పోలీసు చర్య అనంతరం కమ్యూనిస్టుల కార్యకలాపాలు

జనరల్ జె.ఎన్. చౌదరి పరిపాలన తరువాత 1-12-1948న వెల్లోడి గారి నాయకత్వంలో సివిల్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ నుండి బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరెడ్డి, వల్లూరి బసవరాజులు వెల్లోడి గారి సివిల్ ప్రభుత్వంలో మంత్రివర్గ సభ్యులుగా నియమించబడ్డారు. తెలంగాణాలో కమ్యూనిస్టు ప్రాబల్యం అధికమైంది. ఆ పార్టీలో చీలికలు ఏర్పడిన తరువాత తీవ్రవాదులు అజ్ఞాతవాస దీక్షను బూని ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూర్చుకొని ధనికవర్గానికి, భూస్వాములకు, జాగీర్దార్లకు, దేశ్ ముఖ్, దేశ్ పాండ్యాలకు, వతన్ దార్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఆరంభించారు. కొందరు పాతకక్షలను తీర్చుకొనే ఉద్దేశ్యంతో ఉద్యమంలో చేరి వందల కొద్ది కుటుంబాల వారిని కష్టనష్టాలకు గురిచేశారు. నాయకులు అనేకమంది కారాగారవాస శిక్షను అనుభవించారు.

తెలంగాణలో ఉన్న ఎనిమిది జిల్లాల్లో తీవ్రవాదులైన కమ్యూనిస్టు ఉద్యమము ఉధృతరూపం దాల్చింది. కొందరు స్వార్థపరులు ప్రభుత్వ అధికారులతోనూ, పోలీసు మిలిట్రీ అధికారులతోనూ స్నేహసంబంధాలు ఏర్పరచుకొని తమకు శత్రువులైన వారిని, తమ మాటలు వినని వారిని, అమాయకులను అరెస్టు చేయించారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా తీవ్రవాద కమ్యూనిస్టుల పోరాటం ఆరంభమైందన్న కారణంతో ప్రభుత్వము కమ్యూనిస్టుల పట్ల వైరభావాన్ని కలిగి వారిని పట్టి బంధించడానికి అనేక దాడులను నిర్వహించడానికి పోలీసు మిలిట్రీ పటాలలను ఆదేశించారు. 1948 నుండి 1951 వరకు తెలంగాణాలో పోలీసు మిలిట్రీ దాడుల వల్ల నాలుగువేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, గెరిల్లాలు, అమాయకులైన ప్రజలు మరణించారు. కొందరు పోలీసులు, మిలిట్రీవారు గెరిల్లా దాడులకు ఆహుతయ్యారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రవాద కమ్యూనిస్టుల కార్యకలాపాలను అణచడానికి ప్రభుత్వము సర్వశక్తులను ఉపయోగించింది. తెలంగాణాలో ఉన్న దేశ్ ముఖ్, దేశ్ పాండ్యా, జాగీర్దార్, జమీందార్, వతన్దార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన సాయుధ పోరాటం అన్ని జిల్లాలకు వ్యాపించింది. కమ్యూనిస్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వము ప్రత్యేక పోలీసు దళాన్ని నియమించింది. సంఘంలో ప్రజా పీడితులను, దుర్మార్గులను, నియంతలుగా వ్యవహరిస్తున్న గ్రామ పెద్దలను, ప్రజా వ్యతిరేకులను కమ్యూనిస్టు పార్టీవారు సంహరించేవారు. పోలీసుల రక్షణను కోరిన భూస్వాములు, ధనవంతులు తమను రక్షించువారు లేరని భావించి గ్రామాలను వదలి పెద్ద పెద్ద పట్టణాలకు, హైదరాబాద్ నగరాన్ని ఆశ్రయించారు.

భారతదేశానికి స్వాతంత్ర్యము లభించిన తరువాత నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు పార్టీవారు ప్రజలకు అత్యంత సన్నిహితులుగా మారారు.

ప్రభుత్వము 1951 మార్చి, ఏప్రిల్ నెలల్లో పోలీసు మిలిట్రీ యంత్రాంగాన్ని నియమించి, అడవులు గాలించి కమ్యూనిస్టు పార్టీలపై దాడులు జరిపి వారిని చంపాలని చూశారు. ఈ పథకాన్ని అనుసరించి తెలంగాణాలో ఉన్న 8 జిల్లాల్లో 250 పోలీసు మిలిట్రీ దాడులు నిర్వహించారు. కమ్యూనిస్టు గెరిల్లాల సానుభూతి పరులని భావించి అమాయక ప్రజలను పోలీసువారు హింసించి హత్య చేశారు. కొందరిని కాల్చి చంపారు. ఇంకొంతమందిని కమ్యూనిస్టు గెరిల్లాలుగా భావించి కారాగారాలలో బంధించారు. 

తెలంగాణాలో అతివాద కమ్యూనిస్టులు నిర్వహించిన ఉద్యమంలో కొన్ని సంఘటనలు

ప్రభుత్వము పోలీసు, మిలిటరీ సైన్యాలను కమ్యూనిస్టు గెరిల్లాలపై దాడులను నిర్వహించడానికి ఆదేశించింది. వందల, వేల సంఖ్యలో ప్రత్యేక పోలీసులు, మిలిటరీ వారు దాడులు నిర్వహించారు. వీరి దాడుల నుండి తప్పించుకోవడానికి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలలో ఉన్న గెరిల్లా దళాలవారు సురక్షిత ప్రదేశాలలో తమ కార్యకలాపాలను నిర్వహించసాగారు. ఈ గెరిల్లా దళాలలో కొన్ని ఆదిలాబాదు జిల్లాలోని అటవీ ప్రాంతమును ఆశ్రయించాయి. చెన్నూరు తాలూకాలోని అడవులు వీరికి నివాసమయ్యాయి. 

సూర్యాపేట సంఘటనలు

1949 జనవరి ఒకటవ తేదీన సూర్యాపేటలోని ఒక ఇంటిని గెరిల్లాలు ఉన్నారని ముట్టడించగా, గెరిల్లాలు ముగ్గురు మిలిట్రీ వారిని హతమార్చారు. కానీ అదనపు బలగము వచ్చి గెరిల్లా దళ సభ్యులను చంపేశారు. 18-12-1948న గెరిల్లా దళం వారు ప్పెడు, ధర్మాపురం గ్రామాల మధ్య ఉన్న పోలీసులను హతమార్చారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు నాయకులు మహబూబాబాద్ తాలూకాలోని ఎల్లంపేట సమీపంలో సమావేశమయ్యారు. వారి వెంట ఆయుధాలున్నాయి. ఆ గ్రామ భూస్వామి దళ నాయకులతో స్నేహాన్ని నటించి మిలిటరీ వారికి సమాచారం అందించాడు. మిలిటరీ వారి ముట్టడికి భయపడక కమ్యూనిస్టు నాయకులు ఎదురుదాడిని నిర్వహిస్తూ స్త్రీలతో సహా తప్పించుకుపోయారు.

సూర్యాపేట తాలూకా నసింపేట గ్రామంపై సైనిక దళము దాడి జరిపింది. కామ్రేడ్ కొండల్ రెడ్డి ఆ దాడిని తిప్పి కొట్టడంలో విజయం సాధించాడు. వల్లభాపురము, ఉండ్రుగొండ, మహ్మదాపురము, ధర్మాపురం గ్రామాలపై గెరిల్లా దళాలు దాడి చేసి సకిలేరు వేంకటేశ్వరరావును, నలుగురు పోలీసు ఏజెంట్లను హతమార్చారు. 1950 ఏప్రిల్ 9న రేగులగడ్డ గ్రామ పటేలును కమ్యూనిస్టు గెరిల్లా దళము వారు హతమార్చారు.ఉర్లుగొండ, నరసింహుల గూడెం, ఆత్మకూరు, ఎల్కపల్లి, మిర్యాల, అర్వపల్లి, బొప్పారం గ్రామాలపై పోలీసులు మిలిటీ వారు నిర్వహించిన దాడులను గెరిల్లా దళాల వారు ఎదుర్కొని ప్రతి దాడిలో మిలట్రీ, పోలీసు వారిని సంహరించారు. కాంగ్రెసు హోంగార్డుల సహాయంతో పోలీసులు, మిలిటీ వారు బొమ్మనపల్లి గ్రామాన్ని ముట్టడించగా, సూర్యాపేటకు చెందిన గెరిల్లాలు వారితో తలపడి నలుగురు మిలిటీ వారిని హతమార్చారు. 

ఖమ్మం జిల్లాలో సంఘటనలు

ఖమ్మం జిల్లా పాల్వంచ తాలూకాలోని గుండాల క్యాంపుపై, నర్సంపేట తాలూకా జెండాగట్టు, వర్కాల తాలూకా జంగేడు, చినఘనపురం, గూడూరు జగన్నాథ గూడెం మధ్య నేలంచ, కారవాయ గ్రామాల మధ్య, లవ్వల గ్రామ సమీపం, కామారము, మిర్యాలపేట, గంగారం రోడ్డు, కారేపల్లి, బయ్యారం, ఆళ్ళపల్లి, రామగిరి, చెట్ల ముప్పారము, అల్లీగూడం, ధనియాలప్పాడు, షోలాపురము, కొత్తగూడెం, తిరుమల గండి, సురేవు, కంబాలపల్లి, చంద్రగూడెం మొదలైన ప్రదేశాలలో 1950 జనవరి నుండి మే నెల 7వ తేదీ వరకు గెరిల్లా దళాలకు, మిలిటీ పోలీసు దళాలకు ఘర్షణలు జరిగాయి. ఈ దాడులలో మిలిటీ, పోలీసు దళాలలోని కొందరు, గెరిల్లా దళ సభ్యులు కొందరు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలోని తల్లాడ, కొత్తగూడెం, రోళ్ళపాడు, మొద్దుల పల్లి, పిండిప్రోలు, రాయమాదారం ప్రాంతాలలో గెరిల్లా దళ నాయకులు దాడులను నిర్వహించి, మిలిటీ పోలీసుల దళాలలోని సభ్యులను హతమార్చారు.

నల్లగొండ, హైదరాబాదు జిల్లాలోని ఆరుట్ల, చిట్టాపురము, గౌరెల్లి, లోయపల్లి, ఇబ్రాహీంపట్నము, సరూర్‌నగర్, జూలూరు, సుబ్బారెడ్డి గూడెము, లక్ష్మీపురము, వాడపల్లి, మేళ్ళ చెరువు ప్రాంతాలలో ఉన్న మిలిట్రీ క్యాంపులపై గెరిల్లా దళాలు దాడులు నిర్వహించి అనేకమందిని చంపి, రైఫిళ్ళను, మందుగుండు సామగ్రిని సంపాదించగలిగారు. వరంగల్, నల్లగొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలోని బచ్చన్నపేట, తరిగొప్పుల, ఆలేరు, అక్కన్నపేట, నిర్మలపల్లి, ఆకునూరు, కొండపల్లి, సిరిసిళ్ళ, భారంగపూర్, నిమ్మపల్లి, సముద్రాల ప్రాంతాలలో 1950 ఆగస్టు 17వ తేదీ వరకు గెరిల్లాలకు పోలీసు మిలిట్రీ దళాల వారికి ఘర్షణలు జరిగాయి. ఈ దాడులలో కొందరు మిలిట్రీ పోలీసు దళం వారు, గెరిల్లా దళంలోని కొందరు సభ్యులు మరణించారు.

ఈ ఉద్యమం తెలంగాణాలోని అన్ని జిల్లాలలో దావానంలా వ్యాపించింది. ప్రజలు కమ్యూనిస్టు గెరిల్లాల సభ్యులకు అనుకూలంగా ఉండేవారు. ప్రజా పీడన పరాయణులను, దుర్మార్గులను దుష్టులైన భూస్వాములను మాత్రమే గెరిల్లా దళ సభ్యులు చంపేవారు. మిలిట్రీవారు, పోలీసులు, కొందరు కాంగ్రెసు నాయకుల అండదండలతో గెరిల్లా దళాలపై దాడులు నిర్వహించారు. న్యాయమైన పోరాటానికి ప్రజల మద్దతు లభించింది. కానీ పాతకక్షలను సాధించడానికి గెరిల్లా దళాలలో చేరిన వారి చర్యలు ప్రజలకు వారిపట్ల అయిష్టాన్ని పెంచసాగాయి. 

ఆదిలాబాద్ జిల్లాలో సంఘటనలు

కమ్యూనిస్టు గెరిల్లాలు, కార్యకర్తలు ఆదిలాబాదు జిల్లాలో ఈ ఉద్యమాన్ని ఆరంభించి, 200 గ్రామాలలో వ్యాపింపచేశారు. భూస్వాముల నుండి భూమిని ఆక్రమించి, భూమి లేని ప్రజలకు ఇవ్వడంతో తీవ్రవాదుల ఉద్యమం ప్రజలకు దగ్గరైంది. వారు కమ్యూనిస్టు గెరిల్లాల ఉద్యమానికి చేయూతనివ్వసాగారు. జమీందారుల నుండి, భూస్వాముల నుండి భూమిని స్వాధీనపరచుకొని బీద ప్రజలకు, భూమి లేని నిరుపేదలకు కమ్యూనిస్టు గెరిల్లాలు పంచసాగారు. గ్రామాధికారుల రికార్డులు, దఫరములు, పెట్టుబడిదారుల అప్పు పత్రాలు స్వాధీనం చేసుకొని అగ్నికి ఆహుతి చేశారు. భీంరెడ్డి నరసింహారెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి కమ్యూనిస్టు ఉద్యమ ప్రచారం చేసి ప్రజలను ఉత్తేజపరచి, చైతన్యవంతులను చేయడంలో సఫలమయ్యారు. 1951 మే నెలలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాన్ని అనుసరించి దేవులపల్లి వేంకటేశ్వరరావుగారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి కమ్యూనిస్టు గెరిల్లాలకు, కార్యకర్తలకు ప్రజలకు ఆ సమావేశపు తీర్మానాలను తెలియచేశారు.

తెలంగాణాలోని జిల్లాల్లో వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేదలకు పంచి ఇచ్చిన కమ్యూనిస్టు గెరిల్లాలు, వేల సంఖ్యలో పశువులను భూస్వాముల నుండి గ్రహించి పేదలకు పంచిపెట్టారు. వారు వ్యవసాయం చేసుకోవడానికి పశువులు ఉపయోగపడేవి. బీడి ఆకు, ఇప్పపువ్వు సేకరణ కాలంలో సరైన ధరలు లభించేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమకారులు, యాజమాన్యమును, కొనుగోలుదారులను ఒప్పించారు. గెరిల్లా ఉద్యమం ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, చెన్నూర్ తాలూకాలోని 200 గ్రామాలకు విస్తరించింది. నల్లగొండ జిల్లా అంతటా ఈ ఉద్యమం వ్యాపించింది. కమ్యూనిస్టు పార్టీకి పుట్టినిల్లు అనదగిన నల్లగొండ జిల్లా మితవాద, అతివాద కమ్యూనిస్టులకు, కాంగ్రెసు వారికి ఆలవాలమైంది. ఈ ప్రాంతంలో ఉన్న భూస్వాములు గ్రామాలను వదిలి హైదరాబాద్ నగరంలో, భువనగిరి, నల్లగొండ పట్టణాలలో నివసించసాగారు.

తీవ్రవాద ఉద్యమానికి ఆకర్షితులైన యువకులు వందల వేల సంఖ్యలో ఉద్యమంలో చేరారు. స్త్రీలు సైతం గెరిల్లా కార్యకలాపాలను అతి సమర్థవంతంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 65 మంది సభ్యులు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. అందులో 9 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో కమ్యూనిస్టు గెరిల్లాలు 13 దళాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో రెండు దళాలు స్త్రీలకు ప్రత్యేకించబడ్డాయి. ఈ కాలంలో గెరిల్లాలు ఆదిలాబాద్ జిల్లాలో 64 దాడులు నిర్వహించి 71 మంది పోలీసులను వధించారు. భూస్వాములు, దుర్మార్గులు, పోలీసులకు రహస్య సమాచారాన్ని అందించువారు 42 మంది, కమ్యూనిస్టు గెరిల్లాల కాల్పులలో మరణించారు. గెరిల్లా కార్యకలాపాలు నిర్వహించువారిలో ఐదుగురు జోనల్ కేంద్ర నిర్వాహకులు, ఏడుగురు దళ సభ్యులు దివంగతులయ్యారు.

నస్పూర్ రాజావారికి 50 వేల నుండి లక్ష ఎకరాలు, మందమట్టి మాధవరావు గారికి 10 వేల ఎకరాలు 20 గ్రామాల పతందారి, పుసులూరి కుటుంబీకులకు 10 వేల నుండి 20 వేల ఎకరాలు భూమి, వేమనపల్లి కోళి సోదరులకు మూడు వేల ఎకరాల భూమి, ఇతర కుటుంబాలలోని రెడ్డి, వెలమ, భూస్వాములకు వందల ఎకరాల భూమి ఉండేది.

జమీందారులు, భూస్వాములు, భూములను కాళ్ళకు ఇస్తూ రైతుల నుండి ప్రతిఫలాన్ని పొందేవారు. దున్నేవానిదే భూమి అనే కమ్యూనిస్టు పార్టీ వారి నినాదము ప్రజలను వారికి సన్నిహితులుగా చేసింది. బెల్లంపల్లి బొగ్గు గనుల ప్రాంతాల నుండి సిర్‌ పూర్ ఉత్తరాన వాగ్దానది పర్యంతము కమ్యూనిస్టు గెరిల్లాల సాయుధ పోరాటం వ్యాపించింది. అడవులు గెరిల్లాల నివాస స్థలంగా మారాయి.

బెల్లంపల్లి కార్యకర్తల సహాయంతో 1950 అక్టోబర్ నెలలో దళము సభ్యులు రాంపురం గ్రామంపై దాడి జరిపి, ప్రజాద్రోహిగా పరిగణించబడుతున్న పట్వారీని సంహరించారు. రెవెన్యూ రికార్డులను విధ్వంసం చేశారు. ఈ దాడిలో పాల్గొన్న 12 మంది మిలిటెంట్లు అరెస్టయ్యారు. కరీంనగర్ జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లా చేరిన గెరిల్లా దళాలు, ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు తాలూకాలలో 55 గ్రామాలలో ప్రచార యాత్రలు నిర్వహించారు. ఎర్ర జెండాల స్థాపన, రెవెన్యూ రికార్డుల విధ్వంసం వారి కార్యకలాపాలలో ప్రధానమైనవి. భూ సేకరణ, పేద రైతులను, అభాగ్యులను ఆదుకోవడం గెరిల్లా నాయకులు రూపొందించిన పథకాలలో ముఖ్యమైనవి. గెరిల్లా దళాల వారు దస్తూరాబాదు, ఎల్లాపురములలో ప్రభుత్వ గోదాముల నుండి వంద సంచుల ధాన్యమును స్వాధీనపరచుకొని చుట్టు పక్కల ఉన్న గ్రామీణులకు, రైతు కూలీలకు పంచిపెట్టారు. 

మాసాయిపేట సంఘటన

మాసాయిపేట భూస్వామి నరసింహారెడ్డి గారి గిడ్డంగి నుండి 50 బస్తాల ధాన్యము స్వాధీనపరచుకొని గెరిల్లాలు ప్రజలకు అందించారు. అతని తనయుడు గెరిల్లా దళాల వారికి అనుకూలుడు. ప్రజాభిమానాన్ని పొందినవాడు. నరసింహారెడ్డి పోలీసులను రప్పించి మాసాయిపేట గ్రామంలో బీభత్సం సృష్టించాడు. పదిమందిని అరెస్టు చేయించాడు. గ్రామీణుల ఇళ్ళపై దాడులు నిర్వహించారు. పోలీసులు చుట్టు పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి ప్రజలను హింసించి ధాన్యపు బస్తాలను బలవంతంగా స్వాధీనపరచుకొని, అమాయకులైన 35 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్య వల్ల పలు గ్రామాలలో ఉన్న ప్రజలు నరసింహారెడ్డికి వ్యతిరేకులై గెరిల్లా దళాలలో సభ్యత్వాన్ని పొంది ఉద్యమం బలపడేవిధంగా చేశారు. 

రావాజీపేట సంఘటన

రావాజీపేట ప్రజలు ఆ గ్రామ భూస్వామికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. పెంబి, మందపల్లి, దొంగగూడెము గ్రామాలలో ప్రజలు పోలీసుల చిత్రహింసకు గురైనా గెరిల్లా దళసభ్యుల పేర్లను గానీ, వారు ఉండే స్థలాల ఆచూకీ గానీ తెలపలేదు. గెరిల్లాల రహస్యాలు తెలిసినా ప్రజలు వారిని కాపాడడానికి ప్రయత్నించారు. పోలీసు చర్య తర్వాత బెల్లంపల్లి గని కార్మికులు, ప్రజలు వ్యాపారులపైనా ప్రజాకంటకుల పైనా దాడులు నిర్వహించారు. పోలీసు బలగముతో కొందరు దుర్మార్గులు కార్మిక వర్గములపై దాడి చేసి, పురుషులను హింసించి, హిందూ ముస్లిం వనితలను మానభంగం చేసినందున 25-9-1951లో 9 వేల మంది గని కార్మికులు ఆ సంఘటనను నిరసిస్తూ సమ్మె నిర్వహించారు. పోలీసుల దౌర్జన్య చర్య వల్ల వేలకొలది ప్రజలు కష్టనష్టాలకు గురికావలసి వచ్చింది.

కామ్రేడ్ లింగయ్య నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని చందుపట్ల గ్రామవాసి. కమ్యూనిస్టు గెరిల్లా నాయకునిగా ప్రసిద్ధిగన్నవాడు. అతడు తన నలుగురు అనుచరులతో గోదావరి నదిలో స్నానమాచరించి ఎల్లాపూర్ అడవులలోని స్థావరానికి చేరే సమయంలో మిలిట్రీ సైన్యము వారు దారికాచి కాల్పులు జరిపి సంహరించారు. లింగయ్య, అతని నలుగురు అనుచరులు అక్కడికక్కడే మరణించారు. 

ఉద్యమ విరమణ

కమ్యూనిస్టు పార్టీ నాయకులు సాయుధ పోరాట సమీక్ష చేసి, ఉద్యమాన్ని విరమించడం శ్రేయస్కరమని భావించారు. 21-10-1951న తెలంగాణ సాయుధ పోరాటం ఆగిపోయింది. ఈ సమాచారం రేడియో ప్రసారాల ద్వారా, పత్రికల ద్వారా వెల్లడించారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. భారత ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చి కమ్యూనిస్టు పార్టీ వారిపై ఉన్న ఆంక్షలను తొలగించడంలో డాక్టర్ ఎం.ఎన్. జైసూర్య గారు చేసిన సేవల ఫలితంగా భారత ప్రభుత్వము 1951లో కమ్యూనిస్టు నాయకులను, ఉద్యమకారులను, గెరిల్లాలను విడుదల చేయడానికి అంగీకరించింది. వందల కొద్ది నాయకులు, వేల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు కారాగారం నుండి విముక్తి పొందారు. కానీ 1952 నాటి ప్రప్రథమ సాధారణ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీకి పాల్గొనే అవకాశం దక్కలేదు. కానీ పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీ పేరుతో, హస్తము గుర్తుతో ఎన్నికలలో పాల్గొనడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు అనుమతించబడ్డారు.

సంబంధిత అంశాలు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం-1


Tags :   Telangana Armed Struggle     

 Communist Party     Operation Polo   

 Freedom Movement     Peoples Democratic Party   

 Guerrilla warfare    Telangana History