భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 165, రాష్ట్ర అడ్వకేట్ జనరల్(Advocate General) గురించి తెలియచేస్తుంది. అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో అత్యున్నత న్యాయ అధికారి. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరమైన విషయాలన్నింటిలో సహాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించడం ఇతని విధి. రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ కార్యాలయం భారత అటార్నీ జనరల్ కార్యాలయానికి అనుగుణంగా ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ అడ్వకేట్ జనరల్ ను నియమిస్తాడు. 

నియామకం మరియు పదవీకాలం

  • అడ్వకేట్ జనరల్ గా నియమితుడయ్యే వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
  • పదేళ్లపాటు ఏదైనా న్యాయస్థానంలో లేదా పదేళ్లపాటు హైకోర్టులో న్యాయవాదిగా ఉండాలి.
  • స్థూలంగా చెప్పాలంటే అడ్వకేట్ జనరల్ పదవిలో నియమించబడే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి తగిన అర్హతలన్నీ కలిగి ఉండాలి.
  • రాజ్యాంగం అడ్వకేట్ జనరల్ కు ప్రత్యేకంగా నిర్ణీత పదవీకాలాన్ని నిర్ణయించలేదు. కాబట్టి, సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఇష్టానుసారం అడ్వకేట్ జనరల్ పదవిలో కొనసాగుతారు.
  • గవర్నర్ అడ్వకేట్ జనరల్ ను ఎప్పుడైనా తొలగించవచ్చు. అడ్వకేట్ జనరల్ తొలగింపునకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ప్రక్రియ ప్రత్యేకంగా పేర్కొనబడలేదు.
  • గవర్నర్ నిర్ణయించిన వేతనాన్ని అడ్వకేట్ జనరల్ పొందుతాడు. రాజ్యాంగంలో అడ్వకేట్ జనరల్ యొక్క వేతనాన్ని నిర్ణయించలేదు.

విధులు

  • గవర్నర్ తనకు సూచించిన లేదా కేటాయించిన చట్టపరమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలను ఇవ్వడం
  • గవర్నర్ చేత సూచించబడిన లేదా కేటాయించబడిన చట్టపరమైన పాత్ర యొక్క ఇతర విధులను నిర్వర్తించడం 
  • రాజ్యాంగం లేదా మరేదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం అతనికి సంబంధించిన ఇతర విధులను నిర్వర్తించడం 

అధికారాలు

  • తన అధికారిక విధుల నిర్వహణలో, రాష్ట్రంలోని ఏ కోర్టులోనైనా హాజరయ్యే అధికారాన్ని / హక్కును కలిగి ఉంటాడు.
  • రాష్ట్ర శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనే హక్కును కలిగి ఉంటాడు కానీ శాసనసభలో ఏదైనా అంశంపై జరుగుతున్న ఓటింగ్లో పాల్గొనే అవకాశం మాత్రం ఉండదు.
  • రాష్ట్ర శాసనసభలోని ఏదైనా కమిటీ సమావేశంలో ప్రసంగించే లేదా పాల్గొనే హక్కును కలిగి ఉంటాడు కానీ ఓటింగ్లో పాల్గొనే అవకాశం మాత్రం ఉండదు.
  • రాష్ట్ర శాసనసభ సభ్యునికి అందుబాటులో ఉండే అన్ని రకాల అధికారాలు, మినహాయింపు అడ్వకేట్ జనరల్కి వర్తిస్తాయి.