తెలంగాణ సమాజం గురించి తెలియాలంటే ముందుగా తెలంగాణను పాలించిన వివిధ రాజవంశాల కాలాల్లోని సమాజ స్థితిగతులను గురించి తెలుసుకోవడం అవసరం. తెలంగాణ తొలి పాలకులు శాతవాహనులు. వారి కాలంలో సంస్కృతి, కళలు, వాస్తు-శిల్పం, సాహిత్యం మొదలైన అంశాలు ఉచ్ఛస్థితిలో ఉండేవి. ఆ కాలంనాటి పాలకులు సంస్కృతి పరిరక్షకులుగా కూడా వ్యవహరించేవారు. శాతవాహన పాలకుల అనంతరం తెలంగాణను పాలించిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ / ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, అసహ్హీ మొదలైన వంశజుల పాలనలో కూడా తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపదలు పరిరక్షించబడినవి. సాంస్కృతిక చరిత్రలో ముఖ్య విభాగాలైన సమాజ స్థితిగతులు, సామాజిక పరిణామ క్రమం జరుగుతూ వచ్చింది. 

సాంస్కృతిక వారసత్వం 

సూక్ష్మంగా చెప్పాలంటే సాంస్కృతిక వారసత్వం అనగా ఒక నిర్దిష్ట సమాజంలో అభివృద్ధి చెందిన లేదా రూపొందిన ప్రజల జీవన విధానాలు ఒక తరం మరో తరానికి బదలాయించే వైనాన్ని వ్యక్తపరిచేది. సాంస్కృతిక వారసత్వంలో మూడు ముఖ్యవిభాగాలుంటాయి.

మొదటిది భవన నిర్మాణాలు, వస్తుసామగ్రి, వాస్తు-శిల్పం, స్మారక చిహ్నాలు మొదలైనవి వస్తు భౌతిక సంస్కృతికి చెందేవి. రెండవది ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు మొదలైనవి సాంఘికాచారాలకు చెందేవి. మూడవది సహజసిద్ధమైన నదీలోయలు, పర్వత పంక్తులు, అరణ్యాలు, సరోవరాలు మొదలైనవి 

శాతవాహనుల కాలంలో సమాజం

సమాజంలో వర్ణ వ్యవస్థ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో వృత్తిపరమైన విభజన కనిపిస్తుంది. వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి కానీ కులవ్యవస్థ రూపొందలేదు. సమాజం నాలుగు తరగతులుగా విభజించబడింది. మొదటి తరగతిలో మహా సేనాపతి, మహాభోజ, మహారథికలు లాంటి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి పాలకులు, అధికారులు మొదలైన వారుండేవారు. రెండవ తరగతిలో అమాత్యులు, మహాపాత్రులు, శ్రేష్ఠి లేదా వర్తకులుండేవారు. మూడవ తరగతిలో వైద్యులు, చేతివృత్తులవారు, రైతులు, నగలు తయారు చేసేవారు, నాల్గవ తరగతిలో శ్రామికులు, నేత పనివారు, కుమ్మరులు మొదలైన వారు ఉండేవారు. 

పితృస్వామ్య వ్యవస్థ 

శాతవాహనుల కాలం నాటి సమాజంలో 'పితృస్వామ్య వ్యవస్థ' కనిపించేది. కుటుంబానికి సంబంధించి అన్ని విషయాల్లో తండ్రిదే ప్రధాన పాత్రగా ఉండేది. ఇంటికి యజమాని తండ్రి. అతడిని గృహపతి అని పిలిచేవారు. ఆ కాలంలో పురుషాధిక్యత ఉన్నప్పటికీ స్త్రీలకు సముచిత స్థానాన్ని కల్పించి, వారు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించేలాగా సామాజిక చర్యలు ఉండేవని సాహిత్య, శాసనాధారాల ఆధారంగా తెలుస్తున్నది. ముఖ్య శాతవాహన చక్రవర్తులైన గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్టీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన వారు తమ పేర్లకు ముందు 'మాతృ సంజ్ఞలు' ధరించడమే ఇందుకు నిదర్శనం. పరిపాలనా వ్యవహారాల్లో కూడా స్త్రీలు భాగస్వాములుగా ఉండేవారు. 

కుటుంబ వ్యవస్థ 

ఈ కాలలో ఉమ్మడి కుటుంబాలనేవి సర్వసాధారణం. కుటుంబ సభ్యులంతా ఏకమై, సమష్టిగా బౌద్ధ సంఘాలకు, ఆరామాలకు విరాళాలు ప్రకటించేవారు. ఈ విషయాలను అమరావతి, నాసిక్ శాసనాలను పరిశీలిస్తే ఈ విషయం ప్రస్ఫుటమవుతున్నది. సమాజంలో కులాంతర, దేశాంతర వివాహాలు జరిగేవి. హాలుడు శ్రీలంక రాజకుమారి లీలావతిని వివాహం చేసుకున్నాడు. శాతవాహనులు మరాఠాలతో, శకులతో వివాహ సంబంధాలను ఏర్పరుచుకున్నారు. సమాజంలో వితంతువుల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించేవారు. శకులు, కార్ధమాకులు స్థానికులతో వివాహ సంబంధాలను కలిగి ఉండేవారు. క్షత్రియులు - వ్యాపారం, బ్రాహ్మణులు, వైశ్యులు - ఉద్యోగాలు చేయడం ఆధారంగా సమాజంలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ అది నిరంకుశంగా ఉండేది కాదు. శాతవాహన చక్రవర్తులు వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణను తమ కర్తవ్యంగా భావించారు. 

Must Read : 

తెలంగాణ సమాజం - శాతవాహనానంతర కాలం

తెలంగాణ సమాజం -  కాకతీయుల కాలం

తెలంగాణ సమాజం - కుతుబ్ షాహీల కాలం

జీవనవిధానం 

హాలుడి 'గాథాసప్తశతి' శాతవాహనుల కాలం నాటి ప్రజల జీవన స్థితిగతులను తెలియజేస్తుంది. 'అత్త', 'పాడి', 'పొట్ట' వంటి తెలుగు పదాలు 'గాథాసప్తశతి'లో కనిపిస్తాయి. తెలుగుప్రజలు రకరకాల సందర్భాల్లో పాడుకునే పాటల ప్రస్తావన కూడా ఇందులో గోచరమవుతుంది. శాతవాహనుల కాలంలో సామాన్య ప్రజల భాష ప్రాకృతం, రాజ భాష సంస్కృతం. అమరావతి స్తూపంపై కనిపించే మొదటి తెలుగు మాట 'నాగబు'. 

అమరావతి, కార్లే స్తూపాలపై చెక్కిన శిల్పాల్లోని స్త్రీలు, పురుష ప్రతిమలను బట్టి నాటి వస్త్రధారణ పద్ధతులు తెలుస్తున్నాయి. పురుషులు ధోతీ, ఉత్తరీయంతో పాటు తలపాగా ధరించేవారు. స్త్రీలు చాలా తక్కువ దుస్తులను వాడేవారు. శరీరమంతా కప్పుకోవడానికి ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. నాటి స్త్రీలు ఆభరణాలు, నగల పట్ల మక్కువ కనబరిచేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సామాన్య జీవితాన్ని గడపగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. 

ప్రజలు సంగీత ప్రియులుగా ఉండేవారు. చదరంగం, నాట్యం మొదలైనవి తీరిక వేళల్లో వినోద కార్యకలాపాలుగా ఉండేవి. వీణ, మృదంగం, వేణువు వంటి సంగీత పరికరాలను ఉపయోగించేవారు.