భారత జాతీయోద్యమ కాలంలో ప్రథమ ఘట్టం 'బెంగాల్ విభజన ఉద్యమం'. దీనికి వందేమాతర ఉద్యమం అని, స్వదేశీ ఉద్యమం అని కూడా పేరు కలదు. బ్రిటీష్ వారు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా సమైక్యంగా ఉన్న బెంగాల్ రాష్ట్రాన్ని విడగొట్టి భారతీయులలో ఉన్న ఐక్యతను దెబ్బదీయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా బెంగాల్ విభజన చేపట్టారు. 1905 అక్టోబర్ 16వ తదీన బెంగాల్ రాష్ట్రం తూర్పు బెంగాల్, అస్సాం ఒక భాగంగా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా రెండో విభాగంగా విడగొట్టబడినది. బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను పరిపాలనా సౌలభ్యం కొరకు అని ప్రకటించినప్పటికీ తూర్పు బెంగాల్‌లోని అధిక సంఖ్యాక ముస్లింలను, పశ్చిమ బెంగాల్‌లోని అధిక సంఖ్యాక హిందువుల నుంచి వేరు చేయడం వలన భారతీయుల ఐకమత్యాన్ని రూపుమాపే ప్రయత్నం జరిగింది. బెంగాల్ విభజన నాటి భారత ప్రభుత్వ దేశ వ్యవహారాల కార్యదర్శి రిప్లే. బెంగాల్ విభజనా వ్యతిరేకోద్యమానికి ముఖ్య కారకుడుగా ఆ నాటి రాజప్రతినిధి కర్జన్ ను  చెప్పవచ్చును. ఈ కాలంలో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందే మాతరం గేయం దేశం అంతా బహుళ ప్రాచుర్యం లోకి వచ్చి జాతీయ గీతంగా మారింది. ఏ ఇద్దరు భారతీయులు కలిసినా వందేమాతరం అని అభివాదం చేసుకోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం, వంటి చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది. ఉద్యమ తొలినాళ్ళలో బెంగాలుకు మాత్రమే పరిమితమైన ఉద్యమం, తరువాత కాలంలో యావత్ దేశమంతా వ్యాపించి అఖిల భారత ఉద్యమంగా మారి భారతీయులంతా ఒకటే అని బ్రిటీష్ వారికి చాటి చెప్పడంతో ఈ ఉద్యమం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. 

సంబంధిత అంశాలు :  హోంరూల్ ఉద్యమం (1916)

ఉద్యమ తీరుతెన్నులు

1906 అక్టోబర్ 16వ తేదీన దేశమంతా సంతాపం, హvణ్, ఉపవాసాలు పాటించబడ్డాయి. ఈ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను "స్వదేశీ", "బహిష్కరణ" అనే రెండు ఆయుధాలు ఉపయోగించబడినవి. భారతీయులచే నూలుమిల్లులు, సబ్బులు, అగ్గిపెట్టెల కర్మాగారాలు, చేనేత వ్యవస్థలు, జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీలు వంటి అనేక దేశీయ పరిశ్రమలు నెలకొల్పబడినవి. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే 'బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్'ను ప్రారంభించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక స్వదేశీ స్టోర్ ను ప్రారంభించారు. బిరుదులు, ఉద్యోగాలు, న్యాయస్థానాలు, విద్యాసంస్థలు క్లబ్బులు కూడా బహిష్కరించబడినవి. వివిధ ప్రాంతాల్లో జాతీయ విద్యాసంస్థలు నెలక్పొబడినవి. 1905 నవంబర్ 10వ తేదీన కలకత్తాలోని పుర ప్రముఖులంతా కలిసి ఒక మహాసభను సమావేశ పరిచి ఒక జాతీయ విద్యాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదే సభలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు అప్పటికప్పుడు 8 లక్షల విరాళాన్ని కూడా అందజేశారు. జాతీయ విద్యా సంఘం ఏర్పాటుతో అనేక పట్టణాల్లో జాతీయ కళాశాలలు నెలకొల్పడం జరిగింది. 1906లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ విద్యను సమర్థిస్తూ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. అదే సంవత్సరం ఆరవిందఘోష్ ప్రధానాచార్యుడుగా కలకత్తాలో ఒక జాతీయ కళాశాల ఏర్పాటు చేయబడినది. 

సంబంధిత అంశాలు : సహాయ నిరాకరణోద్యమం (1920-22) 

1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన చేయడం ద్వారా విద్యార్థులను ఉద్యమం వైపు ఆకర్షింపజేశారు. 1909లో ఆంధ్రాలోని మచిలీపట్నంలో కోపల్లె హనుమంతరావు కృషి కారణంగా జాతీయ కళాశాల ఏర్పాటు చేయబడింది. ఈ ఉద్యమంలో అబ్దుల్ రసూల్ అనే ప్రఖ్యాత న్యాయవాది, లియాకత్ హుసేన్, గుట్నవి వంటి ప్రముఖ ముస్లింలు కూడా పాల్గొన్నారు. 'వందేమాతరం' సంపాదకుడు అరవింద ఘోష్, 'సంధ్య' సంపాదకుడు, 'యుగంధర్' సంపాదకుడు భూపేంద్రనాథ్ దత్ వంటి ప్రముఖులు ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను శిక్షకు గురయ్యారు. ఈ ఉద్యమాన్ని అణిచివేసే నెపంతో బ్రిటీష్ ప్రభుత్వం అనేక మంది నాయకులను నిర్బంధించి, దేశం నుంచి బహిష్కరించారు. వారిలో లాలా లజపతిరాయ్, అజిత్ సింగ్ వంటి నాయకులు కలరు. అరవిందఘోషన్ను అరెస్టు చేసి ఒక సంవత్సరం కారాగారంలో బంధించారు. ఆ తరువాత రాజకీయాలతో విసుగు చెందిన అరవిందుడు 1910లో పాండిచ్చేరికి వెళ్ళి తన శేష జీవితం గడిపారు. ఈ ఉద్యమ కాలంలో తూర్పు బెంగాలకు ఉపగవర్నర్‌గా వ్యవహరించిన 'పుల్లర్' శాంతి యుతంగా సమావేశం జరుపుకుంటున్న హిందువులపై అతని అనుమతి లేకుండా సమావేశంలో పాల్గొన్నారనే నెపంతో వారందరిని చెల్లాచెదురు చేశాడు. ఆ సమావేశంలో పాల్గొన్న సురేంద్రనాథ్ బెనర్జీని ఖైదు చేశాడు. ఉద్యమానికి ఆత్మలాగా వ్యవహరించిన బాలగంగాధర్ తిలక్ కూడా 1908లో అరెస్టు కాబడి ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్షకు మాండలే జైలుకు తరలించబడినాడు. ఈ ఉద్యమ కాలంలోనే 'పికెటింగ్' అనే కొత్త విధానం ప్రారంభించబడి, దాని ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ చేయడం కొరకు విదేశీ వస్తువులను అమ్మకుండా అడ్డుకోవడం, లేదా ఆ వస్తువులను ఉద్యమకారులు కొని తగులబెట్టడం వంటి చర్యలకు ఉద్యమకారులు పూనుకునేవారు. అశేష భారత ప్రజానీకం పాల్గొన్న బెంగాల్ విభజన రద్దు ఉద్యమం కేవలం బెంగాలీల విజయమే కాకుండా యావత్ భారతదేశ ప్రజల విజయంగా వర్ణించబడింది. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి భారతీయులు సాధించిన ప్రథమ విజయంగా స్వదేశీ ఉద్యమాన్ని చెప్పవచ్చును. 1911లో డిసెంబర్ లో జార్జి చక్రవర్తి సతీసమేతంగా భారతదేశ సందర్శనార్థం రానున్నందున దేశంలోని కల్లోల పరిస్థితులను గమనించిన బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు పరుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఉద్యమ ప్రభావం కారణంగా బ్రిటీష్ ప్రభుత్వ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది.

సంబంధిత అంశాలు :  క్విట్ ఇండియా ఉద్యమం