అశోకుడి పరిపాలన విధానం  

మౌర్య చంద్రగుప్తుడు తన విశాల మగధ సామ్రాజ్యంలో ప్రవేశ పెట్టిన అధికార వికేంద్రీకరణ పద్ధతినే అశోకుడు కూడా తన పాలనా కాలంలో అలవలంభించాడు. అశోకుని శాసనాలలో తక్షశిల, ఉజ్జయిని, తోసలి, సువర్ణగిరులను పాలించే నలుగురు రాజ ప్రతినిధుల గురించి ప్రస్తావన కలదు. తక్షశిల రాజ ప్రతినిధిగా అశోకుడి పుత్రుడు కుణాళుడు ఉండేవాడని దివ్యావదాన గ్రంథం వలన తెలుస్తున్నది. అతడు ధర్మనివర్ధనుడు అనే పేరుతో గాంధార రాష్ట్రమునకు రాజ ప్రతినిధిగా నుండి పాలించినట్లు చైనా యాత్రికుడగు ఫాహియాన్ వ్రాసినాడు. రాజ ప్రతినిధుల అధికారములకు లోబడి ప్రదేశికులను రాష్ట్ర పాలకులుడేవారు. క్రీ.శ. 150 నాటి రుద్రదాముని జూనాగఢ్ శాసనమున మౌర్య సామ్రాజ్యమునకు చెందిన ఇద్దరు రాష్ట్ర ప్రతినిధుల పేర్లు తెలుపబడినవి. చంద్రగుప్తుని కాలంలో గుజరాత్ (సౌరాష్ట్ర రాజ ప్రతినిధిగా పుష్పగుప్తుడు, అశోకుని కాలంలో రాజా తుషాస్ప ఉండేవారని ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది. రాష్ట్రములపై ఆధిపత్యము వహించే వారిలో ప్రదేశికులు ప్రథమగణ్యులు. ఆయా ప్రదేశములను పాలించేవారే ప్రదేశికులు అనబడినారు. ప్రదేశికుల అధికార పరిధిలో రాజూకలు, యుతలు, మహామాత్రలు అను మూడు తరగతుల ఉన్నతాధికారులు ఉండేవారు. అశోకుని శాసనాల వలన వీరి గురించి తెలుస్తున్నది.

రాజూకలు

రాజూక వేల సంఖ్యలోనున్న ప్రజల సంక్షేమమును కోరే ఉన్నతాధికారి. ప్రజా పాలన కొరకు చక్రవర్తిచే ఇతడు నియమించ బడతాడు. రమున గల సమస్త ప్రజలపై ఇతడు అధికారమును కలిగి ఉండేవాడు. నేరములకు శిక్షలను; ఉన్నతులకు, కళాకారులకు పురస్కారములను ఇచ్చే అధికారం వంటివి రాజూక చేతిలో ఉండేవి. ప్రజల నైతిక, ఆర్థిక, సాంఘిక, విద్యా, వైజ్ఞానిక, ఆచార వ్యవహారములను పరిరక్షించు బాధ్యత రాజూక వహించేవాడు. ప్రజలకు సంబంధించిన సమస్త విషయములను పరిశీలించి, వారికి అనుకూల పరిస్థితులను కల్పించటంలో రాజూక ప్రధాన పాత్ర వహించేవాడు. అశోకుడు తన శానముల ద్వారా రాజూక గురించి ఈ విధంగా వర్ణించాడు- "తన పాపను ఒక తెలివైన దాది(ఆయా)కి అప్పగించిన తరువాత ఒక వ్యక్తి ఎంత నమ్మకముగా ఉంటాడో అదే విధంగా నేను ఈ రాజూకలను జనపదుల సంక్షేమమునకు, సంతోషమునకు నియమించాను”. రాజూకలు మండలాధిపతులుగా సమస్త రాజ్యపాలనా వ్యవహారములతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమములను నిర్వహిస్తూ ఉండేవారు.

యుతలు 

కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొనబడిన యుతలు, వారి సహాయకులగు ఉప యుతలు ఆయా మండలముల కోశాధికారి పదవులను నిర్వహించేవారు. ప్రభుత్వమునకు సంబంధించిన ఆస్తిని పరిరక్షించుట, రైతుల నుండి ప్రజోపయోగ నిర్మాణములకు, పాలనా పరమగు వ్యయమునకు వెచ్చించడం, వాటికి సంబంధించిన లెక్కలను నమోదు చేయటం, మిగిలిన ధనాన్ని రాజ భాండాగారానికి చేర్చడం, ప్రభుత్వమునకు ఆదాయ వ్యయాల నివేదికలు సమర్పించడం వీరి విధిలో భాగాలుగా ఉండేవి.

మహామాత్రులు

మహామాత్రులు కొన్ని ప్రభుత్వ శాఖలపై ఆధిపత్యము వహించి ఉండేవారు. అశోకుడు తన 14వ రాజ్య సంవత్సరంలో సామ్రాజ్య పాలనా వ్యవహారాలను నిర్వహించుట, తాను ఆశించిన ధర్మ సూత్రముల వ్యాప్తి చేయడం మొదలైన పనుల కోసం మహా మాత్రులను నియమించాడు. వీరు ధర్మ మహామాత్రులు అని పిలువబడినారు. వీరిని పూర్వ పరిశీలినాధికారులు లేక న్యాయ విచారణాధికారులు అని పిలిచేవారు. ఈ పదవులలో ముఖ్యంగా సన్యాసులు, సంసార జీవనం నిర్వర్తించే బౌద్ధులు, బ్రాహ్మణులు, అజవీక యోగులు, నిర్థంంధులు మొదలైన అన్ని మతాల వారు నియమింపబడేవారు. ధర్మ స్థాపన, ధర్మ సూత్రాల వ్యాప్తి, ప్రచారము, నిస్స్వార్ధముగా ధర్మబద్ధంగా ప్రవర్తించడం, ప్రజల సుఖ సంతోషాల కొరకు పాటుపడడం వీరి కర్తవ్యంగా ఉండేది. గాంధారులు, కాంభోజులు, ఇతర ధర్మపరులు నిర్భయంగా, నిరాటంకంగా సంచరించునట్లు, వేతనముపై జీవించు వారు అనాధులు, వృద్ధులు సుఖ సంతోషాలతో వర్ధిల్లేట్లు చేయుట ధర్మ మహామాత్రుల విధిగా ఉండేది. కారాగారములలో బంధించబడిన వారిని విడుదల చేయుటకు కావలసిన ద్రవ్యమును చెల్లించుట, ఒక వ్యక్తి పై ఆధారపడి ఉన్న కుటుంబీకులను ఆదుకొనుటకు ఆ వ్యక్తిని కారాగారము నుండి విడుదల చేయుచుండిరి. పీడిత ప్రజలను, వృద్ధులను ఆదుకొనుటకు వీరి కర్తవ్యమై ఉండెను. 

అశోకుని సామ్రాజ్యములో స్త్రీల సంక్షేమానికి ఒక అధికారి నియమింపబడి ఉండెను. స్త్రీ జన సంక్షేమాధికారిణి స్త్రీ అధ్యక్ష మహా మాత్రయని పిలువబడేది. సామ్రాజ్య సరిహద్దుల రక్షణ బాధ్యత కూడా మహామాత్రుల అధీనంలోనే ఉండేది. నాగరిక లేక నగర వ్యవహారిక అనే ఉద్యోగి నగర పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తూండేవాడు. మాహామాత్రకు ఉండే అధికారాలు, బాధ్యతలు ఇతనికి కూడా ఉండేవి. మహామాత్ర స్థాయికి తగిన స్థాయి ఉద్యోగం ఇతనిది. అశోకుని 13వ శిలాశాసనమును అనుసరించి దూతలు ప్రభువాజ్ఞను పాటించి విదేశాలకు వెళ్ళేవారు.

ప్రజ శాఖ

వ్రజ భూమిక అను ముఖ్యాధికారి ప్రజ శాఖను నిర్వహించేవాడు - అశోకుని శిలాశాసనము 12. సామ్రాజ్యంలో పుష్కలంగా లభించూ కూస లేక ఉనపాన అనే మంచినీటి బావులు, ఉద్యానవనములు రాజమార్గములకు రెండు పక్కలనున్న నీడనిచ్చే మట్టిచెట్లు, మామిడి చెట్లు, తోటలు, విశ్రాంతి భవనములు ప్రజ శాఖ పరిధిలో ఉండేవి. ప్రజల వైద్య ఆరోగ్య విషయాలను, జంతువుల చికిత్సలను ఈ శాఖాధిపతి పర్యవేక్షించేవాడు. ఆయుర్వేద వైద్య చికిత్సకు అవసరమైన, ఔషధాలు, వనమూలికలు, పండ్లు సమకూర్చు బాధ్యత ఈ శాఖ వహించేది. అవసరమని తోచినపుడు విదేశముల నుండి వృక్షములను తెప్పించి, వాటిని నాటి, సంరక్షులుగా కొందరిని నియమించుటకు ఈ శాఖాధిపతులకు అధికారం ఉండేదని దీని గురించి అశోకుని 2వ శాసనంలో తెలుపబడింది. ఏనుగుల సంతతిని వృద్ధి పరిచేందుకు ఒక శాఖ ఏర్పర్చబడినది. ఆ శాఖాధిపతి హస్తి అధ్యక్షుడని పిలువబడేవాడు. అతడు అడవులను పెంపొందించి, ఏనుగులకు సమస్త సదుపాయములేర్పరిచేట్లు చూసేవాడు. ఈ వనాలలో ఏనుగులు స్వేచ్చగా సందరించి, ఆహార పానీయాలు పొంది తమ సంతతిని వృద్ధి చేసుకొనేవి అనే విషయాలు అశోకుని 5వ శాసనం ద్వారా తెలుస్తున్నది.

 RELATED TOPICS 

మౌర్య వంశము

మౌర్య వంశము - అశోక చక్రవర్తి

అశోకుడు-బౌద్ధమత ప్రచారము

మౌర్యుల పరిపాలన