ప్రథమ ప్రపంచ సంగ్రామం 1914లో మొదలైంది. సూరత్ సమావేశంలో విడిపోయిన అతివాద, మితవాద వర్గాలు లక్నో కాంగ్రెస్ సమావేశంలో కలిసిపోయాయి. ఇలాంటి వాతావరణంలో జాతీయోద్యమానికి హోంరూల్ ఉద్యమం జీవం పోసింది. 1916 ఏప్రిల్ లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్య సాధన కోసం పుణేలో హోంరూల్ లీగ్ ను స్థాపించారు.

అనిబీ సెంట్ అనే ఐరిష్ వనిత 1916 సెప్టెంబర్ లో మద్రాసులో హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆంగ్లేయ సార్వభౌమాధికారానికి లోబడి భారతదేశానికి స్వయంపాలన కల్పించడం ఉద్యమ లక్ష్యం. ఆంధ్రపత్రిక, దేశమాత, శశిరేఖ మొదలైన ఆంధ్రపత్రికలు దీన్ని ఆహ్వానించాయి. ఆంధ్రలో ఈ ఉద్యమప్రచారం కోసం గాడిచర్ల హరిసర్వోత్తమరావు కార్యదర్శిగా ఒక ప్రత్యేక హోంరూల్ లీగ్ శాఖ ఏర్పడింది. నాగేశ్వరరావు కొండా వెంకటప్పయ్య, కె.వి. రెడ్డి నాయుడు మొదలైనవారు ఈ లీగ్ లో చేరారు. ఈ సందర్భంగా స్వరాజ్య ఉద్దేశం. స్వతంత్రవర్ధన పత్రం, నూతన హైందవ మాతృగీతం, స్వరాజ్యం కోరడానికి కారణాలు మొదలైన కరపత్రాలను ప్రజలకు పంచి హరి సర్వోత్తమరావు ఉద్యమానికి మరింత ప్రచారం చేశారు. 

ఆంధ్రలో అనిబీసెంట్ పర్యటన

అనిబీసెంట్ 1916లో ఆంధ్రదేశంలో పర్యటించి రాజమండ్రి, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో బహిరంగ ఉపన్యాసాలిచ్చారు. స్వాతంత్ర్యం లేకుండా మనుగడ నిత్యమరణంలాంటిదని అది జీవనం కాదు.. జీవన్మరణమని ఆమె అన్నారు. 1914 జనవరిలో ఆమె ప్రారంభించిన 'కామన్వెల్' ఆంగ్ల పత్రిక జులైలో ప్రారంభించిన 'న్యూ ఇండియా' పత్రికల ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శించారు. యువ క్రైస్తవ సంఘం (వై.ఎం.సి.ఎ.) కి పోటీగా యువభారతీయ సంఘం (వై.ఎం.ఐ.ఎ.) స్థాపించారు. 1916 మే లో జాతీయ విద్యావిధాన వ్యాప్తికి మదనపల్లి కేంద్రంగా జాతీయ కళాశాలను స్థాపించారు. ఐర్లండ్ పత్రికా విలేకరి జె. హెచ్. కజిన్స్ ఈ కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్. 1917 నాటికి ఆంధ్రలో 52 హోంరూల్ లీగ్ శాఖలు ఏర్పడ్డాయి. విశాఖపట్నం, గంజాం, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సమావేశాల్లో స్వపరిపాలనకు అనుకూలంగా తీర్మానాలను ఆమోదించారు. ఉద్యమానికి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక ప్రభుత్వం అణచివేతకు దిగింది. విద్యార్థులు రాజకీయ సమావేశాలకు హాజరు కారాదంటూ ఉత్తర్వులు జారీచేసింది.

1917 జూన్ 17న మద్రాసు ప్రభుత్వం అనిబీసెంట్ తో పాటు ఆమె అనుచరులైన అరెండల్, వాడియాలను ఉదకమండలంలో అరెస్ట్ చేసింది. ఈ నిర్బంధంతో ఆంధ్ర దేశమంతటా నిరసన వ్యక్తమైంది. మద్రాసులో జరిగిన సభకు బి.ఎన్. శర్మ అధ్యక్షత వహించారు. అనిబీసెంట్ నిధి కోసం విరాళాలా సేకరించారు. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అనేక చోట్ల, ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనను గమనించిన ప్రభుత్వం అనిబీసెంట్ ను విడుదల చేసింది. ఈ బ్రిటిష్, ప్రభుత్వం 'విభజించు, పాలించు' సూత్రాన్ని అమలుచేసి హోంరూల్ విజృంభణను అరికట్టడానికి బ్రాహ్మణేతరులను ప్రోత్సహించింది. ఫలితంగా త్రిపురనేని రామస్వామి చౌదరి అధ్యక్షతన బెజవాడలో బ్రాహ్మణేతరుల సభ జరిగింది. బాలగంగాధర్ తిలక్ మద్దతు వల్ల 1918లో ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెస్ సర్కిల్ ఏర్పడింది. 1918 జూలైలో మాంటెగ్ - ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలను ప్రకటించారు. దీంతో రాష్ట్రాల్లో ద్వందపరిపాలన అమల్లోకి వచ్చింది. ఇవి జాతీయ వాదులకు అశాభంగం కలిగించాయి. వీటికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో నిరసన సభలు జరిగాయి.


 RELATED TOPICS   

ఆంధ్రదేశంలో జాతీయోద్యమం

ఆంధ్రదేశంలో వందేమాతర ఉద్యమం

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -1

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -2

ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం