మౌర్య వంశము - అశోక చక్రవర్తి

బిందుసారుని తరువాత అతని పుత్రుడు అశోకుడు మగధ రాజ్యానికి రాజైనాడు. భారత రాజకీయ చరిత్రలో అశోకునికి ప్రత్యేక స్థానం కలదు. కళింగ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా ఉండడం నచ్చని అశోకుడు కళింగ పై దండ్రయాత్ర జరిపగా ఆ యుద్ధంలో అసంఖ్యాకమైన సైనికులను హతమార్చి ఆ రాజ్యంను జయించి మగధలో కలుపుకున్నాడు. అశోకుడు కళింగ యుద్ధానంతరం బౌద్ధ మతమును స్వీకరించి ఆ మతమును ఖండ ఖండాంతరాలందు వ్యాపింప జేశాడు.

అశోకుడు అనేక శాసనాలను వేయించాడు. ఈ శాసనాలను గండ శిలలపైనా, శిలా స్తంభములపైనా మానవ శ్రేయస్సును కోరి వేయించాడు. పాళీ, సంస్కృత భాషలలో రచించబడిన అనేక బౌద్ధ, బౌద్ధేతర గ్రంథములు అశోకుడి వ్యక్తిత్వము, రాజ్యపాలనా విధానము, బౌద్ధ ధర్మములను తెలుపుతున్నవి. బృహత్శిలలపైన, గండ శిలలపైన, స్తంభముల పైనను చెక్కబడిన శాసనములు మొదటి విభాగమునకు చెందినవి. ఇందులో ముఖ్యమైన శాసనాలు 14. కళింగ దేశమందున్న ధౌళి, ఔగడలందు అశోకుని శాసనములు లభ్యమైనవి. చిన్న శిలా శాసనములు సాధారణముగా ప్రజలనుద్దేశించి, జీవహింస చేయరాదని, సర్వ మానవ సౌభ్రాతృత్వము కలిగి ఉండాలి అని ఉద్బోధించునవి. తోప్రాలోని ఒక స్తంభముపై చెక్కబడిన 7 శాసనములు పేర్కొనదగినవి. ఏడవ శాసనము చెక్కబడిన స్తంభము మీరట్ పట్టణము నుండి ఢిల్లీ నగరమునకు తరలింపుబడినది. ఈ శాసనముల వలన, ముఖ్య సంఘటనలు తెలియకున్నను, అశోక చక్రవర్తి మానవతా దృక్పథము, నిరాడంబరత, ప్రజా పరిపాలనా విధానము, దేశ స్థితి తెలిసికొనుటకు వీలగుచున్నది.

దివ్యావదానమను బౌద్ధ గ్రంథము అశోకుని జీవితచరిత్ర తెలుసుకోవడంలో కొంతవరకు తోడ్పడుచున్నవి. బిందుసారుని మరణానంతరము అశోకుడు తన 99 మంది సోదరులను హత్యచేసి సింహాసనం అధిష్టించినట్లు ఈ గ్రంథములు తెలిపినవి సోదరులతో యుద్ధం చేసి వారి అశోకుడు సంహరించినాడనడానికి ఎటువంటి ఆధారము లేదు. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు పాటలీపుత్ర నగరంలో మరణించాడు. అశోకుడు పట్టాభిషేకం చేసుకోవడంలో రాజకీయ చతురుడు, మంత్రి పదవిలో ఉన్న వాడు, మగధ సామ్రాజ్య విషయములను గురించి తెలిసిన వాడైన రాధాగుప్తుడు అత్యంత చాకచక్యంగా ప్రదర్శించాడు. అశోకుడు పట్టాభిషిక్తుడైన తరువాత రాధాగుప్తుని తన ప్రధాన మంత్రిగా నియమించాడు. అశోకుడు తన 4, 5 సంఖ్య గల ధర్మ లిపి శాసనములందు వెల్లడించెను. అశోకుని మస్కి గుజర్ర వంటి చిన్న చిన్న శిలా శాసనములందు తప్ప తక్కిన శాసనములన్నింటిలోను అతడు 'దేవానంపియ', 'పియదసి' అని వర్ణింపబడినాడు.

భారతావనిని పాలించిన ప్రాచీన రాజులు, మహా చక్రవర్తులు 'రాజ' శబ్దమును బిరుదుగ వాడినారు. కళింగ యుద్ధంలో జరిగిన బీభత్సమును గురించి అశోకుడు తన 8వ శిలా శాసనంలో వర్ణించాడు. “1,50,000 మందికి కళింగ యుద్ధమున బందీలైనారు. 1,00,000 సైనికులు వధింపబడినారు. ఈ సంఖ్యకు మరికొన్ని రెట్ల ప్రజలు మరణించారు”. కళింగ యుద్ధంలో జరిగిన ఘోరాన్ని కళ్లార చూసిన అశోకుడి మానసిక ప్రవర్తనలో మార్పు కలిగింది. జీవితంలో యుద్ధము అనే మాటను తలపెట్టనని శపథం చేశాడు. బౌద్ధమతాన్ని అవలంభించి అహింసా పరమోధర్మః అనే సూత్రాన్ని పాటిస్తూ జీవితాంతం బౌద్ధమత వ్యాప్తికి అవిరళ కృషి చేశాడు. అశోకుడు ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసి ద్వారా బౌద్ధ మతానుయాయిగా మారాడు.

అశోకుని శాసనభాష జన సామాన్యమున వాడుకలోనున్న పాళీ భాష. కళింగ యుద్ధం తరువాత అశోకుడు రెండు నిర్ణయాలకు కట్టుబడినాడు : 1) యుద్ధములను చేయకుండు, 2) సత్కార్యాచరణ. అశోకుని 10వ రాజ్య సంవత్సరం నాటికి అతడు బౌద్ధమత స్వీకారమొనర్చాడు. బౌద్ధమతమందలి తాత్విక దృక్పథముకన్న అందలి నైతిక దృక్పథం అశోక చక్రవర్తి ఎక్కువగా ఆకర్షించినది. మతం బోధించునట్టి ధర్మచింతన, ప్రజోపయోగ కార్యక్రమాలకు అశోకుడు ప్రాధాన్యమిచ్చాడు. అశోకుడు తన శాసనాలలో "సంఘే ఉపెదె” అనే పదం విరివిగా వాడినాడు. దీనిని అనుసరించి కొందరు చారిత్రకులు అశోకుడు బౌద్ధసన్యాసి అయినాడని తెలిపారు. చైనా యాత్రికుడగు ఇత్సింగ్ బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న అశోకుని విగ్రహమును తాను చూసినట్లు తెలిపాడు.

తన రాజ్య కార్యనిర్వహణకు సంబంధించిన విధులను పూర్తి చేయుట తన విద్యుక్త దర్మమని అశోకుడు తాను వేయించిన 6వ శిలా శాసనంలో విశదీకరించాడు. అశోకుని 14 శిలాశాసనాలలో రెండు జతల శాసనములు పాకిస్థాన్‌లోని పెషావర్ జిల్లాలోని షాహ్ బాజ్ గడి, హజర జిల్లాలోని మాన్ సేరాలలో కనుగొనబడినవి. ఈ శాసనములలో మూడవది ఉత్తరమున తోన్స్, యమునా నదుల సంగమము వద్దను, నాల్గవది కథియావార్ జిల్లాలోని గిర్నార్ చెంతను, ఐదవది మహారాష్ట్రలోని థానా జిల్లాలోని సోపార వద్ద, ఆరవది పూరీ జిల్లాలోని భౌళి ప్రాంతంలో, ఏడవది ఒరిస్సాలోని గంజాం జిల్లా జాగడ వద్ద, ఎనిమిదవి కర్నూలు జిల్లా ఎర్రగుడి వద్ద లభించినవి. అశోకుని సామ్రాజ్యంలో వాయవ్యవ రాష్ట్ర రాజధాని అయిన తక్షశిల వద్ద, తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో, జలాలాబాద్ ప్రాంతంలో, సిరియా లిపిలి ఉన్న శాసనాలు కనుగొనబడినవి. ఆఫ్ఘనిస్థాన్లో పాత కాందహార్ నగర సమీపంలో గ్రీకు,సిరియా భాషలో ఉన్న శాసనం ఒకటి లభించింది. కేవలం గ్రీకు భాషలో వేయింపబడిన మరొక శాసన మచట లభించినది. ఈ శాసనము 12వ శాసనము చిరవి భాగము, 13వ శాసనారంభ భాగము కలది. సెల్యూకస్ నుండి స్వాధీన పరచుకొనిన ఈ రాజ్య భాగములు మౌర్య రాజ్యాంతర్భాగములుగ నుండెనని తెలియుచున్నది. కర్నాటక రాష్ట్రమందలి చితల దుర్గా ప్రాంతమున అశోకుడు వేయించిన మూడు శాసనములున్నవి. జబల్ పూర్ జిల్లా - రూపనాధ్, సల్మిగుండు, మధ్యప్రదేశ్ లోని దతియాజిల్లా - గుజరా, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా - అహరౌర్, న్యూఢిల్లీ - అమరపురి కాలని, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు మండలంలోని రాజుల మందగిరి, ఎర్రగుడి మొదలైన ప్రాంతాల్లో అశోక చక్రవర్తి వేయించిన చిన్న చిన్న శిలాశాసనాలు కలవు. బుద్ధుని జన్మస్థలమైన లుంబిని, అక్కడికి చేరే మార్గంలో ఉన్న తారియా అరరాజ్, రాంపుర్మా, నందన ఘర్, నిగిల్వ అనే బౌద్ధ క్షేత్రాలలో లుంబినికి వెళ్ళే మార్గంను సూచించే కొన్ని శిలా స్తంభ శాసనాలు కలవు. ఉత్తర భారతదేశమందలి అంబాలా, మీరట్ జిల్లాలోను; అలహాబాద్ సమీపంలో గల కౌశాంబి వద్ద; సారనాథ్, సాంచీల యందును శాసన స్తంభములు నెలకొల్పబడినవి. కృష్ణానది దక్షిణ తటముననున్న అమరావతిలో అశోకుని శాసన స్తంభ శకలము కనుగొనబడింది. మస్కి గుజర్రా శాసనములందు అశోకుని పేరు ప్రస్తావించబడింది. మిగిలిన శాసనములందు “దేవానమ్ పియ పియదసి” పదమున్నది. రుమిండై అనే ప్రదేశంలో కనుగొనబడిన అశోకుని శిలాశాసన స్తంభము వలన బుద్ధుని జన్మస్థలము "లుంబిని” అని తెలుస్తున్నది. “ఇక్కడ బుద్ధుడు జన్మించెను” అని అశోకుడు ఈ శాసన స్తంభంపై వ్రాయించెను. అశోకుని 13వ శిలా శాసనమును అనుసరించి ఆటవిక రాజ్యమొకటి కళింగ దేశానికి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తున్నది.

 RELATED TOPICS 

మౌర్య వంశము

అశోకుడి పరిపాలన విధానం  

అశోకుడు-బౌద్ధమత ప్రచారము

మౌర్యుల పరిపాలన