కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా

రాజ్యాంగములోని 148-161 ప్రకరణలు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా పదవి వివరాలను, అధికార బాధ్యతలను వివరిస్తాయి. రాజ్యాంగ ప్రకరణ 148 ప్రకారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రపతిచే నియమింపబడతాడు. రాష్ట్రపతిచే ఇతడు నియమింపబడినప్పటికి ఇతర అధికారులవలె రాష్ట్రపతి ఇష్టముపై ఇతని పదవీ కాలము ఆధారపడి ఉండదు. ఇతని పదవీ కాలము 6 సంవత్సరములు. అయితే 65 సంవత్సరముల వయస్సు నిండినచో పదవీకాలముతో నిమిత్తము లేకుండా పదవీ విరమణ చేయాలి. ఇతడు తన పదవికి రాజీనామా చేయదల్చినచో రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఇతనిని ఇతర అధికారులవలె తొలగింపలేదు. ఇతనిని తొలగింపవలెనన్న పార్లమెంటులో అభిశంశన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఇతని తొలగింపు అభిశంశన తీర్మానంద్వారా అసమర్థత, అమర్యాద ప్రవర్తన ఆధారంగా పార్లమెంటుచే జరుగుతుంది. ఇతని తొలగింపు విధానము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానాన్ని పోలి ఉంటుంది. అనగా పార్లమెంటులోని ఉభయసభలు 2/3వ వంతు మెజారిటీతో ఇతనిని తొలగించవలెనని నిర్ణయించిన పక్షంలో ఇతనిని రాష్ట్రపతి తొలగిస్తాడు. ఇతని పదవీకాలములో జీతభత్యములను ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తప్ప తగ్గించుటకు వీలులేదు. ఇతని జీతభత్యాలు భారతీయ సంఘటితనిధినుండి చెల్లించబడతాయి. పదవీ విరమణానంతరము కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద ఏ ఉద్యోగానికి అర్హుడుకాదు.

విధులు :

కాగ్ విధులను గూర్చి 149, 150, 151 ప్రకరణలు వివరిస్తాయి. 149 ప్రకరణననుసరించి ఈయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఇతర ఏవైనా అధికార సంస్థల ఆదాయ వ్యయ పట్టికలను తనిఖీ చేస్తాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇపోషియేషన్ పట్టికలను సిద్ధంచేయుట, భారత సంఘటిత నిధినుండి, రాష్ట్ర సంఘటిత నిధుల నుండి జరిగిన వ్యయాన్ని ఆడిట్ చేయుట, ఈయన ఇతర విధులు. ఇంతేకాకుండా ఇతడు ప్రభుత్వఖాతాల సంఘానికి సహాయసహకారాలు అందిస్తాడు. దానికి మార్గదర్శకుడు, స్నేహితుడుగా వ్యవహరిస్తాడు. ఇతడు ప్రజాధన సంరక్షుడిగా పేరు పొందాడు. 

అటార్ని జనరల్

భారత రాజ్యాంగంలోని 76వ ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి, అటార్నీ జనరల్ ను నియమిస్తాడు. అటార్నీ జనరల్ భారత ప్రభుత్వ మొదటి న్యాయాధికారి. ఇతడు రాష్ట్రపతి ఇష్టమున్నంత వరకు తన పదవిలో కొనసాగుతాడు. అటార్నీ జనరల్ గా నియమింపబడే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలను కలిగి ఉండాలి. ఈయన జీతము రాష్ట్రపతి నిర్ణయించినట్లుగా ఉంటుంది.

అటార్నీ జనరల్‌కు భారతదేశంలో అన్ని న్యాయస్థానాలలో వాదించే హక్కు ఉంటుంది. ఈయనకు భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసగించే అధికారయు కూడా కలదు. పార్లమెంటు సభ్యులు పొందే హక్కులు, రక్షణలు ఇతనికి కూడా ఉంటాయి. అయితే పార్లమెంటులో ఓటువేసే హక్కు ఇతనికి ఉండదు,

76 వ ప్రకరణననుసరించి అటార్నీ జనరల్ పలు ముఖ్యమైన విధులను నిర్వహిస్తాడు. భారత ప్రభుత్వానికి సంబంధించి అన్ని న్యాయపరమైన విషయాలపై సలహాలిచ్చుట, రాష్ట్రపతి ప్రత్యేకముగా ఈయనకు పంపిన అంశాలపై అభిప్రాయాలను తెలియజేయుట, శాసనము ద్వారా నిర్దేశింపబడ్డ ఇతర ఏ బాధ్యతనైనా నిర్వర్తించుట మొదలైనవి. ఈ విధులను నిర్వహించుటలో భారతదేశములోని ఏ కోర్టులోనైనా వాదించవచ్చు.