గంగ-సింధు మైదానాలు

టెథిన్ సముద్రం ఉన్నచోట హిమాలయాలు ఏర్పడినప్పుడు లోతైన ఒక పెద్ద అఖాతం మిగిలిపోయింది. హిమాలయ నదుల ప్రవాహాల కారణంగా ఏర్పడిన ఒండ్రుమట్టితో ఈ అఖాతం క్రమేపీ పూడుకుపోయింది. ప్లీస్టోసీస్ కాలం నుంచి నిక్షేపితమైన సారవంతమైన ఒండ్రుమట్టితో ఇప్పుడు కనిపిస్తున్న ఈ విశాల మైదానాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమికి, హిమాలయాలకు మధ్య ఇవి నెలకొని ఉన్నవి. ప్రపంచంలో గల అతి పెద్ద మైదానాల్లో ఈ మైదానాలు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి.

ఈ మైదానాల్లోనే గంగ, సింధు నదులు ప్రవహిస్తున్నవి కాబట్టి వాటి పేరుమీదుగా గంగ-సింధు మైదానాలనే పేరు వచ్చింది. ఈ రెండు నదులు వాటి దిగువ భాగాల్లో ఒకటిగా కలిసిన తర్వాత ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, అతి సారవంతమైన డెల్టాను ఏర్పరచాయి. ఢిల్లీకి ఉత్తర దిశలో, యమునానది పశ్చిమ ఒడ్డు వెంబడి సింధు-గంగా మైదానాలను వేరు చేస్తూ సుమారు 278 మీటర్ల ఎత్తుగల ఒక చిన్న విభాజక క్షేత్రం కలదు.

సంబంధిత అంశాలు : హిమాలయాలు 

పడమర దిశలో రావి, సట్లెజ్ నదుల నుంచి; తూర్పున గంగానది డెల్టా చివరి వరకు సుమారు 2400 కి.మీ. పొడవు ఈ మైదానాలు భారతదేశంలో వ్యాపించి ఉన్నవి. ఈ మైదానాల వెడల్పు అస్సాంలో రాజమహల్ కొండల దగ్గర అతి తక్కువగా (90-100 కి.మీ.) ఉత్తరప్రదేశ్ అలహాబాద్ దగ్గర అత్యంత వెడల్పుగా (280 కి.మీ.) ఉన్నది. ఈ మైదానాల స్థలాకృతి వందల కిలోమీటర్ల పొడవున సుమారుగా ఒకేలాగా కనిపిస్తుంది. కానీ వీటి భూస్వరూపాల్లో మాత్రం కొన్నిచోట్ల చిన్నపాటి తేడాలు గమనించవచ్చు. ఈ మైదాన భూస్వరూపాల్లోనే భాబర్, టెరాయి, భంగర్, ఖాదర్ అనే ఉపరితల వ్యత్యాసాలు కలవు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని మైదానాల ఉత్తర సరిహద్దు వెంబడి 8 నుంచి 16 కి.మీ. వెడల్పున్న సన్నని మేఖలగా ఏర్పడి, గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని 'భాబర్' అని పిలుస్తారు. భాబర్ మండలం కింద అనేక చిన్న హిమాలయ నదులు ప్రవహిస్తూ, అవి తిరిగి భాబర్ నుంచి ఉపరితలానికి వచ్చి, ఎల్లప్పుడూ వెల్లువై ప్రవహించడం వల్ల ఆ ప్రాంతంలో 15-30 కి.మీ. వెడల్పుగా ఏర్పడిన చిత్తడి ప్రదేశాన్ని 'టెరాయి' అంటారు. ఈ ప్రదేశం మొత్తం అధిక చెమ్మతో, దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. టెరాయికి దక్షిణంగా ఒండలి నిక్షేపాలతో ఏర్పడిన వరద మైదానాల్లో పురాతన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానానికి 'భంగర్' అనీ, ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి మైదానానికి 'ఖాదర్' అని పేరు.

సంబంధిత అంశాలు : ఉనికి, క్షేత్రీయ అమరిక

ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లోని చవుడు, లవణీయ, స్పటికీయ భూభాగాలను 'రే' లేదా 'కల్లార్' అంటారు. ఇవి నిస్సార మృత్తికలతో కూడినవి ఉండి వ్యవసాయానికి అనుకూలత కలిగి ఉండవు. వరద మైదానాల్లోని ఒండ్రుమట్టి అతి సారవంతమైనవి ఉండి వ్యవసాయాభివృద్ధికి అనుకూలంగా ఉన్నవి. భారతదేశ బృహత్ మైదానాల్లో పంజాబ్-హర్యానా మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని గంగా మైదానాలు, అస్సాంలోని బ్రహ్మపుత్రలోయ మొదలైనవి కలవు.

పంజాబ్-హర్యానా మైదానాలు:

యమునా నది పశ్చిమ ఒడ్డున ప్రారంభమై, పడమరన పాకిస్థాన్ మైదానాల వరకు, దక్షిణాన రాజస్థాన్ మైదానాల వరకు 1.75 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మైదానాలను పంజాబ్-హర్యానా మైదానాలు అని పిలుస్తారు. వీటిలోనే రావి, బియాస్, సట్లెజ్ నదులు ప్రవహిస్తున్నాయి. 0.75 లక్షల చ.కి.మీ.విస్తీర్ణంలో ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న సమీప ప్రాంతాలు మరుస్థలి లేదా మార్వార్ రాజస్థాన్ మైదానాల్లో ఉన్నాయి. వీటిలో విశాలమైన ఇసుక దిబ్బలు కలవు. ఈ ఇసుక దిబ్బల్లో బహిర్గతమైన కొన్ని షిస్ట్, గ్రానైట్ శిలల ఆధారంగా ఈ ప్రాంతంలో కొంతభాగం ద్వీపకల్ప పీఠభూమికి, మరికొంత భాగం మైదానానికి చెందినదిగా ఉంటుంది. అదేవిధంగా లూనీ హరివాణంలో ఒండలి మైదానాలు కలవు.

ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని గంగా మైదానాల వైశాల్యం 3.75 లక్షల చ.కి.మీ. ఉంటుంది. ఈ మైదానాలు ఆగ్నేయంగా బంగాళాఖాతం వైపు వాలి ఉన్నాయి. వీటిలోనే గంగ మరియు దాని ఉపనదులు యమున, సోన్, ఘాఘ్ర, గండక్, కోసి మొదలైన నదులు ప్రవహిస్తున్నాంటాయి. ఎగువ గంగా మైదానం వాలు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రదేశంలో తరచుగా వరదలు సంభవిస్తాయి. ఉత్తరప్రదేశ్ మైదానాల్లో కొంతభాగం, బీహార్ మైదానాలు మొత్తం మధ్య గంగా మైదానంలోకి వస్తాయి. ఈ మైదానాల ఉపరితలం ఇంచుమించు సమతలంగా ఉంటుంది.

సంబంధిత అంశాలు:భారతదేశం-సరిహద్దు దేశాలు

పశ్చిమ బెంగాల్ మొత్తం దిగువ గంగామైదానంలోనే వ్యాపించి ఉంటుంది. బెంగాల్ మైదానాల్లోని అధిక భాగంలో గంగానది డెల్టా ఉంది. సముద్రాన్ని అనుకొని ఉన్న ఈ డెల్టా విశాలమైన మేఖలలో మడ అడవులు గలవు. వీటికే సుందర్బన్స్ (సుందర వనాలు) అని పేరు. అస్సాంలోని బ్రహ్మపుత్రలోయ సుమారుగా 0.56 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంను కలిగి ఉంటుంది. దీనికి పడమర వైపున తప్ప మిగిలిన అన్ని వైపులా పర్వతాలు గలవు. దీని ఉత్తర భాగంలో ఎక్కువగా టెరాయి, అర్థ టెరాయి పరిస్థితులు ఉండటంతో అక్కడ తేమ ఉన్న మృత్తికలు, దట్టమైన అడవులు వ్యాపితమై ఉన్నవి.