స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతదేశంలో మొదటి పబ్లిక్ సర్వీస్ కమీషన్ అక్టోబర్ 1, 1926న ఏర్పాటుచేశారు. అయినప్పటికీ, దాని పరిమిత సలహా విధులు ప్రజల ఆకాంక్షలను సంతృప్తి పరచడంలో విఫలమయ్యాయి అప్పట్లో మన జాతీయోద్యమ నాయకులు ఈ అంశంపై నిరంతరం ఒత్తిడి చేయడం వలన ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1935 కింద మొదటిసారిగా, ప్రాంతీయ స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. స్వాతంత్ర్యానంతరం జనవరి 26, 1950న, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా రాజ్యాంగ హోదాను పొంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమీషన్గా పేరు మార్చబడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 కేంద్ర మరియు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్లకు సంబంధించినది. UPSC ఒక రాజ్యాంగ సంస్థ.

UPSC నిర్మాణం 

భారత రాజయంగంలోని ఆర్టికల్ 316 UPSC సభ్యుల నియామకం మరియు పదవీకాలానికి సంబంధించినది. UPSCలో రాష్ట్రపతిచే నియమించబడిన ఒక ఛైర్మన్ మరియు ఇతర సభ్యులు కొలువుదీరి ఉంటారు. కమిషన్ నియమించబడిన సభ్యులలో సగం మంది కేంద్రప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం పదేళ్లపాటు ఏదైనా పదవిని నిర్వహించి ఉండి ఉండాలి.

అధ్యక్షుడు కమిషన్ సభ్యులలో ఒకరిని తాత్కాలిక ఛైర్మన్ గా నియమించవచ్చు. కమిషన్ చైర్మన్ పదవి ఖాళీ అయినపుడు లేదా కమీషన్ చైర్మన్ గైర్హాజరు అయిన సందర్భాల్లో లేదా మరే ఇతర కారణాల వల్ల తన కార్యాలయ విధులను నిర్వర్తించలేకపోతున్నపుడు, ఛైర్మన్ గా నియమితుడైన వ్యక్తి తిరిగి విధుల్లోకి చేరే వరకు లేదా ఛైర్మన్ తన విధులను తిరిగి ప్రారంభించే వరకు సదరు సభ్యుడు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.

ఛైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం:

కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులు ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఏది ముందయితే దాని ప్రకారం పదవీలో కొనసాగుతారు. సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించడం ద్వారా పదవీకాలం మధ్యలో రాజీనామా చేయవచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాన్ని అనుసరించి అవసరమనుకుంటే రాష్ట్రపతి కూడా వారిని తొలగించవచ్చు.

UPSC యొక్క విధులు :

  • అఖిల భారత సర్వీసులు, కేంద్ర సేవలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పబ్లిక్ సర్వీసెస్ ను కలిగి ఉన్న యూనియన్ సేవలకు నియామకాల కోసం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహించడం.
  • ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు అభ్యర్థించినట్లయితే, ప్రత్యేక అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏవైనా సేవల కోసం ఉమ్మడి నియామకాలను రూపొందించడంలో మరియు ఆపరేటింగ్ స్కీమ్లను రూపొందించడంలో UPSC రాష్ట్రాలకు సహకరిస్తుంది.
  • ప్రభుత్వం UPSC ని దిగువ తెలిపిన విషయాల కొరకు సంప్రదించవచ్చు :

  1.  సివిల్ సర్వీసెస్, సివిల్ పోస్టుల నియామకాల పద్ధతులకు సంబంధించిన అన్ని విషయాలు.
  2. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల నియామకాలు చేయడంలో, ఒక సర్వీసు నుండి మరొక సర్వీస్కి బదిలీలు, పదోన్నతులు చేయడం వంటి నియామకాలు, బదిలీలు మరియు పదోన్నతులకు అభ్యర్థుల అనుకూలతపై అనుసరించాల్సిన నియమాలు. 
  3. స్మారక చిహ్నాలు లేదా సంబంధిత విషయాలకు సంబంధించిన పిటిషన్లతో సహా పౌర హోదాలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వ్యక్తిని ప్రభావితం చేసే అన్ని క్రమశిక్షణా అంశాలు.
  4. ఒక పౌర సేవకుడు తన అధికారిక విధిని నిర్వర్తించడంలో చేసిన లేదా చేయాలనుకుంటున్న చర్యలకు సంబంధించి అతనికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన చట్టపరమైన చర్యలను సమర్థించడంలో అయ్యే ఖర్చుల విషయానికి చెందిన ఏదైనా దావాకు సంబంధించిన అంశాలు.
  5. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి కలిగిన అనుభవాలకు సంబంధించి, పెన్షన్ అవార్డుకు సంబంధించిన ఏదైనా క్లెయిమ్ మరియు అటువంటి అవార్డు మొత్తానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉత్పన్నమయినపుడు 
  6. సిబ్బంది నిర్వహణకు సంబంధించిన ఏదైనా విషయం రాష్ట్రపతి ద్వారా సూచించబడుతుంది. 

అయితే, కేంద్రప్రభుత్వ సేవలకు సంబంధించి UPSCకి పార్లమెంట్ అదనపు విధులను కేటాయించవచ్చు. ఇది ఏదైనా స్థానిక అధికారం లేదా చట్టం ద్వారా ఏర్పడిన ఇతర సంస్థ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ యొక్క సిబ్బంది వ్యవస్థను ఉంచడం ద్వారా UPSC యొక్క పనితీరును కూడా విస్తరించవచ్చు.

UPSC పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటు ఉభయ సభల ముందుంచుతారు, కమిషన్ సలహాను ఆమోదించని సందర్భాలను మరియు అలా ఆమోదించకపోవడానికి గల కారణాలను వివరిస్తూ ఒక మెమోరాండం కూడా అందజేయబడుతుంది.

UPSC పాత్ర విశ్లేషణ

UPSC కేంద్ర నియామక సంస్థ. ఉద్యోగ నియామకాలలో యోగ్యతాను సారం నియామకాలు చేపట్టడం. ఉద్యోగాలలో సరైన అభ్యర్థులను ఎంపికచేయడం దీని ముఖ్య బాధ్యత. ఇందుకు గాను UPSC ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. గ్రూప్ -ఎ మరియు గ్రూప్- బి విభాగాలలో ఆల్-ఇండియా సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు చెందిన ఉద్యోగాలకు సంబంధించిన సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి సిఫార్సును పంపుతుంది. సాధారణంగా UPSC ప్రభుత్వానికి సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి కట్టుబడి ఉండదు. ఒకవేళ కమిషన్ సలహాను ప్రభుత్వం తిరస్కరించిన పక్షంలో, ప్రభుత్వం పార్లమెంటుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

UPSC కేవలం పరీక్షా ప్రక్రియకు సంబంధించి, సేవల వర్గీకరణ, కేడర్ నిర్వహణ, శిక్షణ, సేవా పరిస్థితులు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగానికి సంబంధించి పలు విధులు కూడా నిర్వహిస్తుంది. పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు తదితర అంశాల కొరకు కేంద్ర ప్రభుత్వం UPSCని సంప్రదిస్తుంది.