శాతవాహనుల అనంతరం తెలంగాణను పాలించిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ/ముదిగొండ చాళుక్యులు శాతవాహన చక్రవర్తుల్లా సువిశాల రాజ్యాన్ని పాలించక పోయినప్పటికీ విభిన్నమైన పాలకుల వల్ల వైవిధ్యభరితమైన సమ్మిళితమైన సంస్కృతి ఏర్పడింది. శాతవాహనానంతర కాలం నాటికి సమాజంలో వర్ణ వ్యవస్థ బలపడింది. సమాజంలో బ్రాహ్మణులు ఉన్నత స్థానంలో ఉన్నారు. పాలకులతో గౌరవ సత్కారాలు, పన్నులేని అగ్రహారాలను విరాళంగా పొందేవారు. విదేశీయులైన శకులు కూడా వైదిక సంప్రదాయ సహిత సమాజంలో భాగమయ్యారు. సమాజంలో శాతవాహనుల కాలం నాటి వృత్తిపరమైన విభజన కాకుండా కులం ప్రాబల్యం పెరగడం ప్రారంభమైనది. విష్ణుకుండినులు, చాళుక్యులు క్షత్రియులు కాకపోయినప్పటికీ బ్రాహ్మణ సాంకర్యంతో తమ వైభవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. నాటి సమాజంపై బౌద్ధమత ప్రభావం వల్ల నిమ్నవర్ణాల వారు ఏకమయ్యారు. బ్రాహ్మణులు వేదాలు, శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించి పురోహితులుగానే కాకుండా పాలన విభాగంలోనూ ముఖ్యమైన పదవులను అలంకరించారు. చంద్రశ్రేష్ఠలు - వర్తక సంఘాలుగా, వడ్డేపనివారు - శిల్పకారులుగా సమాజంలో గుర్తింపు పొందారు. 

Must Read : 

తెలంగాణ సమాజం

తెలంగాణ సమాజం -  కాకతీయుల కాలం

తెలంగాణ సమాజం - కుతుబ్ షాహీల కాలం

ఇక్ష్వాకుల కాలంలో సమాజం

స్త్రీలకు గల స్థానం 

శాతవాహనానంతర కాలంలో సమాజంలో స్త్రీలకు సముచిత స్థానం ఉండేది. శాతవాహనుల కాలంలో మాదిరిగానే స్త్రీలు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించారు. ఇక్ష్వాక వంశ పాలకులు కూడా మాతృ సంజ్ఞలను ధరించడం వలన స్త్రీలకు సముచిత స్థానం కలదని తెలుస్తున్నది. అంతఃపుర స్త్రీలు సైతం బౌద్ధ, జైన మత గురువులకు విరివిగా విరాళాలిచ్చేవారు. అప్పటి సమాజంలో మేనరిక వివాహాలు ఆచారంలో ఉండేవి. సమాజంలో బహుభార్యత్వం కూడా ఉండేది. వేశ్యలు ప్రతిష్ఠ, అంతస్తుకు చిహ్నమయ్యారు. కుల, దేశాంతర వివాహాలు ఉండేవి. 

వర్ణ వ్యవస్థ 

క్రీ.శ. 13వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రాహ్మణులు, క్షత్రియుల ఆధిపత్యం, ప్రాభవం క్రమంగా తగ్గిపోసాగింది. కమ్మ, వెలమ, రెడ్డి లాంటి వ్యవసాయదారుల కులాలు ఆవిర్భవించాయి. వర్తక, వ్యాపారాలు నిర్వహించే వైశ్యేతర కులస్థులు కూడా తమ పేర్ల చివర 'సెట్టి', ‘కోమటి' అనే మాటలను చేర్చుకున్నారు. ఆ నాటి సమాజంలో అత్యధిక సంఖ్యాకులైన శూద్రులు సైన్యంలో ఎక్కువగా చేరారు. శూద్రులు ఒక వర్గంగా కాకుండా చేసే వృత్తిని బట్టి వివిధ శాఖలుగా ఏర్పడ్డారు. కొందరు శూద్రులు బ్రాహ్మణులతో సమానంగా రాణించడానికి ప్రయత్నించారు. సమాజంలో వర్ణవ్యవస్థ, వర్గ విభజన ఉన్నప్పటికీ ప్రజలు సామరస్య పూర్వకంగా జీవనం సాగించడం ఈ శాతవాహనానంతర యుగ కాలం నాటి విశిష్టతగా చెపవచ్చును. 

చాళుక్యుల కాలంలో సమాజం 

చాళుక్యుల కాలంలో వర్ణవ్యవస్థ స్థిర రూపాన్ని పొందడం వల్ల సంఘంలో కట్టుబాట్లు సడలలేదు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో పాటు రాజుల దగ్గర ముఖ్య ఉద్యోగాల్లో ఉండేవారు. క్షత్రియులు రాజధర్మాన్ని నిర్వహించేవారు. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. వైశ్యులు జైనాన్ని బాగా ఆదరించారు. శూద్రులు వ్యవసాయాది వృత్తులు చేసేవారు. విశ్వకర్మ కులస్థులకు శిల్పకారులుగా, రాజశాసనాలను చెక్కేవారిగా సమాజంలో విశేష గౌరవాదరణలు ఉండేవి. వీరు మొదట జైన మతస్థులు. వీరికి బాల్య వివాహాలు, అంజనం వేయించడం లాంటి మూఢ విశ్వాసాలుండేవి.