కాకతీయుల కాలంనాటి సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. సమాజంలో చేసే వృత్తి, నివసించే ప్రాంతాన్ని బట్టి అనేక కులాలు, ఉపకులాలు విస్తృతంగా ఉండేవి. ఈ కాలంనాటి శాసనాలు, సాహిత్యాధారాల ఆధారంగా సమాజంలో ఉండే కులాల గురించి తెలుస్తున్నది. 

ప్రతి కులానికి, ఉపకులానికి ఉండే వృత్తి సంఘాల 'సమయాలు' అని పిలిచేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, సాలెలు, తెలికులు (నూనె వ్యాపారులు), తమ్మడ్లు (వ్యవసాయం), గొల్లవారు (పశుపోషణ), ఈదులవారు (గీత కార్మికులు), మంగలి, కుమ్మరి, మేదరి, వెలమ, కరణం (భూముల లెక్కలు), రెడ్లు (వ్యవసాయం), ఉప్పరి (మట్టి పని), మచరాసి (బెస్త, చేపలు పట్టడం), మేర, పెరిక (వ్యవసాయం, వాణిజ్యం), ఎరుకలి (బుట్టలు అల్లడం), కాసె (రాళ్లు కొట్టడం) మొదలైన కులాలు, ఉపకులాలు ప్రధానంగా ఉండేవి. 

Must Read : 

తెలంగాణ సమాజం

తెలంగాణ సమాజం - శాతవాహనానంతర కాలం

తెలంగాణ సమాజం - కుతుబ్ షాహీల కాలం


'ప్రతాప చరిత్ర'లో కాకతీయుల రాజధాని నగరమైన ఓరుగల్లు నగర జీవితం గురించి, వివిధ వృత్తుల గురించి ప్రత్యేకమైన ప్రస్తావన కలదు. బ్రాహ్మణులు, మంత్రులు, యోధులు, వైశ్యులు, పద్మనాయకులు (వెలమ), విశ్వకర్మలు, కాపులు, ఎడిగలు (గీత కార్మికులు), కుంభకరులు (కుమ్మరులు), పట్టుసాలెలు (పట్టునేతవారు), పద్మసాలె (నేత కార్మికులు), మేదరులు, బెస్తలు, రజకులు, వేశ్యలు, పూటకూళ్లవారు ఓరుగల్లు నగర జీవన సంస్కృతిలో ఒక భాగంగా ఉండేవారు. 

బ్రాహ్మణ కులస్థుల్లోనూ వైదికులు (వేదశాస్త్రాల అధ్యయనం, పౌరోహిత్యం), నియోగులు (రాజాశ్రయంలో ఉద్యోగాలు, పదవులు) అనే శాఖలు ఏర్పడ్డాయి. వైదికుల్లో కూడా వారు అధ్యయనం చేసిన వేదశాఖను బట్టి రుగ్వేదులు, శుక్ల యజుర్వేదులు, కృష్ణ యజుర్వేదులు అనే విభాగాలు ఏర్పడ్డాయి. ప్రాంతాన్ని బట్టి వారు అనుసరించే కులాల్లోనూ ఉపకులాలు ఏర్పడ్డాయి. వేంగినాటి, పాకనాటి, వెలనాటి, తెలంగాణ బ్రాహ్మణులుగా వ్యవహారంలోకి వచ్చారు. 

ఈ కాలంలో బ్రాహ్మణులకు, దేవాలయాలకు పన్ను మినహాయింపుతో కూడిన భూములను దానం చేయడం విస్తృతమైంది. దీంతో వీటి వివరాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయడం, భద్రపరిచి పర్యవేక్షణ చేయడానికి ఉద్యోగుల ఆవశ్యకత ఏర్పడింది. కాయస్థ, కరణం, కరణిక, లేఖిక, ధర్మలేఖిక మొదలైన ఉద్యోగులకు ఈ బాధ్యతల్ని అప్పగించడంతో వీరు 'కాయస్థ' అనే ఉపకులంగా ఆవిర్భవించారు. దీంతో రాజాస్థానాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసినట్లయింది. కాకతీయ ప్రభువులకు 'కాయస్థులు' మంత్రులుగా కూడా పనిచేశారు. వర్ణవ్యవస్థలో అట్టడుగున ఉన్న శూద్రుల పరిస్థితి మెరుగవడం ఈ కాలం నాటి ప్రధాన సామాజిక పరిణామం. వీరిని వ్యవసాయదారులుగా పరిగణించారు. రెడ్లు, వెలమలు, కమ్మలు రాజాస్థానాల్లో ఉన్నతోద్యోగాల్లో నియమితులయ్యారు. ఈ వైశ్యుల స్థాయి తగ్గడంతో వారిని శూద్రులతో సమానంగా పరిగణించారు. 

సమాజంలో మత ఉద్యమాలు 

కాకతీయుల కాలంనాటి తెలంగాణ సమాజంలో వీరశైవం, శ్రీవైష్ణవ ఉద్యమాల ప్రభావం కూడా గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. వీరశైవం సమాజంలోని బ్రాహ్మణ వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. కుల వ్యవస్థను వీరశైవం నిరసించింది. సనాతన సంప్రదాయాలను వ్యతిరేకించింది. బాల్యవివాహాలు, వైధవ్యం లాంటి సాంఘిక దురాచారాలను కూడా వీరశైవం నిరసించింది. ప్రధానంగా కమ్మరులు, చర్మకారులు, సాలెవారు మొదలైన కులాల వారు వీరశైవంలో చేరి సంస్కరణలకు కారణమయ్యారు. రామానుజాచార్యులు ప్రచారం చేసిన శ్రీవైష్ణవం మానవులంతా ఒక్కటేనని, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కృషిచేసి వారికి దేవాలయ ప్రవేశాన్ని కల్పించింది. పల్నాడులో బ్రహ్మనాయుడు 'చాపకూడు' పేరుతో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు. 

తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణేతరులైన  రామానుజాచార్యుల అనుచరులను సాతానులని, దాసరులని పిలుస్తున్నారు. ఆ నాటి సమాజాన్ని బాల్యవివాహాలు, సతీసహగమనం, దేవదాసీ, బహుభార్యత్వం, కన్యాశుల్కం, వేశ్యావ్యవస్థ లాంటి సామాజిక దురాచారాలు పట్టిపీడించాయి. దేవాలయాల్లో జీవనం గడుపుతూ తమ ఆట, పాటలతో రంజింపచేయడం దేవదాసీల వృత్తిగా ఉండేది. ఉన్నత, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో బహుభార్యత్వం ఉండేది. 

స్త్రీల స్థానం 

కాకతీయుల కాలంలో రాచరికంలో స్త్రీలకు సముచితమైన గౌరవ, మర్యాదలు కల్పించేవారు. దక్షిణ భారత చరిత్రలోనే మొదటిసారిగా మహిళను పరిపాలకురాలిని చేసిన ఘనత కాకతీయులకు దక్కుతుంది. ముప్పమాంబ, మైలాంబ, కుందమాంబ తదితర స్త్రీలు విరివిగా భూదానాలు చేసినట్లు, చెరువులను తవ్వించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. 

సాంఘిక పరిస్థితులు 

కాకతీయల కాలంనాటి ప్రజల సాంఘిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఆధారం వినుకొండ వల్లభరాయుడు రచించిన 'క్రీడాభిరామం'. ఓరుగల్లు నగరంలోని ప్రజల సమగ్ర జీవన విధానాన్ని క్రీడాభిరామం ప్రతిబింబిస్తుంది. ఓరుగల్లు నగరంలోని వెలిపాలెం, మేదరివాడ, అంగడి వీధి, మట్టియవాడ (మటైవాడ) తదితర వీధులను ప్రస్తావించారు. కోట గోడపై గడియారం, దేవాలయాలు, పూటకూళ్ల భోజనం, తోలుబొమ్మలాట, వేశ్యలు, కవి, గాయక వైతాళికులు, కోడిపందేలు, బంతులాట, దొమ్మరాటలు, మొదలైన వాటిని చిత్రించారు. సమాజంలో సామరస్య వాతావరణం క్రమంగా తగ్గి కుల వైషమ్యాలు, విశృంఖలత్వం పెరిగిపోయింది. రెడ్లు - వెలమల మధ్య అధికారం కోసం పోటీ విపరీత పరిణామాలకు దారి తీసింది.

సాంఘిక జీవనం 

కాకతీయుల కాలంలో కులవ్యవస్థ బాగా ప్రబలి పోయింది. కాకతీయుల కులం గురించి స్పష్టత లేదు. కానీ శూద్రులనే భావన ఉంది. వర్ణాంతర వివాహాలు కేవలం ఉన్నత వర్గాల వారిలో ఉండేవి. వివిధ వర్గాల మధ్య సామరస్యం ఉండి గ్రామీణ జీవితం ప్రశాంతంగా సాగింది. రెడ్డి, వెలమ కులాల మధ్య అధికార ప్రాబల్యం కోసం పోరాటాలు జరిగాయి. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం తగ్గింది. అధికారం శూద్రుల హస్తగతం కావడంతో వారు రాజులయ్యారు. శూద్రులతో క్షత్రియులు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నారు. 

దురాచారాలు 

కాకతీయుల కాలంనాటి సమాజంలో నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, సతీసహగమనం లాంటి దురాచారాలుండేవి. సామాన్య ప్రజల్లో మద్యపానం, జూదం, కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు లాంటి వ్యసనాలుండేవి. దేవదాసీలకు, బసివిరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. ప్రభువులు, ఉన్నతవర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించేవారు. 

క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధం తర్వాత ఓరుగల్లులో కూడా పల్నాటి వీరులకు జాతర చేయడం ఆచారమైంది. పల్నాటి బ్రహ్మనాయుడు కులవ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను, చాపకూళ్లను ప్రోత్సహించాడు. అతడు వీరవైష్ణవాన్ని అనుసరించి.. అనేక మంది నిమ్న కులస్థులను అందులో చేర్చాడు. దళితులకు దేవాలయ ప్రవేశం చేయించాడు. శివుడి ఉగ్రరూపాలైన భైరవ, మైలారు దేవతలను పూజించినట్లు క్రీడాభిరామం తెలుపుతోంది. మైలారు దేవుడిని యుద్ధదేవుడిగా వీరులు ఆరాధించేవారు. కాకతీయులు అనులోమ, విలోమ వివాహ పద్ధతులను అనుసరించారు. వీరి కాలంలో బలిజ, సాతాని, వెలమ వంటి కొత్త కులాలు ఆవిర్భవించాయి. రెడ్డి, వెలమ, కమ్మ, తెలగ కులాలు ఈ కాలంలో గట్టిపడ్డాయి. కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు (కంసాలి), సాలెవారు, మంగలి, కుమ్మరి, కమ్మరి, బోయ, రుంజలు, పిచ్చకుంట్లవారు, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లు కాకతీయుల శాసనాల్లో ప్రస్తుతించారు. 

కాకతీయ రాజులు వీరశైవ, వీరవైష్ణవ మతాలను పోషించి వాటి ద్వారా సాంఘిక సమానత్వాన్ని సాధించాలని చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. పైగా శైవమతం వల్ల సమాజంలో లింగాయతులు, బలిజలు, పెరిక జంగాలు, తంబళ్లు వంటి నూతన కులాలు పుట్టుకువచ్చాయి. వైష్ణవంలో సాతానులు, నంబులు, దాసర్లు, శైవంలో చాకలి, మంగలి, మాల, మాదిగ జాతుల వారు ఉన్నారని బసవపురాణం చెబుతున్నది. మల్కాపురం శాసనం ప్రకారం అన్ని కులాల వారికి, చివరికి చెండాలురకు కూడా సహపంక్తి భోజనాలు, అన్న, వస్త్ర దానాలు సమానంగా ఉన్నాయి. విశ్వబ్రాహ్మణులు మొదట జైనులు తరువాత వీరశైవంలో చేరారు. గణపతి దేవచక్రవర్తి నియోగ బ్రాహ్మణులను కరణీకం వృత్తిలో స్థిరపడేట్లు చేశాడనీ, గోపరాజు రామప్రధాని అనే మంత్రి సలహాపై కరణాలుగా నియమించాడని తెలుస్తోంది. 

మార్కోపోలో రచనల ప్రకారం కాకతీయుల కాలం నుంచే ఓరుగల్లులో పూటకూళ్ళ ఇళ్ళు ఉన్నట్లు తెలియవచ్చింది. మహాజనులు (బ్రాహ్మణ), నకరము (వైశ్య) మొదలైనవి. గ్రామాల్లో అష్టాదశ కులాలవారు, ద్వాదశ వృత్తుల వారు ఉండేవారు. వారు కరణం, కాపు, తలారి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, శెట్టి, పురోహితుడు, వడ్రంగి, చాకలి, మంగలి, చర్మకారుడు మొదలైనవారు. కాకతీయుల పాలనాకాలంలో అనేక జాతరలు జరిగేవి. నాటకాలు, హరికథలు, కోలాటాలు, జక్కుల యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, రంగులరాట్నాలు వీరికాలం నుంచే సమాజంలో ప్రవేశించాయి. వీరశైవ మతస్థులు నిప్పుగుండాల్లో నడవటం, కండలు కోసుకోవడం, తలలు నరుక్కోవడం, కత్తులు, ఈటెలు పాతిన పాతర్లలో నడవటం ఒక ఆచారంగా ఉండేది. 

స్త్రీల అలంకరణ - వస్త్రధారణ 

కాళ్లకు పసుపు లేపనం, పారాణి, పెదవులకు యావక రసం పూసుకోవడం, పండ్లకు చిక్కాపొడి, అవాంఛిత రోమాలు పోవడానికి సుసుర ఖేట్ వాడటం, పెండ్లయిన ఆడవారి మెడలో తాళి, నల్లపూసల దండ, కాళ్లకు మెట్టెలు, అందెలు, ముక్కుకి ముక్కెరలు, ముంజేతికి మురుగులు, మోచేతులకు దండ కడియాలు, నడుముకు వడ్డాణాలు, సంపన్న స్త్రీల మెడలో ముత్యాల హారాలు, పుడకల పట్టెడ, రోమ్ నాణేలతో మెడలో కాసుల పేర్లు, తాటంకాలుగా పిలువబడిన హారాలు, చైనా అద్దాలు వాడేవారు. సన్నని సాలెగూడు వంటి దారాల పోగులవలె ఉండే వలువలను స్త్రీలు ధరించేవారని మార్కోపోలో రచనల వలన తెలుస్తున్నది. బసవ పురాణ కర్త సోమనాథుడు 20 రకాల వస్త్రధారణల గురించి రాశాడు. వెంవళియు, జయరంజియు, మంచుపుంజంబులు, మణిపట్టు, భూతిలకము, శీవన్నియము, మహఛీనీ, భావ తిలకం, పచ్చని పట్టు, రాయశేఖరం, రాయవల్లభుడు, వాయు మేఘము గజవాళము, గండవాడము, గావులు, సరిపట్టు, మస్లిన్ వస్త్రాలు, అద్దకాలు మొదలైనవి.

వివాహ వ్యవస్థ 

కాకతీయుల కాలంలో వివాహాలు నాలుగు రోజులు జరుగుతుండేవి. మేనమామ కూతురును వివాహం చేసుకునే ఆచారం ఉంది. రాజ కుటుంబాల్లో వివాహం జరిగేటప్పుడు రాజ్యమంతటా ఉత్సవాలు జరిగేవి. తలంబ్రాలు పోయడం, ఊరేగింపు ఆచారం ఉంది. సామాన్యుల వివాహాలు, పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఒప్పుకోవడాన్ని ముద్రారోహణం(కన్య శిరస్సుపై పూలు ఉంచడం) అంటారు. వివాహానంతరం వసంతోత్సవాలుండేవి.

మూఢనమ్మకాలు 

అంజనం వేయడం, శకునాలు పాటించడం, భూత ప్రేతాలపై నమ్మకాలు, పాపభీతి, ఓట్లు వేయించడం మైదలైనవి ఉన్నాయి. గ్రామ దేవతలకు బలి ఇవ్వడం వంటి ఆచారం కూడా కలదు. ముస్లిం రచనల ప్రకారం దక్షిణ దేశపు స్త్రీలు ఆవుపేడతో ఇల్లు అలికే ఆచారం కలదనీ, దానివల్ల చీడ పీడ, భూత, ప్రేతాలు రావని నమ్మేవారు. రాజ అంతఃపురంలో, దేవాలయాల్లో వీరు నృత్యం చేసేవారు. ఓరుగల్లులో జార ధర్మాసనం, వేశ్యలకు సమాజంలో గౌరవ స్థానం ఉండేది. ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె మాచల్దేవికి ఆనాటి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉండేది. వైష్ణవ మతస్థులు దేవదాసీలను శైవమతస్థులు బసవనీరాండ్రి ఆచారాలు ప్రవేశపెట్టారు.