లాతూరు తిరుగుబాటు

అసలే ధాన్యం కొరతతో సతమతమవుతూ, పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల అవసరాలు తీర్చకుండా ఉన్న ధాన్యాన్ని మరో చోటికి తరలించే ప్రయత్నం చేసిన ప్రభుత్వంపై అసహనంతో ప్రజలు తిరుగుబాటు చేసిన సంఘటన లాతూరులో జరిగింది. 1943 ఏప్రిల్ 3వ తేదీన లాతూరులో గల ధాన్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా సుమారుగా 4-5 వందల మంది జనం రెండు ధాన్యం లారీలపై, రెండు ఎడ్లబండ్లపై దాడి చేసి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో 9 మంది అరెస్టు అయినారు. దీనితో ఆగ్రహించిన జనం 2000 మంది పోలీస్ స్టేషనను చుట్టుముట్టి అరెస్టు అయిన వారిని బెయిలుపై విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు అంగీకరించలేదు. పోలీసు కస్టడీలో ఉన్న వారు మంచినీళ్ళు అడగగా పోలీసులు తాళాలు తెరవడంతో అక్కడ ఉన్న జనం లోపలికి చొరబడి తమ వారిని బయటికి తెచ్చుకొన్నారు. ఈ సంఘటనలో జరిగిన కాల్పుల్లో 5గురు చనిపోయారు. 12 మంది గాయపడినారు. 

జాబోత్ ఠాను

1946 జూలై 4వ తేదీన దొడ్డి కొమరయ్య అమరుడవడంతో తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత ఈ ఉద్యమం వలన వ్యవసాయదారుల భూములు ఎవరివి వారికి దక్కినవి. ఈ ఉద్యమంలో జనగామ తాలూకాలోని పూనుకూరు మత్తేదారుల ఆధీనంలోని ధర్మాపురం పడమటి తాండాకు చెందిన జాబోత్ తాను, మంగ్లీ లంబాడ గిరిజన కుటుంబం చేసిన త్యాగాలు వారి భూ హక్కులను కాపాడినవి. 1948, ఫిబ్రవరి 7వ తేదీన విసునూరు దేశ్ ముఖ్ రెండవ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఉద్యమాన్ని అణచడానికి నిజాం పోలీసులు, రజకార్ల సహకారంతో ధర్మాపురం గ్రామాన్ని రెండుసార్లు తగలబెట్టించాడు. అంతే కాకుండా ఆ గ్రామం పక్కన ఉన్న గిరిజన తాండా వాసులను, తాండాలోని మహిళను అతి క్రూరంగా హింసించాడు. జారోత్ జోద్యా నాయక్, జారోత్ తానూ నాయక్లను ప్రభుత్వానికి లొంగే లాగా మారడానికి ఈ హింసాకాండకు పూనుకున్నాడు. చివరికి జనగామ రైల్వే స్టేషన్లో ప్రజల చేతుల్లో హతమైనాడు.

జారోత్ సోమ్లా, రెడ్యా, అజ్మీరా బలరాం, చెంద్రూ, రాము, బానోత్ శక్రూ మొదలైన వారి మరణాన్ని కనులారా చూసిన హామూ మంగ్లీ, ఫూలీబాయిలు తీవ్రంగా స్పందించి ఉద్యమాన్ని నడిపించ డానికి సన్నద్ధమైనారు. జారోత్ హాము కుటుంబం మొత్తం ఉద్యమంలో పాల్గొన్నది. ఫూలీభాయి తెగువను చూసి పోలీసులు, రజాకార్లు ఆ తాండావైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడినారు.

ఆ సమయంలో గిరిజన నాయకులు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ తమ అనుయాయులకు మాత్రం అందబాటులో ఉంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. 

జాటోత్ తానూ

ఇతను ధర్మాపురం గ్రామానికి సమీపంలో గల పడమటి తాండాకు చెందిన వాడు. ఇతని తల్లిదండ్రులు హాము-మంగ్లీ. స్వతహాగా ధైర్యస్థుడైన జాటోత్ తానూ ఎన్నోసార్లు స్థానిక దొరలు, రజాకార్లు, పోలీసులు చేసిన దాడుల నుండి తప్పించుకున్నాడు. అలాంటి సమయంలో యూనియన్ మిలటరీ కమ్యూనిస్టు విప్లవకారుడైన ఇతని గురించి అన్వేషించసాగింది.కాని మిలటరీ వారికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతుండగా ఒక ద్రోహి కారణంగా మిలటరీ వారికి దొరికి పోయాడు.నెతావత్ నంద్యా, భూక్యా హరిసింగ్, మొండ్రాయికి చెందిన వాంకుడోత్ భీమ్లాల సమాచారంతో కేంద్ర బలగాలు రానూను పట్టుకొని చిత్రహింసలు పెట్టినా తమ పార్టీకి సంబంధించి ఒక్క రహస్యాన్ని కూడా చెప్పలేదు. అతని ధైర్యం మిలటరీ అధికారులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది. వారు అతన్ని కాల్చి చంపడానికి కూడా వెనుకాడారు.

కానీ స్థానిక దొరలు, భూస్వాములు కలిసి అతణ్ణి అత్యంత కిరాతకంగా చంపివేశారు. తానూ వీరమరణం తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక అపూర్వ ఘట్టంగా వర్ణించ వచ్చును. అతను చనిపోతూ కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, శత్రువులు నశించాలి అని నినాదాలు చేశాడు.

జాటోత్ తానూ నాయక్ తన ప్రజలకు జరుగుతున్న అన్యాయం, వారిపై గల ప్రేమ, వారి అమాయకత్వం, నిరక్షరాస్యత మొదలైన వాటిని తొలగించడానికి అతడు చేసిన ప్రయత్నానికి గానూ గిరిజనుల హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోతాడు. తానూ జ్ఞాపకార్ధం ధర్మపురిలో మే 11, 1989వ తేదీన ఒక స్మారక స్థూపం నిర్మించబడింది. 

సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు

రైతుల సమస్యలు, గ్రామాల పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలే లక్ష్యంగా ఆంధ్రమహాసభ ఏర్పాటయింది. ఈ సభ ప్రధానంగా గ్రామీణ ప్రాంత సమస్యలపై దృష్టిపెట్టసాగింది. దీని మొదటి సమావేశం క్రీ.శ. 1930లో మెదక్ జిల్లా లోని జోగిపేటలో తెలంగాణ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. మార్చి నెల 3, 4, 5 తేదీలలో జరిగిన తెలంగాణ ప్రథమాంధ్ర మహాసభకు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు అధ్యక్షత వహించారు. మాడపాటి హనుమంతరావు గారు కార్యదర్శకత్వం వహించారు. ఈ సభలో వెట్టిచాకిరి నిర్మూలన, బాల్యవివాహాలపై నిషేధం వంటి సమస్యలపై ఒక తీర్మానం చేయడం జరిగింది.

1941లో చిలుకూరులో జరిగిన ఆంధ్రమహాసభ నుండి కమ్యూనిస్టులు సభను తమ ఆధీనంలోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. 1941 జనవరి-జూన్ నెల మధ్యలోనే కమ్యూనిస్టులు ఖమ్మం, తునికిపాడు, చందుపట్ల, సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లో రహస్యంగా రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతుల్లో భాగంగా ఉత్సాహవంతులైన యువకులను తమవైపు ఆకర్షించుకున్నారు. క్రమంగా ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ స్వరూపాన్ని సంతరించుకుని జనగామ, సూర్యాపేట తాలూకాల్లో కౌలుదారు ఆందోళనలను చేపట్టింది. ఈ విధంగా 1941 చిలుకూరు ఆంధ్ర మహాసభయే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయినదిగా భావించవచ్చు. 

ప్రజాసమస్యలపై కమ్యూనిస్టుల ఉద్యమం

జనగామ, సూర్యాపేట తాలూకా ప్రాంతాల్లో కౌలుదారు సమస్యలు, వెట్టిచాకిరీలపై కమ్యూనిస్టు నాయకులు ఉద్యమాలకు పూనుకున్నారు. చిన్న చిన్న భూస్వాములు కౌలుదారులతో వ్యవసాయం చేయించుకుని కౌలుదారు హక్కులు మాత్రం ఇచ్చే వారు కాదు. కౌలుదారులకు అండగా ఆంధ్రమహాసభకు చెందిన కమ్యూనిస్టులు ఉద్యమాలు ప్రారంభించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ తదిర తెలంగాణ ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని కమ్యూనిస్టులు చేపట్టారు. 1940-46 మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ - కమ్యూనిస్టులు భూస్వాములకు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలచే పోరాటాలు చేయిస్తూ ఉండేవారు.

ఈ విధంగా ఆంధ్రమహాసభలోని కమ్యూనిస్టు కార్యకర్తలు జమీందార్లు, దేశ్ ముట్లు చేస్తున్న దౌర్జన్యాలు, దురాక్రమణలు, అణచివేతలు, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా చట్టబద్ధంగానే ఎన్నో సామూహిక పోరాటాలు నిర్వహించారు. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో కమ్యూనిస్టులు యువతను ఆకర్షించి, ప్రజలను ప్రభావితం చేయడంతో తెలంగాణలోని అనేక గ్రామాల్లో అవినీతికి, నజరానాలు లేదా మామూళ్ళు ఇవ్వడానికి వర్తక వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితమై పోరాటమార్గంలో పయనించారు. చేనేత కార్మికులు, రైతులు, కూలీలు, స్త్రీలు, చేతి వృత్తుల వారు, ఇతర పేద ప్రజానీకాన్ని వ్యాపారుల, జాగీర్దారుల, భూస్వాముల, దేశ్ ముల, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ పోరాట మార్గంలో నడిపించడంలో కమ్యూనిస్టులు చేసిన ప్రయత్నం ప్రశంసించదగినది. Tags :   Telangana Armed Struggle       Jaboth Tanu    

 Communist Party     Operation Polo    Jatoth Tanu  

 Freedom Movement     Peoples Democratic Party   

 Guerrilla warfare    Telangana History