రాజ్యాంగంలోని 214 నుండి 287 ప్రకరణలు హైకోర్టును గూర్చి తెలుపుతాయి. 

నిర్మాణము:

భారత రాజ్యాంగము ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. కొన్ని పరిస్థితులలో ఒకే హైకోర్టును రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు, మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలాగా పార్లమెంటు శాసనము ద్వారా చేయగలదు. పంజాబు, హర్యానా రాష్ట్రాలకు హైకోర్టు ఒక్కటే. అదేవిధంగా అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు హైకోర్టు ఒక్కటే. బొంబాయి హైకోర్టు పరిధి మహారాష్ట్ర, గోవా, దాద్రా మరియు నాగరహవేలీ, డామన్ మరియు డయ్యూలకు కూడా వర్తిస్తుంది. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కేరళ హైకోర్టు పరిధిలోనికి వస్తుంది. ప్రతి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి కొందరు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భారత రాజ్యాంగం న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి కల్పించింది. హైకోర్టుపై పని భారము ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలిక న్యాయమూర్తులు రాష్ట్రపతిచే నియమింపబడి రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారు. ఎవరైనా న్యాయమూర్తి అస్వస్థులై (ప్రధాన న్యాయమూర్తి తప్పు) తమ బాధ్యతలను నిర్వహించలేకపోయిన పక్షంలో రాష్ట్రపతి ఆపద్దర్మ న్యాయమూర్తులను నియమించగలడు.

నియామకము

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే నియమితుడౌతాడు. ఈ సందర్భంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నరును సంప్రదిస్తాడు. హైకోర్టులో న్యాయమూర్తిని నియమించేటప్పుడు కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, గవర్నరును, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు,

అర్హతలు

హైకోర్టులో న్యాయమూర్తిగా నియమింపబడే వ్యక్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి. 1. భారతీయ పౌరుడై ఉండవలెను. 2 భారతదేశములో కనీసం 10 సంవత్సరములు న్యాయాధి పతిగా అనుభవం కలిగి ఉండవలెను. లేదా రాష్ట్ర హైకోర్టులో కనీసం 10 సంవత్సరములు న్యాయవాదిగా పనిచేసి ఉండవలెను. రాజ్యాంగము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విషయములో ప్రత్యేక అర్హతలేమి ప్రకటించలేదు. అంతేగాకుండా రాజ్యాంగంలోని 222వ ప్రకరణను అనుసరించి రాష్ట్రపతికి హైకోర్టు న్యామూర్తులను బదిలీ చేసే అధికారము గలదు. అయితే ఈ సందర్భంలో ఆయన ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవలెను.

హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు 62 సంవత్సరములు. పదవీ విరమణ చేసిన తరువాత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా తప్ప వేరే ఆదాయమునిచ్చే ప్రభుత్వ ఉద్యోగములను నిర్వహించరాదు. న్యాయమూర్తులు పలు సందర్భాల్లో పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. రాజీనామా చేయుట ద్వారా, అభిశంసన తీర్మానమును పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినప్పుడు రాష్ట్రపతి ఇతనిని తొలగిస్తాడు.

జీతభత్యాలు 

ప్రధాన న్యాయమూర్తికి రూ.2,50,000 ఇతర న్యాయమూర్తులకు 2,25,000 రూపాయల నెలసరి వేతనంగా చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తప్ప వీరి జీతభత్యాలను తగ్గించుటకు వీలులేదు.

హైకోర్టుకు గల స్వతంత్రత:

రాజ్యాంగం సుప్రీంకోర్టు ఏవిధంగా స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలు కల్పించిందో, అదే విధముగా రాష్ట్ర హైకోర్టుకు కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసికొన్నది. న్యాయాధిపతుల జీత భత్యములను ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తప్ప తగ్గించుటకు వీలులేదు మరియు వీరి జీత భత్యాలు భారత సంఘటిత నిధి నుండిగ్రహింపబడతాయి. హైకోర్టు న్యాయమూర్తులను అభిశంశన ద్వారా తప్ప తొలగించలేరు. అభిశంసన తీర్మానమును అవినీతి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించుట అను అంశాలపై మాత్రమే ప్రవేశపెడతారు. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా తప్ప భారత ప్రభుత్వములో ఆదాయాన్నిచ్చే ఇతర ఏ ఉద్యోగము చేయరాదు. న్యాయాధిపతుల తీర్పులలోని మంచి చెడులను, వారి వ్యక్తిత్వమును శాసనసభలో చర్చించుటకు వీలులేదు. అయితే ఒక్క అభిశంశన తీర్మానముపై చర్చ జరుగుతున్నప్పుడు మాత్రము వారి నడవడిని గూర్చి చర్చ జరుపవచ్చును.

హైకోర్టుపై కేంద్ర ప్రభుత్వము యొక్క అదుపు 

కేంద్ర ప్రభుత్వం హైకోర్టును పలు విషయాలలో అదుపు చేసే అధికారం కలిగి ఉంటుంది. రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రపతికి వ్యాయమూర్తులను ఒక హైకోర్టు నుండి వేరొక హైకోర్టుకు బదిలీచేసే అధికారము గలదు. అంతేగాక హైకోర్టు న్యాయాధిపతిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమించే అధికారము రాష్ట్రపతికి గలదు. ఒక రాష్ట్రములో హైకోర్టును ఏర్పాటు చేయుటకు పార్లమెంటు శాసనము చేయగలదు. మరియు రెండు లేదా అంతకన్న ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉందునట్లుగా చేయగలదు. అంతేగాక హైకోర్టు బెంచిని అదే రాష్ట్రములోని వేరొక నగరములో ఏర్పాటుచేయుటకు హైకోర్టు యొక్క అధికార పరిధిని పెంచుటకు పార్లమెంటుకు అధికారము తిన్నది. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలములో హైకోర్టు న్యాయాధిపతుల జీత భత్యములు తగ్గించు అధికారము పార్లమెంటుకు గలదు. సాధారణ సమయములో న్యాయాధిపతుల జీతాలను పెంచగల అధికారము పార్లమెంటుకు కలదు. నిర్ణయాలను సుప్రీంకోర్టుకు అప్పీలు చేసే వీలు కలదు. హైకోర్టులు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను, నిర్ణయాలను తప్పక పాటించాలి. 

హైకోర్టు అధికారాలు: 

నిజ అధికార పరిధి

హైకోర్టుకు అనేక అంశాలకు సంబంధించి నిజ అధికార పరిధికలదు. విదేశ సంబంధ విషయాలు, రెవిన్యూ విషయాలు, కోర్టు ధిక్కారణ, ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించుట మొదలైనవి. రాజ్యాంగ వివరణ సంబంధ విషయాలు ఏవైనా క్రింది కోర్టులో చర్చింపబడుతూ ఉంటే వీటిని తాను బదిలీ చేసికోనే అధికారము కూడా నిజ అధికార పరిధి లోనికి వస్తుంది.

అప్పీళ్ళ విచారణాధికార పరిధి

ఏరాష్ట్రములోనైనను హైకోర్టు అప్పీళ్లలను స్వీకరించే అత్యున్నత న్యాయ స్థానము. క్రింది కోర్సులు సివిల్ కేసులలో, క్రిమినల్ కేసులలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఆ కేసులు హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చును. సివిల్ కేసులలో 5000 రూపాయలు పైబడిన కేసులను మాత్రమే హైకోర్టు అప్పీళ్ళుగా స్వీకరిస్తుంది. అంతేగాక వారసత్వము, ఆక్రమణ మొదలైన విషయాల్లో కూడా అప్పీళ్ళను స్వీకరిస్తుంది. క్రిమినల్ కేసులో క్రింది కోర్టు మరణ శిక్ష విధించినపుడు లేదా 7 సంవత్సరములకు మించి జైలు శిక్ష విధించినప్పుడు అప్పీళ్ళను స్వీకరిస్తుంది.

క్రింది కోర్టులపై అజమాయిషీ

భారత రాజ్యాంగంలోని 227 వ ప్రకరణను అనుసరించి క్రింది కోర్టులపై హైకోర్టు నియంతగాధికారము కలిగి ఉంటుంది. ఈ అధికారము హైకోర్టునకు మాత్రమే ప్రత్యేకమైనది. మరియు ఈ అధికారము రాష్ట్రములోని అన్ని కోర్టులపై (మిలటరీ ట్రిబునల్ తప్ప అన్ని ట్రిబునళ్ళపై అజమాయిషి కలిగి అతి విస్తృతమైనదిగా పరిగణింపబడుతోంది. 228వ ప్రకరణ అనుసరించి దిగువ స్థాయి కోర్టులలోని కేసులను హైకోర్టు తనకు బదిలీ చేసికొనే అధికారము కలిగి ఉంటుంది. అలాగే క్రింది కోర్టులలో ఏదైనా కేసులో రాజ్యాంగ వివరణ సంబంధ విషయాలు చర్చించబడుతున్నాయని భావించినప్పుడు ఆ కేసులను తనకు బదిలీ చేసుకోనే అధికారము కూడా కలదు. అయితే 323 ప్రకరణ క్రింద ఏర్పాటైన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబునల్స్, హైకోర్టు యొక్క ఈ అధికార పరిధి క్రిందకు రావని పేర్కొనబడింది. ఈ విధంగా రాజ్యాంగం దిగువ కోర్టులకు రాజ్యాంగ పరమైన విషయాలు చర్చించే అధికారము లేకుండా చేసింది. మరియు ఆ అధికారమును రాష్ట్రములో హైకోర్టులు మాత్రమే కలిగి ఉండేటట్లుగా నిర్ణయించింది.

సంబంధిత అంశాలు : సుప్రీంకోర్టు

రిట్లు జారీచేయు అధికారము 

రాజ్యాంగంలోని 226 వ ప్రకరణ క్రింద రిట్లు చేసే అధికారం హైకోర్టులకు సంక్రమిస్తుంది. కనుక దీనిని ఉమ్మడి అధికార పరిధిలోనిదిగా భావించవచ్చును. ఈ అధికారము క్రింద తన ప్రాదేశిక పరిధిలోని ఏ వ్యక్తి లేదా అధికార సంస్థనైన ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు, అతడు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు రిట్లు జారీ చేసే అధికారమును కలిగి ఉంది. ఈ రిట్లు సుప్రీంకోర్టు వలెనే హైకోర్టుకు కూడా ఐదు రకాల రిట్టు జారీచేసే అధికారం కలిగి ఉన్నది. 1. హెబియస్ కార్పస్ 2. మాండమస్ 3. ప్రొహిబిషన్ 4. కోవారెంటో 5, సెర్షియరారి మొదలైనవి.

రాజ్యాంగ పరంగా హైకోర్టు రెండు విషయాలలో రెట్లు జారీచేయు అధికారము పొంది ఉంది. 1. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు 2 ఏదైనా ఇతర ప్రయోజనమునకు. ఈ రెండవ విషయమును హైకోర్టు అధికార పరిధిలో చేరుటచే దీని అధికారములు మరింత విస్తృతమయ్యాయి. ఇతర ఏదైనా ప్రయోజనమునకు కూడా ఉపయోగించవచ్చును. ఏదేని న్యాయ హక్కు విషయములో హైకోర్టు రిట్లు జారీ చేయ్యాలని భావిస్తే ఆ విధంగా చేయుటకు హైకోర్టుకు అధికారము కలదు. 42వ రాజ్యంగ సవరణ ద్వారా హైకోర్టుకుగల ఈ ప్రత్యేక అధికారాన్ని తొలగించారు. మరల 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని మరల పునరుద్ధరించారు.

కోర్టు ఆఫ్ రికార్డు:

215 రాజ్యాంగ ప్రకరణను అనుసరించి హైకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డుగా గుర్తించబడింది. దీని యొక్క ప్రాదేశిక పరిధిలోగల అన్ని కోర్టులకు, ప్రభుత్వ సంస్థలకు, వ్యక్తులకు దీని యొక్క తీర్పులు శిరోధార్యములు అయితే తను ఇచ్చిన తీర్పులను తాను పునఃపరిశీలించే అధికారము హైకోర్టు కలిగి ఉంది. మరియు దీనికి కోర్టు ధిక్కారలకు పాల్పడిన వారిని శిక్షించే అధికారము కూడా కలదు,

న్యాయ సమీక్షాధికారము

హైకోర్టుకు సుప్రీంకోర్టు వలెనే న్యాయ సమీక్షాధికరము కలదు. శాసనసభ చేసిన చట్టము, కార్యవర్గముచే చేయబడిన ఒక కార్యక్రమము రాజ్యాంగ సూత్రములకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి ఒక వేళ అవి రాజ్యాంగ విరుద్ధము లైనచో వాటిని కొట్టి వేసే అధికారమును హైకోర్టులు కలిగి ఉన్నాయి.