చందా  రైల్వే పథక వ్యతిరేక ఉద్యమం

చందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా హైద్రాబాద్ సంస్థానంలో జరిగిన ఉద్యమం ప్రధమ ప్రజా ఉద్యమంగా ప్రజా చైతాన్యానికి ప్రారంభంగా పేర్కొనవచ్చు. వాడి- హైదరాబాదుల మధ్యన ఉన్న రైల్వే లైనును ఒకవైపు విజయవాడతోను, మరొక వైపు చాందాతోను కలపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహించే బ్రిటిష్ కంపెనీకి పెట్టబోయే భారీ పెట్టుబడికి కనీస వడ్డీకి హైద్రాబాద్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జరిగింది. దీని వలన హైద్రాబాదుకు ఎటువంటి లాభం జరగకపోగా, ఇంకా నష్టం జరుగుతుందనే భావన విద్యా వంతులలో ఏర్పడింది. ఈ కారణం వలన చందా రైల్వే ప్రణాళిక విచారణ సంఘం” అను సంఘాన్ని విద్యా వంతులు, మేధావులు ఏర్పరిచారు.

సరోజిని నాయుడు తండ్రి డా|| అఘోరనాధ చటో పాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయూమ్ మొదలైనవారు ఈ చందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా పోరాటం చేసినవారిలో ముఖ్యులు ఈ వ్యతిరేకతను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 1883లో అఘోరనాధ చటోపాధ్యాయను ఉద్యోగం నుంచి తొలగించి సంస్థానం నుండి బహిష్కరించడం జరిగింది.

ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ "టైమ్స్ ఆఫ్ ఇండియా, బాంబే గెజెట్” పత్రికలలో వ్రాయటం జరిగింది. రెండు సంవత్సరముల తరువాత 1885 లో ఆఘోరనాధ చటోపాధ్యాయ హైద్రాబాద్ రావడానికి అనుమతినిచ్చి, నిజాం కళాశాల ప్రిన్సిపల్ గా నియమింపబడినారు.

స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు అఖిల భారత విద్యార్థి సమాఖ్య

భారతదేశంలో స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న సమయంలో ఉద్యమానికి ఊపునిచ్చేందుకు, విద్యార్థుల్లో జాతీయ భావాలను కలిగించడానికి సోసలిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి, సమసమాజ స్థాపనావశ్యకతను తెలియజేయడానికి 1936లో లక్నోలో అఖిల భారత విద్యార్థి

సమాఖ్య(ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) ఏర్పాటు చేయబడినది. హైదరాబాద్ లో దీని శాఖను ఏర్పాటు చేయడానికి 1936-37 ప్రాంతంలో షిభ్రహసన్ అను పత్రికా రచయిత ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో అభ్యుదయ భావాలు గల విద్యార్థులు అనేక మంది పాల్గొన్నారు. వారి ప్రోత్సాహంతోనే అబిడ్స్ లో ఒక పఠనాలయం ప్రారంభించ బడినది. అందులోనుండే హైదరాబాద్ విమోచనోద్యమానికి జరిగే కృషికి సహకారం అందించబడినది. 

ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్

1941 జూన్లో 'ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్' యొక్క నిబంధనావళి విడుదలైంది. 1942 జనవరి 16వ తేదీన ఈ యూనియన్ ప్రారంభ సమావేశం జరిగినది. ఈ సంగం విద్యార్థుబ్లీ పలుకుబడి సాధించిన ఫలితంగా 1941-42 సంవత్సరానికి జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్నికల్లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అక్విల్ అలీఖాన్ అధ్యక్షునిగా ఎన్నుకోబడినాడు. దీనితో యూనియన్ కార్యకర్తలు హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభమైనది. 1946 నాటికి యూనియన్ రాష్ట్రంలో ఏకైక విద్యార్థి సంఘంగా, ప్రగతిశీల పోరాట వేదికగా మార్పు చెందింది. యూనియన్ తృతీయ మహాసభ 1946లో ప్రతాపగిర్జీ కోఠీలో జరిగింది. దీనికి ప్రధాన కార్యదర్శిగా ఓంకార్ ప్రసాద్, సహాయ కార్యదర్శులుగా రఫీ అహ్మద్, కె.వి.నర్సింగరావు, కోశాధికారిగా ఎస్.బి.పాలేకర్ ఎన్నికైనారు. ఈ యూనియన్ తమ కార్యకలాపాలను తెలంగాణ ప్రాంతంలో ఉన్నత, మాధ్యమిక పాఠశాలల వరకు వ్యాపింపచేసింది.

హైదరాబాద్ రాజకీయ మహాసభలు 

మొదటి హైదరాబాద్ రాజకీయ మహాసభ 

1923లో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు మౌలాన మమ్మద్ అలీ అధ్యక్షతన కాకినాడలో జరిగినవి. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభలకు హాజరైన వందలాది హైదరాబాదీయులు తాము కూడా ఒక మహాసభ జరుపుకోవాలని భావించారు. ఈ భావన మొదట మాడపాటి హనుమంతరావుకు కలిగింది. హైదరాబాద్ రాజకీయ మహాసబ జరపాలనే కృత నిశ్చయంతో మాడపాటి హనుమంతరావు వామన్ నాయక్ గారికి సూచించినారు. బేరార్‌కు చెందిన మాధవరావు అణే అధ్యక్షతన మొదటి హైదరాబాద్ రాజకీయ మహాసభ కాకినాడలో జరిగింది. 

రెండవ హైదరాబాద్ రాజకీయ మహాసభ 

హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ మహాసభ జరుపుకోవ డానికి నిజాం ప్రభుత్వం అనుమతించక పోవడంతో మూడు సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1926 నవంబర్ లో బోంబాయిలో బెరాలకు చెందిన వై.ఎం. కాళే అధ్యక్షతన రెండవ హైదరాబాద్ రాజకీయ మహాసభ జరిగింది. 

మూడవ హైదరాబాద్ రాజకీయ మహాసభ 

1928లో పూనాలో మూడవ హైదరాబాద్ రాజకీయ మహాసభ జరిగింది. మూడవ రాజకీయ మహాసభకు ఎన్.సి.కేల్కర్ అధ్యక్షత వహించాడు. ఈ మహాసభకు సుభాష్ చంద్రబోస్ హాజరై ఉపన్యసించడం హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మరపురాని ఘట్టంగా వర్ణించవచ్చును. నాల్గవ హైదరాబాద్ రాజకీయ మహాసభ ఆగస్టు 1931, 27-28 తేదీలో బేరార్ లోని అకోలాలో నాల్గవ హైదరాబాద్ రాజకీయ మహాసభ జరిగింది. ఈ సభకు ఆహ్వానసంఘం అధ్యక్షుడుగా సయ్యద్ సిరాజుల్ హసన్ తిర్మిజీ ఉన్నారు. ఈ మహాసభలకు ధర్మవీర్ వామననాయక్ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఆయన అనారోగ్య కారణం వలన సభకు కాలేక పోవడంతో రామచంద్రనాయక్ అధ్యక్షులుగా వ్యవహరించారు.


Tags :   Freedom Movement in Hyderabad state     

 Chanda Railway Scheme     All Hyderabad Students Union   

 Freedom Movement     Hyderabad Rajakeeya Maha Sabha   

 British rule in Hyderabad state      Telangana History