కుల వ్యవస్థ 

కుతుబ్ షాహీల కాలంనాటి సమాజంలో తెలంగాణలో ఒక విశిష్టమైన సమాజ నిర్మాణం జరిగింది. వర్ణవ్యవస్థ ప్రాబల్యం స్థానంలో సమాజంలో హిందువులు, ముస్లింలు అనే రెండు ప్రధాన వర్గాలు ప్రాముఖ్యం వహించాయి. హిందువుల్లో రాజోద్యోగులు, వర్తకులు, రైతులు ముఖ్య వర్గాలు. ముస్లింలలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు ప్రధాన వర్గాలు. హిందూ జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హిందూ జనాభాలో అనేక ఉపకులాలు, శాఖలు ఏర్పడ్డాయి. కాపులు, రెడ్లు, బలిజలు, వెలమలు, వడ్రంగులు, కమ్మరి, నేత, బోయ, దర్జీ, మత్స్యకారులు, రజక, నాయీబ్రాహ్మణ తదితర జనాభా ఎక్కువ. హిందువులను పాలనా వ్యవస్థలోని అత్యున్నత ఉద్యోగాల్లో సైతం నియమించారు. 

విశిష్ట సంస్కృతి అవతరణ 

రాజధాని గోల్కొండకు మధ్య ఆసియా ప్రాంతం నుంచి కవులు, కళాకారులు, వివిధ రకాల వృత్తి నిపుణులు, ఇరాన్ కు చెందిన అఫాకీలు తరలివచ్చారు. వీరి వలసల ఫలితంగా తెలంగాణలోని భాగ్యనగరంలో ఒక విశిష్టమైన సమ్మిశ్రిత సంస్కృతి రూపుదాల్చింది. పాలకులు రాజ్యంలోని జనాభాలో మెజార్టీ భాగమైన హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. హిందూ దేవాలయాలకు, పండితులకు విశేషంగా ఇనాములు ఇచ్చారు. బ్రాహ్మణులకు అగ్రహారాలను దానం చేశారు. సమాజంలో బహుభార్యత్వం, కన్యాశుల్కం, సతీసహగమనం, వేశ్యా వ్యవస్థ తదితర సాంఘిక దురాచారాలు కొనసాగాయి. వేశ్యలకు ప్రభుత్వ ఆదరణతో పాటు సమాజంలో గౌరవ, మర్యాదలను కల్పించారు. కుత్ బ్ షాహీ పాలకులు సతీసహగమనాన్ని రూపుమాపడానికి ప్రయత్నించారు. సమాజంలోని ప్రజల ఆచార వ్యవహారాల్లో ఉత్తర భారత, హిందుస్థానీ ప్రభావం కనిపిస్తుంది. 

Must Read : 

తెలంగాణ సమాజం

తెలంగాణ సమాజం - శాతవాహనానంతర కాలం

తెలంగాణ సమాజం -  కాకతీయుల కాలం

వస్త్రధారణ 

పురుషులు తలపై పొడవైన టోపీ, కుర్తా - పైజామా ధరించగా స్త్రీలు సాధారణంగా చీర, రవిక ధరించినప్పటికీ పేద స్త్రీలు రవికను అంతగా వాడలేదు. ముస్లిం స్త్రీలు పైజామా, దుపట్టాలను విరివిగా ధరించేవారు. స్త్రీ, పురుషులిద్దరూ బంగారు నగలు, ఆభరణాలను ధరించేవారు. రెడ్డి, బ్రాహ్మణ కులస్తులు మిద్దె ఇళ్లలో నివసించేవారు. వారి ఇళ్లలోనే పశువులకు, వాటి మేతకు కొంత స్థలాన్ని కేటాయించేవారు.వేలకొద్దీ వ్యభిచారుల గృహాలు గోల్కొండలో ఉండేవి. దేవాలయాలు, రాజాస్థానాలు, ముస్లింల పండగలు, శుభకార్యాల్లో 'నృత్యం' ఆనవాయితీగా మారింది. నేటికీ సంపన్నుల విందు వినోదాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.