ముల్కలగూడెం తిరుగుబాటు

నైజాం రాజ్యంలో పేరుపొందిన జమీందార్, వేలాది ఎకరాల భూమికి యజమాని అయిన ముల్కలగూడెం జమీందార్ పింగళి రంగారెడ్డి చిన్న రైతుల భూములను దక్కించుకోవాలని దుష్ట పన్నాగాలు వేసేవాడు. పాతబాకీ తీర్చలేదనే మిశతో సత్తయ్య అనే రైతుకు చెందిన భూమిని, అతని బంధువుల మాగాణిని, మెట్ట భూములను ఆక్రమించాడు. రంగారెడ్డి చేస్తున్న అన్యాయాన్ని గ్రహించిన గ్రామస్తులు, పక్క గ్రామస్తులందరూ ఏకమై రకరకాల ఆయుధాలతో దాడిచేసి రంగారెడ్డిని, అతని గూడాలను గ్రామం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. రంగారెడ్డి పోలీసు బలగాలను రప్పించి గ్రామస్తులలో ముఖ్యమైన వారిని అరెస్టు చేయించాడు. కానీ ప్రజలు ఏ మాత్రం భయపడకుండా తమ భూములను తమ ఆధీనంలోనే ఉంచుకుని తమ స్థానాలను పదిలపరుకున్నారు. 

మేళ్ళచెరువు తిరుగుబాటు

చెన్నూరు వీరభద్రరావు అనే భూస్వామి మేళ్ళ చెరువు గ్రామంలోని ప్రజలు ఎన్నో రోజుల నుండి సాగు చేసుకుంటున్న భూమిలో సగం భూమిన తన అంగబలం, అర్థబలంతో ఆక్రమించు కొని రైతుల హక్కులను కాలరాసాడు. రైతులందరు అతనికి వ్యతిరేకంగా ఏకమై తిరుగుబాటు లేవనెత్తారు. గతంలో వీరభద్రా రావు తండ్రి ఇదే విధంగా రైతుల భూములనాక్రమించగా అతన్ని రైతులంతా కలిసి చంపివేశారు. ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని వీరభద్రరావు తనకు తన తండ్రి గతి పడుతుందని గ్రహించి రైతులకు శాశ్వత కౌలు హక్కు ఇచ్చాడు. ఈ విధంగా మేళ్ళ చెరువు ప్రజలు ఘనవిజయం సాధించారు. 

బేతవోలు రైతాంగ పోరాటం

నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకాలో గల బేతవోలు నిజాం రాజ్యంలో ఒక జమీందారి. రైతాంగ పోరాట కాలంలో ఈ మక్తాలో బేతవోలుతో పాటు జేరిపోతుల గూడెం, ఆచార్యులగూడెం, పోలారుగూడెం, చెన్నారిగూడెం, పోతినేని గూడెం, కొమ్ములబండ తాండా, సీతారాం తాండా మున్నగు చిన్న చిన్న పల్లెలు గలవు. ఇక్కడి సంస్థానానికి ప్రభువైన తడకమళ్ళ సీతారామచంద్ర రావు స్వతహా మంచి వ్యక్తిత్వం గలవాడు కావున దేవాలయాల పోషణార్ధం అనేక భూదానాలు చేశాడు. ఉచిత ఔషధాల చికిత్సాలయాలకు, హిందూ ఉత్సవాలకు, మొహర్రం వంటి ముస్లిం పండుగలకు కూడా విరాళాలు ఇచ్చి సంస్థాన నిధులు విరివిగా ఖర్చు చేశాడు. ఇందువలన కొంతవరకు ఆర్థికంగా ఇబ్బందులకు లోనుగావాల్సి వచ్చింది. దానికితోడు భూస్వామ్య వర్గానికి వంశ పారంపర్యంగా వచ్చే దోపిడీ, రకరకాల అక్రమ గుణాలు, తోడయినవి. దానితో ప్రజలపై ఎక్కడలేని పన్నులన్నీ వేయాల్సి వచ్చింది.

హైదరాబాద్ రాజ్యంలో వస్తున్న పరిణామాలను బట్టి అక్కడి ప్రజలు చైతన్యంవంతులై వారిపై విధింపబడుతున్న అధిక పన్నులను వ్యతిరేకిస్తూ 1925-32 మధ్యలో, 1934-35 మధ్య కాలంలో రైతులు అనేక తిరుగుబాట్లు చేశారు. భూమిశిస్తు సహేతు కంగా నిర్ణయించాలని, తాము కాస్తు చేస్తున్న భూములపై తమకే పట్టా హక్కులుండాలని, వెట్టిచాకిరీని, రకరకాల పన్నులను రద్దు చేయాలని 1938 నాటికి అనేక సంవత్సరాలుగా న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు. దేవునిపన్ను, పశువులపై పన్ను, కౌలుపన్ను, చుట్టంపన్ను, మగ్గంపన్ను, పెళ్ళిపన్ను, స్త్రీలపై పన్ను, ఆడబిడ్డ గంపలు, గండ్లు పడితే పన్ను, దత్తత ఇల్లరికం పన్ను ఇలా రకరకాల పన్నులతో బేతవోలు రైతులు విసిగిపోయారు. చివరికి రైతులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు మూడు దశల్లో జరిగింది. రైతుల నాయకత్వం బలహీనంగా ఉన్నా, ఈ మత్తేదారుపై గల ఈర్ష్య, కోపంతో మునగాల జమీందారు రైతుల పక్షాన కోర్టు వ్యవహారాలకు పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది.

హుజూర్ నగర్ తాలూకా కందిబండ గ్రామ దేశ్ ముఖ్ రైతుల తరపున పైరవీ చేసాడు. మత్తేదారు దేశ్ ముఖ్ బంధువు అయిన కూడా అతన్ని వ్యతిరేకించాడు. రైతులను కోర్టుల చుట్టూ తిప్పాడు. ఇది తట్టుకోలేక కొంతమంది రైతులు లొంగిపోయారు. కొంతమంది గ్రామాలను సైతం వదిలి వెళ్ళిపోయారు. 1934-35 రైతులు మళ్ళీ పోరాటం ప్రారంభించారు. దీనికి నాయకత్వం వహించింది మంత్రి ప్రగడ రాజగోపాల రావు. ఇతను పట్వారి, మత్తేదారుకు లొంగి ఉండేవాడు. కానీ ఈయన గాంధేయ వాది మరియు కాంగ్రెస్ అభిమాని. జెర్రిపోతుల గూడెంను పోరాట కేంద్రంగా మార్చుకున్నాడు. చట్టాలు, పైరవీలు, లిటిగేషన్లు ఎక్కువ చేశాడు. అక్రమ పన్నులన్నీ రద్దు కావాలనే ప్రజల కోరిక చట్టరీత్యా రైతులు ఇవ్వడానికి నిరాకరించే సరికి వాటంతట అవే రద్దెనవి.

1946 సంవత్సరానికి కమ్యూనిస్టు పార్టీ రైతాంగానికి భూమి పంపకం చేసి, పోరాటానికి నాయకత్వం వహించింది. ఈ విధంగా బేతవోలు సమస్య నల్లగొండ జిల్లా విప్లవోద్యమంలో భాగ మయినది. రైతులు ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుండి 20 సంవత్సరాలకు వారి సమస్య పరిష్కారమైంది.

బేతవోలు రైతాంగ పోరాటం నల్లగొండ జిల్లాలోని తిరుమల గిరి, బమ్మెర గ్రామాల్లో, వరంగల్ జిల్లాలోని అమ్మపాలెం, వేంసూరు గ్రామాల్లో పట్టా హక్కుల కోసం రైతులు చేస్తున్న పోరాటాలకు బీజం వేసింది. 1920లో న్యాయపరమైన ప్రారంభమైన పోరాటాలు 1940లో ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజోద్యమం మొదలయ్యే వరకు కూడా కొనసాగినవి. ఈ ఘర్షణల కారణంగా హత్యాకాండలు జరిగే పరిస్థితి రావడంతో ప్రభుత్వం 'టెనెన్సీకమిటీ' ఏర్పాటుచేసి దాని ఆధారంగా 1940లో 'టెనెన్సీ యాక్ట్'ను తెచ్చింది. దీని ప్రకారం వరుసగా ఆరు సంవత్సరాలు భూమిని సాగు చేస్తున్న రైతులు ఎవరైనా సరే వారు సాగు చేస్తున్న భూములపై హక్కులు పొందినారు. 

బక్కవంతులగూడెం రైతుల పోరాటం

భోగాల వీరారెడ్డి అనే భూస్వామి బక్కవంతుల గూడెం రైతుల వద్ద నాగులపేరు, వడ్డీలపేర, లేవిగల్లా పేర, ఏదో ఒక మిషతో డబ్బు గుంజేవాడు. అవి చెల్లించలేని వారి పశువులను, ఒక్కొక్కప్పుడు భూములను కూడా స్వాధీన పరచుకొనేవాడు. ఇతనికి పోలీస్ పటేల్, మరియు మాలీపటేల్ సహకరించేవారు. తన దౌర్జన్యాలను ఎదిరించిన వారిపై గూండాల ద్వారా దాడి చేయించే వాడు. ఆ బాధలు తట్టుకోలేక ప్రజలందరూ ఏకమై ఇరిగేల లింగారెడ్డి, బలపునూరు బాపనయ్య నాయకత్వాన ఎదురు తిరిగినారు. ఆ నాయకులను రౌడీలు పోలీసు ఎంత హింసించినా వారు వెనుకడుగు వేయకుండా పోరాడారు. పోరాడి పోరాడి మూడు నాలుగు సంవత్సరాలకు వీరారెడ్డిని చంపి దోపిడీని అంతం చేశారు. 

సంబంధిత అంశాలు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం-1


Tags :   Telangana Armed Struggle       Peasant Revolution    

 Communist Party     Operation Polo    Mulkala Gudem  

 Freedom Movement     Peoples Democratic Party   

 Guerrilla warfare    Telangana History