కొనసాగింది. అయితే అనుకున్నంత అహింసాయుతంగా మాత్రం జరగలేదు. ఈ ఉద్యమంలో ఆంధ్రతో సహా యావద్భారత దేశం నలుమూలల్లోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఉద్యమం విద్యార్థి లోకాన్ని బాగా ఆకట్టుకొన్నది. అందువలన విద్యార్థి సమ్మెలు ఎక్కువగా జరిగాయి. అంతేగాక ప్రభుత్వ ఆస్తులగు రైల్వే స్టేషన్లను తగులబెట్టడం ఈ ఉద్యమంలో కనిపించే మరో ప్రత్యేక లక్షణం.
RELATED TOPICS
Pages