మౌర్యుల పరిపాలన

మౌర్య వంశ పాలన సుమారు 137 సంవత్సరాలు సాగినట్లు చారిత్రక గ్రంధాలు, ఆధారాల ద్వారా తెలుస్తున్నది. మౌర్యచంద్రగుప్తుడు క్రీ.పూ. 324లో రాజ్యస్థాపన చేశాడు. క్రీ.పూ. 187లో చివరి రాజగు బృహద్రథుడు మరణించాడు. అశోకుని తరువాత కాశ్మీరంలో అతని పుత్రుడు జలౌక స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడని, కనౌజ్ వరకు గల భూభాగం పాలించాడని తెలుస్తున్నది. 

పరిపాలనా విశేషాలు

మౌర్య రాజ్యానికి రాజే సర్వాధికారి. రాజ్య పాలనలో రాజు పాత్ర ప్రధానమైనదిగా ఉండేది. పగటి వేళ రాజు నిద్రించరాదనే నియమం మౌర్యుల కాలంలో ఉండేది. రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. ప్రజా వ్యవహార నిర్వహణలోనూ, రాజ్య పాలనా వ్యవహారాలలోనూ మంత్రులు, ప్రాడ్వివాకులు చక్రవర్తికి సలహా ఇచ్చేవారు. చంద్రగుప్తుడు అనేక మంది గూఢచారులను నియమించేవాడు. వీరిని పర్యవేక్షకులని మెగస్తనీస్ తెలిపాడు. మౌర్య రాజ్యంలో పురపాలక వ్యవస్థను మెగస్తనీస్ వర్ణించాడు. ఈ వ్యవస్థలోని అధికారులను మెగస్తనీస్ అస్తిగోమోయి అని తెలిపాడు. వారి విధులను కూడా వర్ణించాడు. మౌర్య రాజ్యంలో పురపాలక సంఘంలో ఆరు ఉప సంఘములను ఏర్పరచుకొని ఉండేవి. ప్రతి ఉప సంఘము ఐదు సభ్యులను కలిగి ఉండేది.

మొదటి ఉప సంఘము : పారిశ్రామిక, కళలకు సంబంధించిన సమస్త విషయాలను ఇందులోని సభ్యులు చూసేవారు.

రెండవ ఉప సంఘము : విదేశీ తిథుల స్వాగత సత్కారములను, వారికి వసతి ఏర్పాట్లు వంటి బాధ్యతల ఈ ఉపసంఘం సభ్యులు నిర్వహించేవారు.

మూడవ ఉపసంఘము : జనన మరణ విచార బాధ్యత మూడవ ఉపసంఘ సభ్యులు వహించేవారు. నాల్గవ ఉప సంఘము : ఈ సంఘ సభ్యులు వర్తక వ్యాపారాలను పర్యవేక్షించేవారు. ఐదవ ఉప సంఘము : ఈ సంఘం వారు ఉత్పత్తులను పర్యవేక్షించేవారు.

ఆరవ ఉప సంఘము : ఈ సంఘం సభ్యులకు వర్తకులు విక్రయించు సరుకులపై అమ్మకపు పరిమాణమును అనుసరించి పన్నులు వసూలు చేయుదురు. పన్నులు వసూలు చేయడంలో మోసానికి పాల్పడిన వర్తకులకు మరణశిక్ష విధింతురు.

అగ్రో గొమోయి అనే జిల్లా అధికారి నిర్వహించు జిల్లా పరిపాలన గురించి మెగస్తనీసు పేర్కొన్నాడు. భూమి కొలతలు నిర్వహించటం, నదీ జలాలు రైతుల పంట పొలాలకు సక్రమ పద్ధతిలో అందించుట, పెద్ద కాలువల నుండి పిల్ల కాలువలలోని నీరు పారించుట, అట్టి భూములను పర్యవేక్షించు వివిధ తరగతులకు చెందిన అధికారుల గురించి మెగస్తనీస్ ఇండికాలో వర్ణించాడు.

సైనిక విధానం

చంద్రగుప్తుడు అతి పెద్ద సైన్యమును నిర్వహించెను. ఆరు లక్షల సైనికులున్న మౌర్య సైన్యమానాడు ప్రపంచమున ప్రఖ్యాతి గాంచి యుండెను. ముప్పయి మంది సభ్యులు గల యుద్ధ కార్యాలయం ఈ సైన్యమును నియంత్రించుచుండెను. చంద్రగుప్తుడీ 30 మంది సభ్యులను, మండలమును కేపురి చొప్పున ఆరు మండలములుగ విభజించెను. ఈ మండలంలో సైనిక కేంద్రాలకు ఒక నౌకా నిర్వహణాధిపతి సహకరించు చుండెను. ఐదు సైనిక మండలములకొక నౌకా నిర్వహణ ప్రత్యేక మండలము నిర్ధారింపబడెను. మిగిలిన ఐదు మండలాలు వివిధ సైన్య శాఖలను పర్యవేక్షించుచుండెను. యుద్ధ సామగ్రిని, పశువుల మేతను, సైనికుల ఆహార పదార్థములన సరఫరా చేయుటకు ఎడ్లబండ్లను ఉపయోగించేవారు. గంట మ్రోగించిన వెంటనే పశుగ్రాసము సరఫరా చేయుటకు నియమించబడిన గడ్డి కోతగాండ్రు ఉండేవారు. మగధ రాజ్యంలో రైతుల తరువాత అధిక సంఖ్యలో సైనికులుండేవారు. సైనికులు కేవలం సైనిక విధులను మాత్రమే నిర్వహిస్తూ అత్యంత స్వేచ్ఛాయుత జీవితమును గడిపేవారు.

మగధ సైనికులు ఉపయోగించే యుద్ధ పరికరాలను గూర్చి, ఆయుధాలను గూర్చి నియర్చస్ తెలిపిన ఆ కాలం నాటి విషయాలన్నీ వాస్తవాలే. చక్రవర్తి వేటకు వెళ్ళే సమయంలో చక్రవర్తి సంరక్షణకు స్త్రీ సైనికులు బాధ్యత వహించేవారు. అలంకరించబడిన గుఱ్ఱముపై ఎక్కి మౌర్య రాజపతాకమును ధరించిన స్త్రీమూర్తి బార్హత్ శిల్పంలో కలనిపిస్తుంది. గ్రీకు రచయితల ప్రకారం చంద్రగుప్తుడు కుక్కల సహాయంతో సింహాన్ని వేటాడేవాడు. చక్రవర్తి ఎడ్ల పందాలను చూస్తూ వినోదించేవాడు. రెండు గుఱ్ఱముల మధ్యన ఒక ఎద్దును కట్టిన రథముల పరుగు పందెములు ఆ రోజుల్లో జరిగేవి. రాచకార్య నిర్వహణకు రాజభవనము నుండి రాజసభా భవనమునకు చక్రవర్తి బయల్దేరేటప్పుడు అతనికి ఏనుగులు రక్షణగా ఉండేవి. ఆ కాలంలో యుద్ధ సమయంలో రైతులకు గాని, పంట పొలాలకు గాని ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకునే వారు.


 RELATED TOPICS 

మౌర్య వంశము

మౌర్య వంశము - అశోక చక్రవర్తి

అశోకుడి పరిపాలన విధానం  

అశోకుడు-బౌద్ధమత ప్రచారము