భారతదేశ 32,87,283 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ప్రపంచంలో వైశాల్యం దృష్ట్యా ఏడో స్థానాన్ని కలిగి ఉన్నది. ప్రపంచ భూభాగంలో భారతదేశం 2.42 శాతం వైశాల్యాన్ని ఆక్రమిస్తోంది. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 29,73, 193 చ.కి.మీ. భూభాగాన్ని మరియు 3, 14,070 చ.కి.మీ. ల జల భాగాన్ని కలిగి ఉన్నది. భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 16.7 శాతంగా ఉన్నది. ఇది ప్రపంచ జనాభాలో రెండవ స్థానాన్నికలిగి ఉన్నది. భారతదేశానికి గల తీర రేఖ పొడవు 7,516. భారతదేశ భూ సరిహద్దు పొడవు 15,200 కి.మీ. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు. తూర్పు పశ్చిమాలుగా 2988 కిలోమీటర్లు విస్తరించి ఉంది. భారత దేశం మొత్తం ఏడు దేశాలతో భూ సరిహద్దులు కలిగి ఉంది. అవి: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ (బర్మా). భారతదేశ మొత్తం భూ సరిహద్దు పొడవు 15,200 కి.మీ. భారతదేశంలో అత్యంత పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్, రెండో దేశం చైనా. భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్. భారతదేశానికి సముద్రజలాలతో సరిహద్దు ఉన్న దేశం శ్రీలంక. భారతదేశ ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ల దూరం వరకూ విస్తరించి ఉన్నాయి. భారతదేశం ఒక 'ద్వీపకల్పం'. తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం సహజ సరిహద్దులుగా ఉన్నాయి.

ఉనికి

భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. భారతదేశం భూమధ్యరేఖకు ఉత్తరభాగంలో అంటే ఉత్తరార్ధ గోళంలో భౌగోళికంగా 8.4' నుంచి 37°.6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68°.7' నుంచి 97°.25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం అక్షాంశాల పరంగా 30° పొడవు, రేఖాంశాల పరంగా 30° వెడల్పుతో విస్తరించి ఉంది. 23½° కర్కటరేఖ భారతదేశం మధ్యగా పోతుంది. భారతదేశ దక్షిణాగ్ర కొన అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ లోని 6°.45' ఉత్తర అక్షాంశం వద్ద ఉంది. ఈ దక్షిణాగ్ర కొనకే పిగ్మీలియన్ పాయింట్, ఇందిరా పాయింట్ అని పేరు. భారతదేశ ఉత్తరాగ్ర కొన జమ్ము కాశ్మీర్ లో ఉంది. దీనికి ఇందిరా కోల్ అని పేరు. అదే విధంగా భారతదేశ అత్యంత తూర్పు భాగం అరుణాచల్ ప్రదేశ్ లోని దీఫాపాస్ కాగా, అత్యంత పశ్చిమ ప్రాంతం గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ (సర్ స్క్రీక్) ప్రాంతం.

భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం- మొత్తం 8 రాష్ట్రాల ద్వారా కర్కటక రేఖ పోతోంది. 82½° ల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. భారత ప్రామాణిక కాలాన్ని (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) ఈ రేఖాంశం ఆధారంగానే నిర్ణయిస్తారు. 82½° ల తూర్పు రేఖాంశం ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా పోతోంది. 6 ½° ల తూర్పు రేఖాంశం - అలహాబాద్, కాకినాడ సమీపం నుంచి వెళుతుంది. 

భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు- ఉత్తరప్రదేశ్ (8రాష్ట్రాలు), అసోం (7 రాష్ట్రాలు), మహారాష్ట్ర (6 రాష్ట్రాలు), ఛత్తీస్ గఢ్ (6 రాష్ట్రాలు). తీరరేఖతోగాని, ఇతర దేశాలతో గాని సరిహద్దు లేని రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలు  అవి- 1) హర్యానా 2) మధ్యప్రదేశ్ 3) ఛత్తీస్ గఢ్ 4) జార్ఖండ్, 5) తెలంగాణ. విస్తీర్ణపరంగా చూస్తే దేశంలో కెల్లా అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్, చిన్న రాష్ట్రం - గోవా. జనాభాపరంగా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, చిన్న రాష్ట్రం సిక్కిం. భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. పశ్చిమ తీరంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలున్నాయి. తూర్పుతీరంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ (1058 కి.మీ.). దేశంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో (974 కి.మీ.) ఉన్నది. తూర్పుతీరంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అతి తక్కువ తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రం గోవా.

ముఖ్యాంశాలు 

  • భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్న జలసంధి - పాక్ జలసంధి. 
  • భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్న జలశాఖ - మన్నార్ సింధుశాఖ. 
  •  ఆడమ్స్ బ్రిడ్జి కూడా భారతదేశానికి శ్రీలంకల మధ్యనే ఏర్పడి ఉంది. 
  • భారతదేశ దక్షిణ చివర - ఇందిరా పాయింట్. 
  • ఉత్తరాగ్రం - కిలిక్ దావన్ పాస్. 
  • హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు మూడూ కన్యాకుమారి ప్రాంతంలో కలుస్తాయి. 
  • భారతదేశానికి చైనాకు మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖను మెక్ మోహన్ రేఖ అంటారు. 
  • భారత్, పాకిస్థాన్‌కు మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖను రాడ్ క్లిఫ్ రేఖ అంటారు.