అఖిల భారత కాంగ్రెస్ విజయవాడ సమావేశం 

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం విజయవాడలో 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగింది. మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, మహ్మర్ఎలీ, షోక అలీ మొదలైన దేశనాయకులు విజయవాడకు వచ్చారు. వారిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ సమావేశంలో టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య గద్దె రంగయ్య మొదలైన ఆంధ్రనాయకులు, హైదరాబాద్ ప్రాంతం నుంచి మాడపాటి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని కొద్ది మార్పులు చేసి కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. సమావేశం అనంతరం గాంధీ కొండా వెంకటప్పయ్యతో కలిసి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ, గుంటూరు, వేటపాలెంలో పర్యటించి ప్రసంగించారు. సహాయ నిరాకరణోద్యమం ఆంధ్రాలో తీవ్రంగా సాగింది. ఎందరో జైలుకు వెళ్లారు. కల్లు దుకాణాల ముందు పికెటింగ్ చేయడం, విదేశీ వస్త్రాలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. తిలక్ స్వరాజ్యనిధికి కోటి రూపాయలు వసూలు చేయాలని విజయవాడ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిధికి మహిళలు తమ ఆభరణాలు ఇచ్చారు. 1921 నవంబరులో వేల్స్ రాజకుమారుడి పర్యటన సందర్భంగా ఆంధ్రదేశమంతటా హర్తాళ్లు జరిగాయి. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో అనేక సంఘటనలు జరిగాయి. 

చీరాల, పేరాల శాసనోల్లంఘన

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15,000 జాండ్రపేట, వీర రాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అనేవారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి రూ. 4000 పన్ను వసూలయ్యేది. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి రూ. 40,000 అయింది. సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. ఇక్కడ ఉన్న నేతపనివారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ఎన్నో వినతి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు.

గోపాల కృష్ణయ్య వేయిమంది సభ్యులతో రామదండు అనే వాలంటీర్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినప్పుడు గోపాల కృష్ణయ్య ఆయనకు సమస్యను వివరించారు. గాంధీ చీరాలను దర్శించి, ఊరు ఖాళీ చేసి వెళితే మున్సిపాలిటీ దానంతట అదే రద్దవుతుందని తెలిపారు. చీరాల, పేరాల ప్రజలు ఊరు వదలి దాని పొలిమేర ఆవతల రామ్ నగర్ పేరుతో కొత్త నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ 11 నెలల పాటు కష్టనష్టాలను అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం ఆయనను నిర్బంధించి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజలు చేసేదిలేక తమ పాత నివాసాలకు వెళ్లారు.

పలనాడు సత్యాగ్రహం

గుంటూరు జిల్లాలోని పలనాడు వెనుకబడిన ప్రాంతం. అక్కడ ఉన్న అడవి నుంచి ప్రజలు వంట చెరకు, పశువులకు గడ్డి మొదలైనవి తెచ్చుకునేవారు. వీటి కోసం పన్నులు చెల్లించేవారు. రెవెన్యూ అటవీ ఉద్యోగులు ప్రజలను పీడించే వారు. 1921లో కరవు వచ్చింది. ప్రజలు తమ అటవీ అవసరాలను ఉచితంగా తీర్చుకోవడానికి అనుమతి కోరగా, ప్రభుత్వం నిరాకరించింది. మాచెర్ల, వెల్దుర్తి, సిరిగిరిపాడు, రెంటచింతల వాటి పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా పశువులను అడవుల్లోకి తోలేవారు. అధికారులు పశువులను బందిస్తే ప్రజలు వందల సంఖ్యలో వెళ్ళి విడిపించుకునేవారు. అది గమనించి ప్రభుత్వం అదనపు బలగాలను రప్పించింది. ప్రజలు సహాయ నిరాకరణ ప్రారంభించారు. అటవీ, రెవెన్యూ అధికారులను సాంఘికంగా బహిష్కరించారు. అన్ని వృత్తుల వారు అధికారుల అవసరాలను తీర్చడానికి నిరాకరించారు. అధికారులు తమ ఇళ్లను ఖాళీ చేయాలని అడిగారు. అక్కడికి కలెక్టర్ వచ్చాడు. తాను వచ్చిన విషయాన్ని తప్పెట్లతో అందరికీ తెలపాలని కోరాడు. కానీ, వారు తమ తప్పెట్లు పాడైపోయాయని సమాధానమిచ్చారు.

ఉద్యమ తీరుతెన్నులను గమనించడానికి కాంగ్రెస్ నాయకులైన ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి అక్కడికి వచ్చారు. వీరిని ప్రజలు తమ తప్పెట్లతో ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇది గమనించిన కలెక్టర్ ఆగ్రహావేశుడై వారి రాకను శాంతి భద్రతలకు ముప్పుగా పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయించాడు. దాంతో ప్రజల ఆందోళన తీవ్రతరమయింది. పశువులను అడవుల్లోకి వదిలారు. అనేక సార్లు పోలీసులతో ఘర్షణ జరిగింది. 

1921 సెప్టెంబరు 23న అటవీశాఖాధికారులు రిజర్వ్ పోలీసులను రప్పించి వారి సహాయంతో ముత్పూరు అడవి పై దాడి చేసి, మించాలపాడు వద్ద 300 పశువులను పట్టుకున్నారు. వారిపై 200 మంది ప్రజలు దాడిచేసి రాళ్లు రువ్వారు. పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ప్రజానాయకుడు కన్నెగంటి హనుమంతు, మరో ముగ్గురు మరణించారు. దీంతో ఉద్యమం ఆగిపోయింది. 


 RELATED TOPICS   

ఆంధ్రదేశంలో జాతీయోద్యమం

ఆంధ్రదేశంలో వందేమాతర ఉద్యమం

ఆంధ్రదేశంలో హోంరూల్ ఉద్యమం 

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -2

ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం