మల్లారెడ్డి గూడెం సంఘటన

1946 డిసెంబర్ ఒకటవ తేదీన హుజూర్‌నగర్ తాలూకా మల్లారెడ్డి గూడెంలో నైజాం మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముగ్గురు దళిత మహిళలు వీరమరణం పొందారు. బలవంతపు లెవీధాన్యం వసూలుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని మట్టుపెట్టే ఉద్దేశ్యంతో ఉదయాన్నే మల్లారెడ్డి గూడెంపై నిజాం మిలటరీ దళాలు అకస్మాతుగా చేసిన దాడిని 600 మంది ప్రజలు కలిసి తమకు అందుబాటులో గల ఆయుధాలతో ఎదుర్కొన్నారు.

నిజాం మిలటరీ దళాలు గ్రామస్తులతో సంధి చేసుకుంటున్నట్లు నటించి ముందు వరుసలో ఉన్న యరబోలు అప్పిరెడ్డి, ముండి వీరయ్యలను కాల్చి చంపారు. ఈ సంఘటనతో గ్రామానికి చెందిన స్త్రీలు సైతం రెచ్చిపోయి రోకళ్ళతో, కొడవళ్ళతో దాడులు చేయడం ప్రారంభించారు. మిలటరీ సైనికులు విచక్షణంగా జరిపిన కాల్పులలో చింద్రాల గురవమ్మ, తొండమ్మ, అంకాళమ్మలు నేలకొరిగారు. సాయుధ పోరాటంలో అమరులైన తొలి మహిళలు వీరు ముగ్గురే. 

ఆకునూరు సంఘటన

1945లో ప్రజలు బలవంతపు లెవీ వసూలుకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లా జనగామ తాలూకాలో తిరుగుబాటు చేశారు. వీరి ఆగ్రహావేశాల ముందు పోలీసులు, అధికారులు నిలవలేక పోయారు. తిరుగుబాటు అణచడానికి ప్రభుత్వం సాయుధ పోలీసుల బలగాలను పంపించింది. పోలీసులు ప్రజలపై దాడులు చేశారు. స్త్రీలపై కూడా దౌర్జన్యాలు చేశారు. 

మాచిరెడ్డిపల్లి సంఘటన

బీదర్ తహసీల్దార్ అయిన ఖాజా మొహియుద్దీన్ గ్రామంలోని కొంతమంది రైతులు లేవీ పన్నులు చెల్లించడం లేదనీ, మరికొంత మంది తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యానికి తప్పుడు లెక్కలు చూపిస్తు న్నారని వారిని విచారణ చేసే నిమిత్తమై గ్రామానికి వచ్చాడు. గ్రామ పోలీస్ పటేల్ అయిన హన్మంతరెడ్డి ఇంట్లో 15-40 బస్తాల ధాన్యాలకు లెక్కలు లేవని వాటిని స్వాధీనపరుచుకున్నాడు. హన్మంత రెడ్డి తన సహాయకుడు రాంరెడ్డితో పాటు కలిసి సుమారు 40 మంది గ్రామస్తులతో తహసిల్దార్ ధాన్యాల బస్తాలను ఉంచిన గోడౌన్ కు వచ్చి ధాన్యాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దానితో తహసీల్దార్ తగ్గి ధాన్యంలో లెవీ పన్నుకు సరిపడిన ధాన్యాన్ని తీసుకుని మిగతా ధాన్యాన్ని వారికి స్వాధీనం చేయమని గిర్దావరకు సూచించాడు. ఆ గ్రామస్తుల కోపాన్ని చూసి అది సమస్యాత్మక గ్రామం అని గుర్తించి అక్కడి నుండి తహసీల్దార్ పారిపోయాడు. పారిపోతున్న తహసీల్దార్‌ను ఆపి గ్రామస్తులు లెవీ ధాన్యపు వసూలునను ఎకరానికి ఒక మణుగు కాకుండా, ఎకరానికి అర మణుగు చెల్లించేట్టుగా ఉత్తర్వులు రాయమని ఒత్తిడి చేశారు.

తహసిల్దార్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న తాలూక్లార్ మరియు డి.ఎస్.పి. అర్ధరాత్రి సమయంలో 30 మంది పోలీసులతో మాచిరెడ్డిపలి గ్రామాన్ని ముట్టడించి ప్రజలను తీవ్రంగా కొట్టించి అరెస్టులు చేశారు. 

కడివెండి సంఘటన 

కడివెండి గ్రామస్తురాలైన జానమ్మ దొరసాని అనే మహిళా భూస్వామి తన ఇంటిలో సుమారుగా 800 బస్తాల ధాన్యాన్ని నిలువ ఉంచిందని ఒక ఆంధ్ర మహాసభ కార్యకర్త ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందింది. భూస్వామి గూండాలు ఆ ధాన్యానికి కాపలా కాసున్నందుకు అధికారులకు ఆ ధాన్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి మూడు రోజుల సమయాన్ని తీసుకోవడం జరిగింది. చివరికి ఆంధ్రమహాసభ కార్యకర్త సమాచారమిస్తే తప్ప ధాన్యం స్వాధీనానికి అధికారులు పూనుకోలేక పోవడం అనేది భూస్వాములకు, అధికారులకు మధ్య ఉన్న సంబంధం బహిర్గతం చేస్తున్నది. 1946 నాటికి ఉద్యమం విస్తృతమై అనేక గ్రామాలకు పాకి కూరులైన జమీందారులకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయడంతో పాటే అప్పటికే రైతు సంఘాలు ఏర్పాటైన గ్రామాల నుంచి జమీందారులను తరిమే కార్యక్రమాలు జరిగినవి.

ఆర్థిక ఉద్యమంగా ప్రారంభమై ప్రజాచైతన్యం క్రమంగా రాజకీయ పోరాటంగా మారి ప్రజలు దేశ్ ముఖ్ ల కబంధ హస్తాల నుండి తమ గ్రామాలను విముక్తి చేసే స్థాయికి వెళ్ళేలా చేసింది. 1945-46 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పెరిగిపోతున్న రైతుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పై, రైతాంగానికి ఉండే సహజ, సామాజిక, సాంప్రదాయిక హక్కుల పైన తెగబడి, వారికి వ్యతిరేకంగా అనేక దుశ్చర్యలు చేయడంతో గ్రామీణ సమాజంలోని వివిధ ప్రభావిత వర్గాలను సమైక్యపర్చడం జరిగింది. 

పరిటాలలో జరిగిన ఉద్యమం

పరిటాల జాగీర్దార్ ఖాన్ ఖానానకు ఏజెంట్ గా ఉన్న లంకా సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రజలను ఎక్కువగా పీడిస్తుండేవాడు. ప్రజలు న్యాయబద్ధంగా అతన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేసినా కూడా ప్రభుత్వ అండదండలతో వారి ప్రయత్నాలను సుబ్రహ్మణ్య శాస్త్రి వమ్ముచేశాడు. చివరికి నిజాం ప్రభుత్వ ఇతని దౌర్జన్యాల గురించి విచారించడానికి ఒక సంఘాన్ని నియమించింది. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి అతని ఆగడాలతో విసిగి పోయిన ప్రజలు లంకా సుబ్రహ్మణ్యశాస్త్రిని హత్య చేయడంతో జాగీర్ ప్రజలందరికి విముక్తి లభించింది. 

అల్లీపురం, తిమ్మాపురం సంఘటనలు

వరంగల్ జిల్లాలో అన్వర్ పాషా ఆధీనంలోని గ్రామాలు అల్లీపురం, తిమ్మాపురం. ఈ గ్రామాల ప్రజలందరూ కౌల్దారులే. ఇక్కడి భూములకి అన్వర్‌ పాషా ఒక్కడే యజమాని. కౌలురేట్లు తన ఇష్టానుసారం పెంచి వసూలు చేసేవాడు. రౌడీలను పంపి దౌర్జన్యంగా వసూలు చేయించేవాడు. ప్రజలంతా ఏకమై కౌలు సహేతుకంగా ఉండాలనీ, తమకు శాశ్వత యాజమాన్య పట్టాలు ఇవ్వాలని తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తున్న ప్రజల నాయకులను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. దీనితో ప్రజల్లో సహనం నశించి చేతికి అందిన కర్ర, గునపం, రోకలి వంటి వాటితో జాగీర్దార్ ఇంటి పైకి దండెత్తడంతో అతను దొడ్డి గుమ్మం నుండి పారిపోయాడు. ఈ విధంగా జాగీర్దారను ఎదిరించి గ్రామస్తులు తమ భూములను కాపాడుకున్నారు.


Tags :   Telangana Armed Struggle       Allipure Incident    

 Communist Party     Paritala Incident    Akunuru Incident  

 Freedom Movement     Peoples Democratic Party   

 Guerrilla warfare    Telangana History