వందేమాతరం ఉద్యమం 1906 నుంచి 1911 వరకు ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసింది. బ్రిటిష్ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, ఆంగ్ల పాఠశాలలను వదిలి జాతీయ విద్యాలయాలను స్థాపించడం ఆంగ్ల న్యాయస్థానాల బహిష్కరణ, శాంతియుత శాసనోల్లంఘన, పన్నుల చెల్లింపు నిరాకరణ మొదలైన కార్యక్రమాలు వందేమాతరం ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయమయ్యాయి. మద్రాసులో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులు వందేమాతర ఉద్యమ ప్రథమసమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి 'స్వదేశీ మిత్రన్' సంపాదకుడు జి. సుబ్రహ్మణ్య అయ్యర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొమఋజు లక్ష్మణరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి మొదలైనవారు పాల్గొన్నారు. స్వదేశీలీగ్ అనే విద్యార్థి దళం ఏర్పడింది. 

బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన

1907 ఏప్రిల్ లో కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు ఆంధ్రదేశంలో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ఏర్పాటు చేశారు. పాల్ పర్యటన విజయనగరం నుంచి ప్రారంభమైంది. విజయనగరం, విశాఖపట్నాల్లో పాల్ పర్యటనకు పెద్దగా స్పందన రాలేదు. ఏప్రిల్ 17న కాకినాడ వచ్చారు. ఇక్కడ ఆయన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. అక్కడనుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ మాదెళ్ళ సారయ్య ఇంట బస చేశారు. పాల్ ఇక్కడ స్వరాజ్యం , స్వదేశి, ఇహిష్కరణ, బ్రహ్మసమాజం వంటి విషయాలపై ఉపన్యాసాలివ్వడమేకాక, గోదావరి స్వదేశీ పోర్టును ప్రారంభించారు. బాలభారతి సమితి పాల్ పర్యటన విజయవంతం కావడానికి తమవంతు సహకారం అందించింది. పాల్ రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోగా మునగాల రాజా ఆతిధ్యమిచ్చారు. ఏప్రిల్ 26న మచిలీపట్నం చేరారు. అక్కడ ఆయనకు కొంపల్లె హనుమంతరావు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. బ్రహ్మసమాజ సభ్యుడైన రామదాసునాయుడు ఇంట్లో బసచేశాడు. అక్కడ యువకులతో స్వరాజ్య సమితి ఏర్పాటైంది. ఆయన ఉపన్యాసంలో చివరిదైన 'మాతృమూర్తి' అనే దాన్లో వందేమాతరం పుట్టుక, దాని అర్థం గురించి వివరించాడు. ఆయన పర్యటన సందర్భంలోనే మచిలీపట్నంలో జాతీయ కళాశాల ఏర్పాటుకు ఒక కమిటీ ఏర్పడింది. ఆ తరువాత కాలంలో ఆంధ్ర జాతీయ కళాశాల ఏర్పడింది. దీనికి ప్రిన్సిపల్ గా కొంపల్లె హనుమంతరావును నియమించారు. మచిలీపట్నం నుంచి పాల్ మద్రాసు వెళ్ళారు. అక్కడ జరిగిన సభలకు టంగుటూరు ప్రకాశం అధ్యక్షత వహించారు. ఆంధ్రదేశంలో పాల్ ప్రసంగాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించి, ఉద్యమం ఉధృతమయ్యే విధంగా చేశాయి. చూపించి, ఉద్యమం ఉదృతమయ్యే విధంగా చేశాయి. బిపిన్ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులోకి అనువదించారు. వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఆంధ్రదేశంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజమండ్రి కళాశాల సంఘటన

వందేమాతర ఉద్యమ ప్రభావంతో విద్యార్థులు సైకిళ్ళపై ఊరేగింపుగా వెళ్తూ ఆంగ్లేయులు కనిపించగానే వందేమాతరం అంటూ నినాదాలిచ్చేవారు. వారు బాలభారతి సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ట్రెయినింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన మార్క్ హంటర్ విద్యార్థులను రాజకీయాల్లో పాల్గొనవద్దని, వందేమాతరం బ్యాడ్జీలను ధరించవద్దని తీవ్రంగా హెచ్చరించాడు. 1907 ఏప్రిల్ 24న అర్ధసంవత్సరం పరీక్షలు రాస్తున్న బి.ఎ. విద్యార్థుల గదిలోకి ప్రవేశించగానే ప్రిన్సిపాల్ వారు ధరించిన వందేమాతరం బ్యాడ్జీలను తీసివేయాలని ఆదేశించాడు. దానికి వారు నిరాకరించారు. ఆగ్రహానికి గురైన హంటర్ వారిని మందలిస్తుండగా బయటనుంచి ఎవరో 'వందేమాతరం' అని ఎలుగెత్తి అరిచారు. విద్యార్థులందరూ వందేమాతరం నినాదం చేస్తూ బయటకు వచ్చారు. మొత్తం 222 మంది విద్యార్థుల్లో 138 మందిని డిబార్ చేశాడు. గాడిచర్ల హరిసర్వోత్తమ రావును ప్రభుత్వోద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు. ఈ సంఘటనతో ఆంధ్ర విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభమైంది. 

కాకినాడ దొమ్మీ కేసు 

1907లో ఆంధ్రదేశంలో వందేమాతరం నినాదం సర్వ సామాన్యమైంది. కాకినాడలో 1907 మే 31న జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంప్ బజారులో వెళ్తుండగా ముగ్గురు బాలురు అతడిని కవ్విస్తూ 'వందేమాతరం' అని అరిచారు. ఆగ్రహం చెందిన కెంప్ కొంపెల్ల కృష్ణారావు అనే బాలుడిని కొట్టి పోలీస్ స్టేషన్లో పడేశాడు. ఈ వార్త పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. సుమారు మూడొందల మంది ప్రజలు ఆ రాత్రి కర్రలు, బడిసెలు తీసుకుని కెంప్ ఉన్న యూరోపియన్ క్లబ్ పై దాడి చేశారు. పోలీసు బలగాలతో వచ్చిన కలెక్టర్ జె.ఎ.కమ్మింగ్ ను గాయపరిచారు. రాజమండ్రి నుంచి అదనపు పోలీసులను పిలిచి 20 మందిని నిర్బంధించారు. ఈ సంఘటనకు నిరసనగా జూన్ 5న పురజనసభ జరిగింది. కె. పేరరాజు అధ్యక్షత వహించారు. సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ప్రజలు సహకరించాలని కోరారు. చివరికి 13 మందికి శిక్షపడింది. కెంపకు రూ. 100 జరిమానా విధించారు. 

కోటప్పకొండ సంఘటన 1909

ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ఉత్సవాల్లో ఎడ్ల పందాలు నిర్వహించారు. చిన్నపరెడ్డి అనే రైతు తన మేలు జాతి ఎద్దుల జతతో అక్కడికి వచ్చారు. బందోబస్తుకు వచ్చిన ఒక పోలీసు చిన్నపరెడ్డిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంతో చిన్నపరెడ్డి అతడిని చితకబాదాడు. దాంతో చిన్నపరెడ్డిని అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్తులైన ప్రజలు అతడిని విడుదల చేయాలంటూ వందేమాతరం నినాదాలు చేస్తూ పోలీసు స్టేషన్‌ను తగులబెట్టారు. అదనపు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం చిన్నపరెడ్డికి ఉరిశిక్ష పడింది. 

తెనాలి బాంబు ఉదంతం

తెనాలి వద్ద కంచరపాలెం రోడ్డులో ఒక నాటుబాంబు పేలి చెన్ను అనే హరిజనుడు మరణించాడు. విచారణ జరుపగా చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకట్రాయుడులకు శిక్షలు పడ్డాయి. 1905లో ప్రారంభమైన వందేమాతర ఉద్యమం 1911 నాటికి ప్రాధాన్యం కోల్పోయింది. అతివాద నాయకులు నిర్బంధానికి గురయ్యారు. ప్రభుత్వం 1909లో మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టి మితవాదులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించింది. మరికొద్దిమంది తీవ్రవాదులుగా మారి, రహస్య విప్లవ సంఘాలను స్థాపించారు. గదర్ పార్టీ ఇలాంటిదే. ఇందులో దర్శి చెంచయ్య ఒక్కడే సభ్యుడు. 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశాల్లో కాంగ్రెస్ మితవాద, అతివాద వర్గాలుగా చీలింది. 1910లో ఆంధ్ర రాజకీయాల్లో మితవాదుల ఆధిక్యం కనిపిస్తుంది. దీంతో ఉద్యమం ఆగిపోయింది. వందేమాతరం ఉద్యమం తరువాత కాలంలో న్యాపతి సుబ్బారావు రాజమండ్రిలో ఒక జాతీయ పాఠశాలను స్థాపించాడు. 1910 మార్చి 27న మచిలీపట్నంలో కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన జాతీయ కళాశాల ఏర్పాటైంది. ఒంగోలు, కడపలలో స్వదేశీ విద్యాలయాలు స్థాపితమయ్యాయి. 


 RELATED TOPICS   

ఆంధ్రదేశంలో జాతీయోద్యమం

ఆంధ్రదేశంలో హోంరూల్ ఉద్యమం 

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -1

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -2

ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం