అశోకుడు-బౌద్ధమత ప్రచారము

అశోక చక్రవర్తి తాను వేయించిన శాసనాల ద్వారా బౌద్ధ ధర్మ సూత్రాలను, వాటి ఆచరణను ప్రజలకు బోధించి వారి నైతిక ప్రగతికి కృషి చేశాడు. సన్యాసులు, స్నేహితులు, సహచరులు, బంధువులు, వృద్ధులు సహాయం పొందటానికి అర్హులు. వారికి ధనమును, ప్రేమను పంచి ఇవ్వడం రాజ్య ప్రజలందరి కర్తవ్యమని అశోకుడు తెలిపినాడు. మతాచారము కన్నా గుణము, నడవడిక, సౌశీల్యములే ఎక్కువ ప్రాధాన్యమును కలిగిఉండాలని, నీతిని, సత్ప్రవర్తనను పాటించుట మంచి ఆచారమని అశోకుడు తన 12వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. మత సహనానికే కాకుండా ఆయా మతాలను గౌరవించేటటువంటి బుద్ధిని మనుషులందరూ వికసింపజేయాలని అశోకుడు తన 12వ శిలాసానంలో ఆదేశంతో కూడిన విన్నపాన్ని చేశాడు. బరాబర్ కొండలలో తాను తవ్వించిన గుహలను అశోకుడు అజవీక యోగుల ఆవాసానికి దానం చేశాడు. వీరు జైన మతానుయాయులు. దీని వలన అశోకుడి పరమత సహనం కలవాడని తెలుస్తున్నది. అప్పటి వరకు రాజ భోజనానికి అసంఖ్యాకమైన జంతువులను వధించడం అశోకుడ మాన్పించాడు. దానికి పరిమితి విధించి ఒక దుప్పిని, రెండు నెమళ్ళను వధించడానికి మాత్రమే అనుమతించాడు. తరువాత కాలంలో మాంసాహారాన్ని కూడా నిషేధించాడు. అహింసా సూత్రాన్ని తన రాజాంతఃపురానికి పరిమితం చేయకుండా మగధ సామ్రాజ్యం మొత్తానికి కూడా, విదేశాలలో అమలు పరచడానికి కృషి చేశాడు. విదేశ దండయాత్రలకు బదులు ఆయా దేశాలలో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం, బుద్ధ ధర్మ ప్రచారానికి ప్రజలను నీతి మార్గాచరణులుగా చేయడం కొరకు అశోకుడు తన దూతలను ఆయా దేశాలకు పంపించాడని అతడు వేయించిన 13వ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. 

అశోకుడు వేయించిన 14వ శిలాసానంలో అతను నైతిక సూత్రములను జీవితంలో అమలుపరచడమే తప్ప యుద్దానికి సంబంధించిన ఆదేశాలు అనుమతించ లేదని ప్రకటించాడు. అశోకుడి కాలంలో పాటలీపుత్ర నగరంలో మూడవ బౌద్ధ సంగీతి నిర్వహించబడింది. ఈ విషయం మహావంశ గ్రంథం ద్వారా తెలుస్తున్నది. మొగ్గలిపుత్త లేదా ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాస్సి మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్ష వహించాడు. వివిధ దేశాలలో బౌద్ధమత ప్రచారం చేయడానికి బౌద్ధ సన్యాసులను పంపడానికి ఈ సమావేశంలో తీర్మానం చేయబడింది. 

బౌద్ధ ప్రచారం నిమిత్తం వివిధ దేశాలకు పంపబడిన వారు: 

1) మర్దుం తకుడు - కాశ్మీరు, గాంధార 

2) మహా రక్షితుడు - యవన లేక గ్రీకు దేశం 

3) మఝాముడు - హిమాలయ ప్రాంతం 

4) ధర్మ రక్షితుడు - పర్ణాంతకము 

5) మహా ధర్మ రక్షితుడు - మహారాష్ట్ర 

6) మహాదేవుడు - మహిష మండలానికి 

7) రక్షితుడు - వనవాస రాజ్యమునకు

8) నోణ ఉత్తరులు - సువర్ణభూమి 

9) మహేంద్రుడు - సింహళ దేశానికి 

అశోకుడు వేయించిన 2 మరియు 5 శిలాశాసనాల ద్వారా అతడు తన సరిహద్దులందున్న దేశాలకు సైతం బౌద్ధధర్మ ప్రచారకులను పంపినట్లు తెలుస్తున్నది. అశోకుడు పంపించిన బౌద్ధ మత ప్రచారకులు ఈజిప్టు, మాసిడోనియా, సిరేని, ఎపిరస్ మొదలైన దేశ పాలకులైన గ్రీకు రాజులనపు దర్శించి, అశోకుని అహింసా సూత్రాలను ప్రచారం చేయడంతో బాటు సమస్త జీవరాసుల బాధలను నివారించడానికి తగిన చర్యలు తీసుకొన్నారని అతను వేయించిన శిలాసనం 13 ద్వారా తెలుస్తున్నది. అశోకుడు అన్ని రంగాలలో కూడా జంతు సంహారమును, మాంస భోజనం నిషేధించాడు. క్రూర జంతువుల పోరాటాల వేడుకలను, ఇతర ఆటపోటీల హింసాత్మక చర్యలను నిషేధించాడు. అంతే కాకుండా మతం పేరుతో జరిపే జంతు బలులను కూడా రూపుమాపాడు. తన పూర్వీకులు అత్యంత ఉత్సాహంతో నిర్వహిస్తూ వచ్చిన వేటాడే వ్యసనాన్ని కూడా అశోకుడు మానివేసినట్లు శిలాశాసనం 8 ద్వారా తెలుస్తున్నది.

రాజ్యంలోని రాజూకలు, మహామాత్రులు, రాజప్రతినిధులు తమ పరిధిలోని రాజ్య భాగాలలో సంచరించి, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని, వారికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అదించడంతో పాటు ధర్మ మత ప్రచారాన్ని చేప్ నిర్వహించేస్తూ చక్రవర్తిని అనుకరించేవారని అశోకుడు తన 3వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. అశోకుడు తన 26వ రాజ్య సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన జీవులకు హాని కలిగించకూడదని ఒక శాసనాన్ని రూపొందించాడు. ఆహారంగా గాని, సేవలకు గాని, ఆర్థిక పరంగా గాని ఉపయోగపడని రామచిలుకలు, గబ్బిలాలు, అడవి బాతులు, చీమలు, ఉడుతలు, తాబేళ్ళు, ముళ్ళపందులు, తొండలు, ఖడ్గమృగాలు, పావురాలు రక్షించబడాలని, ఉపయోగపడే సమస్త నాలుగు కాళ్ళ జంతువులకు రక్షణ కల్పించాలని వాటిని వధించడం తగదని ప్రకటించాడు.

సంవత్సరంలో 56 ప్రత్యేక రోజులలో చేపలను చంపరాదని, విక్రయించరాదని, తినరాదని అశోకుడు ప్రకటించాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పవిత్రమైన రోజులలో ఆబోతులకు, దున్నలకు గిట్టలను కొట్టరాదు, గుఱ్ఱములకు వాతలు వేయరాదు అని కూడా అశోకుడు ఉద్భోదించాడు. అశోకుడు తన జన్మదినం నాడు కారాగారంలో ఉన్న నేరస్థులను విడిచి విధానాన్ని అమలు చేశాడని అతని 5వ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఉరిశిక్షకు గురైన వారికి ఉదారంగా మూడు రోజుల తరువాత శిక్ష అమలుపరిచే వారని 4వ శాసనం ద్వారా తెలుస్తున్నది. ప్రభుత్వ పాలనాపర సూత్రాలను అనుసరించి అశోకుడు అల్ప ప్రాణులకు ఇచ్చిన ప్రాముఖ్యతను మానవ ప్రాణాలకు ఇవ్వలేదు. మూగ జంతువుల కన్నా మనుషులు మంచి చెడులను విచక్షణ కలిగి ఉంటారు కాబట్టి మానవుడు అమాయకుడు కాదని హంతకులు, దోపిడీదారులు, సంఘద్రోహుల ప్రాణాలకన్నా మూగజీవుల ప్రాణాలకు ఎక్కువ రక్షణ అవసరం అని అశోకుడు భావించాడు. 

శిల్పకళ

అశోకుడు లలిత కళలు, శిల్పకళలను పోషించిన కళాభిజ్ఞుడు. అనేక శిల్ప కళాశోభితాలైన కట్టడాలను నిర్మింపజేశాడు. కలప, ఇటుకలతో నిర్మించే పద్ధతలకు బదులుగా శిలానిర్మిత ఆరామ విహారాలను, చైత్యాలయాలను నిర్మించాడు. నగరాలు, స్థూపములు, విహారాలు ఏకశిలా నిర్మిత స్తంభాలను అశోక చక్రవర్తి నిరించాడు. పాటలీపుత్రంలోని అశోకుడి రాజభవనమును సందర్శించిన ఫాహియాన్ అక్కడి నిర్మాణాలను చూసి అవి మానవ మాత్రులు నిర్మించినవి కావని, దేవతా గణాలు నిర్మించారేమో అన్నంత అద్భుతంగా ఉన్నాయని వర్ణించాడు. అశోకుడు బుద్ధని అవశేషాలపై నిర్మించబడిన 8 స్థూపములను తెరిపించి, తాను నిర్మించిన 84000 స్థూపములందు బుద్ధ ధాతువులను ఉంచాడని ఫాహియాన్ తన రచనల్లో పేర్కొన్నాడు. అశోకుడు పూర్వబుద్ధలలో ఒకడైన కనకముని స్థూపాన్ని రెండింతలు పెంచి నిర్మింప జేశాడని అతని శాసనాల ద్వారా తెలుస్తున్నది. సాంచీ మహాస్థూపము చుట్టూ గల శిల్పశోభిత నిర్మాణమును అశోకుడు దర్శించాడని, అశోకుడు నిర్మించిన స్థూపాలు కొండ శిఖరాల వలె ఉన్నవని దివ్యావధానంలో వర్ణింబడింది. సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ తోప్రా నుండి ఒక అశోక స్తంభమును ఢిల్లీ నగరానికి చేర్చాడని తారీఖ్ - ఇ - ఫిరోజ్ షాహ్ ద్వారా తెలుస్తున్నది. మరొక శిలా స్తంభమును మీరట్ నుండి ఢిల్లీకి తరలించాడు.

నీటిపారుదల సౌకర్యాలు

గిర్నార్, జునాగఢ్ లకు చేరువలో ఉన్న రైవతక ఉర్జయత్ పర్వతాలపై ఉన్న సెలయేళ్ళకు ఆనకట్టులు వేయించి సుదర్శన తటాకాన్ని మౌర్యచర్రదగుప్తుడు నిర్మించాడు. అశోకుడు ఆ తటాకాన్ని అభివృద్ధి చేశాడు. గంగా, యమునా నదుల నీటిని పంట పొలాలకు అందించే బృహత్ పథకాలు కూడా మౌర్య చక్రవర్తుల కాలంలో రూపొందించ బడినవి. సింధు, దాని ఉపనదుల జలాలను రైతులకు ఉపయోగపడునట్లు పంట కాలువలు త్రవ్వించబడినవి. అశోకుడు బౌద్ధ మఠాధిపతిగా ఉండేవాడని సారనాథ్, సాంచీ శాసనాల ద్వారా తెలుస్తున్నది. బౌద్ధమత గ్రంథాల ప్రకారం అశోకుడికి ముగ్గురు పుత్రులు అని తెలుస్తున్నది. అతని పుత్రులలో కుణాళుడు ఎనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లు తెలుస్తున్నది. కుణాళుని తరువాత ఐదుగురు మగధ రాజ్యాని పాలించారు. వారిలో చివరి వాడు బృహద్రథుడని వాయు పురాణంలో ప్రస్తావించబడింది. మత్స్యపురాణం అశోకుని తరువాత 10 మంది రాజులు పాలించినట్లు తెలుస్తున్నది. విష్ణుపురాణం అశోకుని తరువాత ఏడుగురు రాజులు పాలించినట్లు తెలుపుతున్నది. రాజతరంగిణి గ్రంధం అశోకుని వారసునిగా జలౌకుడిని పేర్కొన్నది. అశోకుడికి గల దేవనాం ప్రియ బిరుదును దశరథుడు అనే మౌర్య రాజు ఉపయోగించుకున్నట్లు నాగార్జున కొండలలోని గుహా కుడ్యములపై ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది.

మౌర్య రాజ్య పతనం 

పుష్యమిత్రుడనే సైన్యాధికారి చివరి మౌర్యరాజు బృహద్రథుని వధించి రాజ్యం ఆక్రమించినట్లు బాణుని హర్ష చరిత్ర ద్వారా తెలుస్తున్నది. పుష్యమిత్రుడు శుంగ వంశానికి చెందిన వాడు. బ్రాహ్మణుడు. మౌర్య సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు. బాక్ట్రియా గ్రీకులు భారతదేశం పై దండెత్తి వచ్చే సమయాన్ని గమనించిన పుష్యమిత్రుడు బలహీనుడైన మగధ రాజైన బృహద్రథుని సంహరించి రాజ్య మాక్రమించడం వలన మౌర్యరాజ్యం అంతరించింది. విదేశీ దండయాత్రలు మౌర్యవంశం నశించడానికి కొంత వరకు కారణమైనవి. మగధ రాజ్యంలో ఏర్పడిన అంతః కలహాలు, అసమర్థత, భోగలాలస, విదేశీ దండయాత్రలు, సైన్యాధక్షుని స్వార్థ పరత్వం, అమాత్యుల అనైక్యత, అశోకుని అహింసా సిద్ధాంతాల వలన నిర్వీర్యులైన సైనికులు, ప్రజలు, అనిశ్చిత స్థితి, రాష్ట్ర పాలకుల స్వాతంత్ర్య ప్రకటన మౌర్య రాజ్య పతనానికి కారణమైనట్లు తెలుస్తున్నది. గార్గి సంహితాంతర్గత యుగ పురాణము, పంతంజలీ మహాభాష్యం వంటి సంస్కృత గ్రంథాలు యవనుల దండయాత్రల కారణంగా మగధ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైందని తెలుపుచున్నవి.


 RELATED TOPICS 

మౌర్య వంశము

మౌర్య వంశము - అశోక చక్రవర్తి

అశోకుడి పరిపాలన విధానం  

మౌర్యుల పరిపాలన