భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు. తూర్పు పశ్చిమాలుగా 2988 కిలోమీటర్లు విస్తరించి ఉంది. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ (బర్మా) మొదలైన ఏడు దేశాలతో భారత దేశానికి భూ సరిహద్దులు కలవు. భారతదేశ మొత్తం భూ సరిహద్దు 15,200 కి.మీ. భారతదేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్. అదే విధంగా అత్యంత పొడవైన భూసరిహద్దు కలిగి ఉన్న రెండవదేశం చైనా. ఇక ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దు కలిగి ఉన్నది. 

శ్రీలంకతో భారతదేశానికి సముద్రజలాలతో సరిహద్దు కలదు. భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ఉన్న జలసంధిని పాక్ జలసంధి అంటారు. భారతదేశానికి శ్రీలంకకు మధ్య మన్నార్ సింధుశాఖ(జలశాఖ) గలదు. అంతేకాకుండా ఈ రెండు దేశాల మధ్యన ఆడమ్స్ బ్రిడ్జి కూడా కలదు. 

భారతదేశ దక్షిణ చివర - ఇందిరా గాంధీ పాయింట్ కాగా ఉత్తరాన చివరి ప్రదేశం కిలిక్ దావన్ పాస్. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు మూడూ కన్యాకుమారి వద్ద కలుస్తాయి. భారతదేశానికి చైనాకు మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖకు మెక్మెహన్ రేఖ అని; భారత్, పాకిస్థాన్ల మధ్య ఉన్నఅంతర్జాతీయ సరిహద్దు రేఖకు రాడ్ క్లిఫ్ రేఖ అని, భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉన్న రేఖ డ్యూరాండ్ రేఖ అని పేర్లు కలవు.

భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు:

  • ఉత్తరప్రదేశ్ (8 రాష్ట్రాలు), అసోం (7 రాష్ట్రాలు), మహారాష్ట్ర (6 రాష్ట్రాలు), ఛత్తీస్గఢ్ (6 రాష్ట్రాలు).
  • తీరరేఖతోగాని, ఇతర దేశాలతో గాని సరిహద్దు లేని రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అవి: 1) హర్యానా 2) మధ్యప్రదేశ్ 3) ఛత్తీస్గఢ్ 4) జార్ఖండ్, 5) తెలంగాణ
  • విస్తీర్ణపరంగా చూస్తే దేశంలో కెల్లా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ (3,42,239 చ.కి.మీ.), చిన్న రాష్ట్రం - గోవా (3,702 చ.కి.మీ.).
  • జనాభాపరంగా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జనసంఖ్య పరంగా చిన్న రాష్ట్రం సిక్కిం.
  • భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. పశ్చిమ తీరంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలున్నాయి. తూర్పుతీరంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలున్నాయి.
  • పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్ (1058 కి.మీ.). తూర్పుతీరంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రమిదే.
  • దేశంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో (974 కి.మీ.) ఉంది. అతిచిన్న తీరరేఖ ఉన్న రాష్ట్రం గోవా.