1942 ఆగస్టు 7వ తేదీన బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా తీర్మానం చేసింది. తీర్మానం ఆగస్టు 9వ తేదీ నుండి అమలులోకి రావాలని నిర్ణయించారు. ఉదయాన్నే గాంధీజీ సహా ముఖ్యమైన నాయకులను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. గాంధీజీ ఆశ్రమంలో ఉన్న ప్రభాకర జ్ 'క్విట్ ఇండియా తీర్మానం'ను కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లో ఉన్న ఎ.ఎస్.రాజలింగంకు వ్రాసి పంపాడు. రాజలింగం తన స్వగ్రామ మైన వరంగల్ కు చేరుకుని అక్కడ హయగ్రీవాచారిని, భూపతి కృష్ణమూర్తిని మరికొంతమంది యువకులను సమీకరించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఈ ఉద్యమంలో కొమరగిరి నారాయణరావు, చంద్రమౌళి, రంగనాయకులు, నరసింహారావు, గొడిశాల కొమరయ్య గౌడ్, బత్తిని రామస్వామి గౌడ్ మొదలైనవారు పాల్గొన్నారు. రంగనాయకులు మరికొంత మంది సేవాదళ్ కార్యకర్తలు వార్దకు వెళ్ళి గాంధీజీ ప్రతిపాదించిన 'బేసిక్ శిక్షణ'ను పూర్తి చేసుకొని వచ్చి వివిధ వృత్తిపరమైన సంస్థలను స్థాపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సేవాకార్యకర్తలు జరిపిన కార్యక్రమాలలో భాగంగా 1944లో మనోహర్ రావు అధ్యక్షతన 'ఆంధ్ర విద్యార్థి జాతీయ పక్షం' అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ విద్యార్థులను సమీకరించి వారిలో జాతీయోద్యమ చైతన్యాన్ని కలుగజేయడానికి తోడ్పడింది.

సంబంధిత అంశాలు : హైదరాబాద్ సంస్థానంలో ప్రజా ఉద్యమాలు

హైదరాబాద్ లో గోడలపై క్విట్ ఇండియా నినాదాలు, చెట్లపై కాంగ్రెస్ పతాకాలు కనిపించేవి. ఈ సందర్భంగా విక్టోరియా గ్రౌండ్ లో సభ జరిగింది. ఈ సభలో శ్రీమతి హెడా, మెల్కోటే, టి.రామస్వామి దంపతులు పాల్గొన్నారు. రామానంద తీర్థ మహాత్మాగాంధీని కలిసి, ఉద్యమ లక్ష్యాలను తెలుసుకుని, హైదరాబాద్ కు చేరుకోగానే ఆయనను నాంపల్లి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. పౌర హక్కులను తక్షణమే కల్పించాలని, రాజ్య కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేయాలని జి.ఎస్. మెల్కోటే నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జరిగిన సత్యాగ్రహోద్యమంలో కాళోజీ నారాయణరావు, పద్మజా నాయుడు, కోదాటి నారాయణరావు, ఎం.ఎస్. రాజలింగం, ప్రేమ్ రాజ్ యాదవ్, కొమరగిరి నారాయణ రావు మొదలైనవారు పాల్గొని అరెస్టయ్యారు. ఈ ఉద్యమ సందర్భంలోనే హైదరాబాద్ కు చెందిన కాశీనాథరావు వైద్య, ఎం. నరసింగరావు, ఎం. రామచంద్రరావు, సయ్యద్ అలం మొదలైన 21 మంది హైదరాబాద్ ప్రత్యేక ప్రతిపత్తిని సమర్థిస్తూ హైదరాబాద్ రాజ్యానికి బాధ్యాతాయుత ప్రభుత్వమే గానీ, స్వతంత్రం రావలసిన అవసరం లేదని ప్రకటించారు. కానీ, వారి కోరిక నెరవేరలేదు.

భారత రాజకీయాల్లో 1945 సంవత్సరంలో ముఖ్యమైన మార్పులు ప్రారంభమయ్యాయి. కేబినెట్ మిషన్ భారత దేశానికి వచ్చి కొన్ని ప్రతిపాదనలు చేసింది. మరోవైపు కమ్యూనిస్టులు రావి నారాయణరెడ్డి నాయకత్వంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. ఈ సంఘటనలతో నిజాం ప్రభుత్వం ఆందోళన చెందింది. 1946లో హైదరాబాద్ రాజ్యం కాంగ్రెస్ పై ఉన్న నిషేధాన్ని తొలగించింది. తాము స్వతంత్ర హైదరాబాద్ లో ఉంటామని హైదరాబాద్ ప్రతినిధులు చేసిన కేబినెట్ ప్రతిపాదనను రాజ్యంలోని మెజారిటీ హిందూప్రజలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ 1947 లో హైదరాబాద్ రాజ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించి, మే నెలలో హైదరాబాద్ లో రాజ్య కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే జాయిన్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సమావేశానికి ఎన్.జి. రంగా వంటి ఆంధ్ర నాయకులు కూడా హాజరయ్యారు.

1947, మే 7న అఖిల భారత సోషలిస్టు పార్టీ కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు విజ్ఞప్తి చేశాడు. జయప్రకాశ్ నారాయణ వెంటనే హైదరాబాద్ వదిలి వెళ్లాలని నిజాం ఆదేశాలు జారీ చేశాడు. దీనికి నిరసనగా మే 8 న జరిగిన సభలో నరేంద్రసింగ్, మహదేవ్ సింగ్, సక్సేనా మొదలైన కార్మిక నాయకులు ప్రసంగిసంచారు.

సంబంధిత అంశాలు :భారత స్వాతంత్ర్య ఉత్సవాలను
నిషేధించిన నిజాం 

1947 జూన్ 11 న నిజాం ఒక ఫర్మానా జారీ చేస్తూ తనకు స్వతంత్రంగా ఉండే హక్కు ఉందని పేర్కొన్నాడు. 1947 ఆగస్టు 13 న హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ నిజాం ఫర్మానా జారీ చేశాడు. తన రాజ్యంలో భారత జాతీయ జెండాను ఎగురవేయడాన్ని నిషేధించాడు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రజలు నిజాం ఆదేశాలను ఉల్లంఘించి, జాతీయ జెండాను ఎగుర వేశారు. నెహ్రూ తనకిచ్చిన జాతీయజెండాను రామానందతీర్థ సుల్తాన్ బజారు కూడలి వద్ద ఎగరవేశాడు. సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా సత్యాగ్రహం చేయడానికి వచ్చిన రామానంద తీర్థను నాంపల్లి రైల్వే స్టేషన్లోనే ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత డా||సరోజినీ నాయుడు, పద్మజానాయుడు, మహదేవ్ సింగ్, అరిగె రామస్వామి, పండిత నరేంద్రదేవ్, వందేమాతరం, రామచంద్రరావు, జి.ఎస్.మేల్కొటే, బూర్గుల రామకృష్ణారావు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయినారు.

సంబంధిత అంశాలు : హైదరాబాద్ రాజ్యంలో
మహిళా చైతన్యం 

జిల్లాల్లో కాళోజీ నారాయణరావు, జమలాపురం కేశవరావు, కోదాటి నారాయణరావు, ఎం.ఎస్. రాజలింగం, హయగ్రీవాచారి మొదలగు వారు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మితవాదుల పక్షం వాడైన బూర్గుల రామకృష్ణారావు కూడా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ సత్యాగ్రహానికి దూరంగా ఉన్నప్పటికీ జాతీయ నాయకుల విడుదల కోసం సమ్మెలు, ప్రదర్శనలు జరిపినారు. వాటికి నాయకత్వం వహించిన ఓంకార్ ప్రసాద్, జవ్వాద్ రజ్వీ విశ్వవిద్యాలయాల నుండి బహిష్కరణకు గురైనారు.



Tags :   Quit India Movement in Hyderabad state     

 Kaloji Narayana Rao   

   Ramananda Teertha    Freedom Movement   

 British rule in Hyderabad state      Telangana History