1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజున సంబరాలలో పాల్గొనడానికి హైదరాబాద్ సంస్థాన ప్రజలు సంసిద్ధులైనారు. ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్ సంస్థానంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయజెండా ఎగురవే వేయాలని, సభలు, సమావేశాలు జరుపుకోవాలని పిలుపునిచ్చాయి. కానీ నిజాం ప్రభువు మాత్రం హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోరాదని నిషేధాజ్ఞలు జారీ చేశాడు. హైదరాబాద్ రాజ్యంలో తమ జెండా తప్ప ఇతర జెండాలేవీ ఎగుర వేయరాదని ప్రకటించాడు. అంతకు ముందు రాత్రి స్వామి రామానంద తీర్థ, జీ.ఎస్.మేల్కోటే, అచ్యుతరావ్ దేశ్ పాండే, జగన్నాథ రావు బర్దాపూర్ కలను నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. అయినా కూడా ఉత్సాహంతో ఉన్న ప్రజలు వెనక్కి తగ్గలేదు.

1947 ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు 100 మంది విద్యార్థులు 'ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్' కార్యాలయం వద్ద 'స్వతంత్ర భారత్ కీ జై', 'హైదరాబాద్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి', 'ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ కలవాలి' వంటి నినాదాలు చేశారు. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ సహాయ కార్యదర్శి రఫీ అహ్మద్ విద్యార్థి సంఘ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేశాడు. జాతీయ గీతాలాపన చేశారు. 'ఇస్లాం రాజ్యాం 'గా మారాలన్న నిజాం రాజ్యంలో ఇస్లాం మతానికి చెందిన ఒక విద్యార్థి ప్రప్రథమంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ముస్లింలలో కూడా జాతీయ భావాలు గల వారున్నారని రుజువు చేయడం గమనార్హం.

బ్రిజ్ రాణీ గౌర్, విమలా బాయి మేల్కోటే, యశోదా బహెన్, జ్ఞాన కుమారి హెడా, అహల్యాబాయి మొదలైన మహిళా మణులు వేర్వేరు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. బ్రిజ్ రాణీతో పాటు విద్యార్థి నాయకుడు డి.ఎం. శంకర్ రావు పతాకావిష్కరణ చేసినందుకు అరెస్టు అయినారు. కార్మిక సంఘ కార్యాలయంపై కూడా జెండా ఎగురవేయబడింది. వరంగల్ లో అంతకు ముందు రాత్రి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు మిట్ట యాదవరెడ్డిని మరియు ఇతర విద్యార్థి నాయకులలో ముఖ్యులను అరెస్టు చేసి వరంగల్ జైలులో ఉంచారు. అందుకు నిరసనగా విద్యార్థులు సమ్మె ప్రారంభిచి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కార్యాలయం పై జెండా ఎగురవేయడం మాత్రం విద్యార్థులు మరువలేదు. వరంగల్ లో తాండ్ర వెంకట్రామనర్సయ్య, కాళోజీ నారాయణ రావు, ఎం.ఎస్.రాజలింగం, ఇటికాల మధుసూధన్ రావు మొదలైన వారు జెండా ఎగురవేశారు. మధరిలో జమలాపురం కేశవరావు ఆధ్వర్యంలో, ఖమ్మంలో కొలిపాక వెంకట కిషన్‌రావు, హీరాలాల్ మోరియా, గెల్లా కేశవరావు, కాటూరి కృష్ణమూర్తి, గంధం మాణిక్యరావు, చావ వెంకట కోటయ్య మొదలైన వారు జెండా ఎగురవేశారు.

నల్లగొండలో భారీగా జరిగిన విద్యార్థుల ప్రదర్శనలో 5000 మంది పాల్గొన్నారు. విద్యార్థి నాయకులు పసునూరి వెంకట రెడ్డి, పన్నాల రాంరెడ్డి, ఆంధ్రమహాసభ నాయకులు బి.యలమంద, కాంగ్రెస్ నాయకులు ఉమ్మెత్తల కేశవరావు, అక్కిరాజు వాసుదేవ రావు, గవ్వా అమృతరెడ్డి పాల్గొనగా ముప్పారం నారాయణరావు పతాకావిష్కరణ చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి నాయకులను అరెస్టు చేశారు. భువనగిరిలో కూడా విద్యార్థుల పై లాఠీ ఛార్జీ చేసి 50 మందిని అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలోని గాలిపల్లిలో ఆగస్టు 19వ తేదీన బద్దం ఎల్లారెడ్డి తన స్వగ్రామంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి ప్రదర్శన జరిపి జెండా ఎగురువేశారు. ఈ విధంగా వివిధ జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఒక ఉద్యమం లాగా జరిగి, చివరికి హైదరాబాద్ విమోచనోద్యమానికి బాటలు వేసినవి.

Tags :   Independence Celebrations in Hyderabad state     

 Nizam      Mir Osman Ali Khan    Islam State   

 British rule in Hyderabad state      Telangana History