హైదరాబాద్ రాజ్యంలో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా క్రమంగా ప్రజలో చైతన్యం జరిగి హైదరాబాద్ విముక్తి కోసం పోరాటాలు జరిగాయి. తరువాత కాలంలో నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమవడానికి ఈ పోరాటలే కారణమైనవి.

హైదరాబాద్ రాజ్యంలో ఆర్యసమాజం, గణేశ్ ఉత్సవ సంఘం, ఆంధ్ర జనసంఘం మొదలైన సంస్థల కృషివల్ల ప్రజాచైతన్యం పెరిగింది. ఈ సంస్థలు స్వదేశీ ఉద్యమ తత్వాన్ని వ్యాప్తిలోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. దామోదర్ సత్వాలేకర్, అప్పాజీ తుల్జాపుర్కార్ వంటి వారు యువకుల శరీర దారుఢ్యాన్ని పెంపొందించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించడం కోసం వ్యాయామశాలలను స్థాపించారు. వారి కార్యకలాపాలను గమనించిన ప్రభుత్వం వారికి రాజ్య బహిష్కారం విధించింది.

ప్రజల్లో పెరుగుతున్న చైతన్యాన్ని, స్వాతంత్రాభిలాషను గమనించిన నిజాం ప్రభుత్వం అనేక ప్రతిఘాత చర్యలకు పాల్పడింది. ఈ చర్యల్లో భాగంగా ఎలగందల, పాలమూరు, ఇందూరు, మెతుకువంటి జిల్లాల పేర్లను 1905 లో వరుసగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదలుగా మార్చింది. మానుకోట, భువనగిరి పట్టణాల పేర్లను మహబూబాబాద్, బోంగీర్లుగా మార్చింది. రాజ్యంలోని మెజారిటీ ప్రజలైన హిందువుల సంస్కృతిని దెబ్బ తీయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. 

హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్

1938 జనవరిలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన హైదరాబాద్ ప్రజల సమావేశం జరిగింది. ఈ సమావేశం అరవమూడు అయ్యంగార్ కమిటీ చేసిన సిఫార్సులపై తన అసంతృప్తిని ప్రకటించింది. హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశం నిజాంను కోరింది. హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్ర్యోద్యమాన్ని నిర్మించడానికి ఒక సంస్థ అవసరమైంది.

సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన 1938 లో జరిగిన హరిపురా కాంగ్రెస్ సమావేశంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన అంశం చర్చకొచ్చింది. జాతీయ కాంగ్రెసు పేరును సంస్థానాల ప్రజలు వాడుకోకూడదని తీర్మానించారు. దాంతో హైదరాబాద్ రాజ్య కాగ్రెస్ ను స్థాపించాలని అనుకున్నారు. దానికి చొరవ చూపింది మహారాష్ట్ర పరిషత్తు సభ్యుడైన స్వామి రామానంద తీర్థ 1938 జనవరి 29 న మత ప్రమేయంలేని రాజకీయ సంస్థగా హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ స్థాపితమైంది. రామానంద తీర్థ 1938 జూన్, జులై నెలల్లో 1200 మంది సభ్యులను కాంగ్రెస్ లో చేర్చించాడు. 1938 సెప్టెంబరు 9 న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి అక్బర్ హైదరీ రాజ్య కాంగ్రెస్ ను మతోన్మాద విప్లవ సంస్థగా భావించి దాన్ని నిషేధిస్తూ సెప్టెంబరు 8 న ప్రకటించారు. కాంగ్రెస్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రాజ్య కాంగ్రెసు నాయకులు ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ముస్లిమీన్ పార్టీ నాయకుడైన బహదూర్ యార్‌జంగ్ తో చర్చలు ప్రారంభించారు. అయినా ఫలితం లేదు. 1938 అక్టోబరు 24 న హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించారు. గోవిందరావు నావలను అధ్యక్షుడిగా, రామకృష్ణ దూతను కార్యదర్శిగా నియమించారు.

నిషేధాన్ని రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రతినిధులు సత్యాగ్రహం ప్రారంభించారు. రామకృష్ణదూత్, రావినారాయణ రెడ్డి సత్యాగ్రహోద్యమానికి డిక్టేటర్లుగా నియమితు లయ్యారు. 400 మంది 18 బృందాలుగా ఏర్పడి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయిన వారిలో రామానంద తీర్ధ, బద్దం ఎల్లారెడ్డి, కెప్టెన్ జోషి, కులకర్ణి, రాజారెడ్డి, జి. రామారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, కాళోజీ నారాయణరావు, షేక్ మొయినుద్దీన్లు ముఖ్యులు. మహాత్మాగాంధీ సలహా మేరకు డిసెంబరులో సత్యాగ్రహాన్ని విరమించారు. సత్యాగ్రహులను విడుదల చేసి రాజ్య కాంగ్రెస్ పై నిషేధం తొలగించాలని నిజాం ప్రభుత్వాన్ని గాంధీ కోరాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. కానీ, రాజ్య కాంగ్రెస్ పై నిషేధాన్ని తొలగించలేదు. జాతీయ నాయకులను హైదరాబాద్ లోకి ప్రవేశించనీయలేదు. వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రావడానికి అనుమతించలేదు. కనీసం మితవాద నాయకులైన మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలాచారిలను కూడా హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతించాలని జమ్నాలాల్ బజాజ్ ప్రయత్నించాడు. నిజాం అంగీకరించలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1940 సెప్టెంబర్ లో రామానందతీర్థ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పై నిషేధాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశాడు. ఏ పేరుతోనైనా జాతీయోద్యమం తలెత్తినట్లయితే తాము ప్రతిఘటిస్తామని అంజుమన్- ఇతిహాద్- ఉల్-ముస్లిమీన్ అనే సంస్థ 1940 డిసెంబర్ 1 న తీర్మానం చేసింది.

Tags :   Freedom Movement in Hyderabad state     

 Ittehad-ul-Muslimeen     Ramanda Teertha   

 Freedom Movement     Hyderabad Rajya Congress   

 British rule in Hyderabad state      Telangana History