ఆంగ్లేయులు వ్యాపారరీత్యా భారతదేశం వచ్చి స్వదేశీ రాజుల బలహీనతను ఆసరా చేసుకుని మొత్తం దేశాన్ని ఆక్రమించారు. వారి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంగ్లేయుల ఆచార వ్యవహారాల్లో తలదూర్చడం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటును విఫలం చేశారు. అనంతరం 1858లో బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలనలోకి భారతదేశం వచ్చింది. వీరి పాలనలో రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఆంగ్ల పాశ్చాత్య విద్య వల్ల ప్రజల ఆలోచనావిధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంగ్ల విద్య వల్ల వివిధ తత్వవేత్తల భావాలను అర్థం చేసుకున్నారు. ఇదే సమయంలో మూఢాచారాలు, మూఢ నమ్మకాలతో నిండి ఉన్న జాతిని ప్రముఖ సంఘ సంస్కర్తలైన రాజారామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి మొదలైనవారు సంస్కరించి ప్రజల్లో జాతీయ భావం, ఆధునిక వాదాలు కల్పించారు. ప్రజలు బ్రిటిష్ వారి విధానాలతో విసుగుచెందారు. 1875లో సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. 1883లో ఆంగ్లేయులకు, భారతీయులకు సమానత్వం కల్పిస్తూ రిప్పన్ ప్రతిపాదించిన ఇల్బర్ట్ బిల్లు ఆంగ్లేయుల తీవ్ర వ్యతిరేకత వల్ల మార్పునకు లోనైంది. దీనివల్ల ఆంగ్లేయులు భారతీయులను తమతో సమానంగా చూడరని అర్థమైంది. అందుకే ఉద్యమాల ద్వారా ప్రభుత్వ విధానాన్ని మార్చవచ్చనే భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఏ ఓ హ్యూమ్ అనే ఆంగ్లేయ అధికారి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు. ఆంధ్రదేశంలో జాతీయభావం

1858-1885 సంవత్సరాల మధ్య ఆంధ్రదేశంలో సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు జరిగాయి. బళ్ళారి క్రిస్టియన్ అసోసియేషన్ తెలుగులో మొదటి పత్రిక సత్య దూతను స్థాపించింది. 1864లో తత్వబోధిని అనే పత్రికను వేదసమాజ్ స్థాపించింది. 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్రప్రకాశిక అనే మొదటి తెలుగు రాజకీయ వారపత్రికను స్థాపించాడు. 1905 నాటికి 20 తెలుగు పత్రికలు వెలుగులోకి వచ్చాయి. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్, 1884లో గాజుల లక్ష్మీనరసింహశెట్టి ఆధ్వర్యంలో మద్రాస్ మహాజన సభలు స్థాపితమయ్యాయి. మద్రాస్ మహాజనసభకు రంగయ్యనాయుడు, ఆనందాచార్యులు అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండేవారు. తరువాత కాలంలో కాకినాడ లిటరరీ అసోసియేషన్ స్థాపితమైంది. ఇలా ఏర్పడ్డ పత్రికలు, సంఘాలు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను, లోపాలను విమర్శిస్తూ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందింపజేశాయి.

భారత జాతీయ కాంగ్రెస్-ఆంధ్రదేశం

బొంబాయిలో 1885లో జరిగిన ప్రధమ కాంగ్రెస్ సమావేశానికి ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు హాజరయ్యారు. 1886లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి 21 మంది ఆంధ్ర ప్రతినిధులు హాజరయ్యారు. 1891లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు ఆనందాచార్యులు అనే ఆంధ్రుడు ఆంధ్రదేశంలో జిల్లా సంఘాలను స్థాపించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రప్రథమంగా 1891లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం ఏర్పడింది. 1902లో కొండా వెంకటప్పయ్య కృష్ణా పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో ప్రముఖ పత్రికగా పేరు గాంచింది. 1885-1905 ల మధ్య భారత జాతీయ కాంగ్రెస్ మితవాదుల నాయకత్వంలో సాగింది. ఈ సమయంలో వీరు తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు, విజ్ఞప్తులు, పిటిషన్ల ద్వారా ప్రభుత్వానికి మొరపెట్టుకునేవారు. దీన్ని బాలగంగాధర్ తిలక్ రాజకీయ యాచనగా అభివర్ణించాడు. 1904 నాటికి తిలక్ నాయకత్వంలో అతి వాదులు బలపడ్డారు. 1905లో జపాన్ చేతిలో రష్యా ఓడిపోవడాన్ని భారతీయులు హర్షించారు. ఆంధ్రలో ఆదిపూడి సోమనాధరావు 'జపాను చరిత్ర' అనే గ్రంధాన్ని రాసి మునగాల రాజా వెంకటరంగారావుకు అంకితమిచ్చాడు. రాజా తన కుమారులకు టోగో, నోగి అనే జపాన్ సైనికాధికారుల పేర్లు పెట్టాడు. రామబ్రహ్మం 'జపానీయం' అనే గ్రంధాన్ని రాశాడు. బెంగాల్ విభజన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 జులై 7న పరిపాలనా సౌలభ్యం పేరిట బెంగాలను రెండు రాష్ట్రాలుగా విభజించాడు. దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. దీంతో పెద్ద ఉద్యమం జరిగింది. దీన్నే 'వందేమాతరం లేదా స్వదేశీ ఉద్యమం' అంటారు. ఈ సందర్భంగా బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఆంగ్లేయులు విభజించి పాలించు అనే పద్ధతిలో భాగంగా హిందూ ముస్లింలను విడదీయాలని కుట్ర పన్నారని భావించి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమాన్ని లేవదీశారు. దీనికి లాల్, బాల్, పాల్ గా పిలిచిన లాలాలజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ నాయకత్వం వహించారు.


 RELATED TOPICS   

ఆంధ్రదేశంలో వందేమాతర ఉద్యమం

ఆంధ్రదేశంలో హోంరూల్ ఉద్యమం 

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -1

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -2

ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం