భారత స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చరమ ఘట్టంగా అభివర్ణించవచ్చును. ఏ నాయకత్వం లేకుండా జరిగిన ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రత్యేకత కలదు. క్విట్ ఇండియా ఉద్యమం 1942-44 మధ్య కాలంలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో బ్రిటిష్ వారిని జపాన్ ఓడించింది. దీంతో బ్రిటన్ భారతదేశాన్ని రక్షించలేదని, దేశం వదిలి పెట్టి వెళ్లిపోవాలని కాంగ్రెస్ బ్రిటనను కోరింది. జపాన్ సామ్రాజ్యవాదం భారతదేశ మనుగడకు ప్రధాన ముప్పుగా పరిణమించింది. ఆసియా, ఆసియా వాసులకే అనే నినాదంతో; ఆసియాలో ఉన్న బ్రిటిష్ వలసలన్నింటి పై దండయాత్రలు తప్పవని జపాన్ హెచ్చరించింది. భారతదేశ ప్రజల్లో భయాందోళనలు, బ్రిటిషర్లపై అపనమ్మకం పెరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడానికి తొలి కారణంగా ఈ సంఘటనను చెప్పవచ్చును. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడానికి మరొక ముఖ్య కారణం క్రిప్స్ రాయబారం వైఫల్యం. 

1942 మార్చిలో ఇండియా వచ్చిన క్రిప్స్ రాయబార ప్రతిపాదనలు భారతీయుల మనోభావాలను తృప్తి పరచలేదు. రక్షణశాఖను భారతీయులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వడం పరోక్షంగా ముస్లింలీగ్ పాకిస్థాన్ డిమాండ్ ను బలపరిచినట్లయింది. రెండో ప్రపంచ యుద్ధంలో తనను తాను రక్షించుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ యుద్ధానంతరం స్వయం ప్రతిపత్తి కల్పిస్తాననడాన్ని కాంగ్రెస్ విశ్వసించలేదు. 

సంబంధిత అంశాలు :  హోంరూల్ ఉద్యమం (1916)

మరికొన్ని కారణాలు 

  • రెండో ప్రపంచ యుద్ధంలో రతీయులను సంప్రదించకుండానే, బ్రిటిష్ వారు భారతీయులు తమ పక్షాన యుద్ధం చేస్తారని ప్రకటించడం భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. 
  • కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ 1939లో రాజీనామా చేసి, బ్రిటిష్ వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి. 
  • మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన 1940 మార్చిలో రామ్ ఘర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో, సంపూర్ణస్వాతంత్ర్యమే తమ అంతిమ లక్ష్యమని, తమకు ఇంకేమీ ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ లక్ష్యసిద్ధికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది. 
  • 1940 ఆగస్ట్ ఆఫర్ లో లిన్ లిత్ గో యుద్ధ సలహామండలిని ఏర్పాటు చేశాడు. అందులో సైనిక శాఖను తన ఆదిపత్యంలో ఉంచుకున్నాడు.
సంబంధిత అంశాలు : వందేమాతర ఉద్యమం(1905-11)
  • భారతదేశంలోని అల్పసంఖ్యాక వర్గాలు ఎటువంటి ఒత్తిళ్లకూ గురి కాకుండా చూస్తామని చెప్పడం, ముస్లింలీగ్ పాకిస్థాన్ డిమాండ్ కు మద్దతుగా ఆగస్టు ప్రతిపాదనలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి చెందింది. 
  • యుద్ధ సమయంలో మిత్రపక్షాల సైన్యాలు భారత సైన్యాన్ని అవమానపరచాయి. జాతి వివక్ష చూపాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఇది భారతీయులను మనస్తాపానికి గురిచేసింది. 
  • యుద్ధకాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటుతున్నా, బ్రిటన్ పట్టించుకోలేదు. భారతీయ సామాజిక వర్గాలపై పడిన ఆర్థిక భారాన్ని ప్రజలు మోయలేక, దేశం నుంచి బ్రిటిషర్లను నిష్క్రమింపజేయడమే సమస్యకు పరిష్కారమనే అభిప్రాయానికి వచ్చారు. 
  • యుద్ధసమయంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, యుద్ధానంతరం స్వాతంత్ర్యం ఇవ్వాలనే డిమాండ్ తో యుద్ధ సంమయంలో బ్రిటన్ కు బాధ కలిగించకుండా వ్యక్తి సత్యాగ్రహం చేసినా, దానికి బ్రిటన్ నుంచి స్పందన రాలేదు. దీంతో బ్రిటన్ పై భారతీయులకు నమ్మకం పోయింది. 
  • బ్రిటిష్ ప్రభుత్వ విధానం వల్ల దేశంలో నెలకొన్న అరాచక పరిస్థితుల కంటే, బ్రిటిష్ వారు వైదొలగేటప్పుడు ఏర్పడే అలజడుల ప్రభావం ఎక్కువగా ఉండదని గాంధీ భావించడం మరో ఉద్యమానికి దారితీసింది. 
  • వీరస్వర్గమో (డూ ఆర్ డై) అనే పిలుపుతో గాంధీ క్విట్ ఇండియా తీర్మానం చేశారు. మరుక్షణమే జాతీయ నాయకులందరినీ జైళ్లకు పంపడంతో ఉద్యమం అనివార్యమైంది.
సంబంధిత అంశాలు : సహాయ నిరాకరణోద్యమం (1920-22) 

క్విట్ ఇండియా ఉద్యమ గమనం 

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బొంబాయిలో 1942 ఆగస్టు 8న సమావేశమై క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటిష్ పరిపాలన అంతం కావడం కోసం శాంతియుత పోరాటం చేయాలని పేర్కొంది. ఇందుకోసం భారతీయుల సమకూర్చుకున్న అహింసాయుత బలాన్నంతా ఉపయోగించాలని స్పష్టం చేసింది.  మరుసటి రోజు ఆగష్టు 9న ఉద్యమం పారరంభం అయ్యింది.
  • క్విట్ ఇండియా తీర్మానం చేసిన మరుసటి రోజు తెల్లవారే సరికి గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, తాలూకాస్థాయి నాయకులందరూ జైళ్లపాలు కావడంతో, ఉద్యమం ఎలా జరగాలో నిర్దేశించడానికి నాయకులు కరవయ్యారు. దీంతో ప్రతీ వ్యక్తి నాయకుడై, తనకు తోచిన విధంగా వ్యవహరించాడు. 
  • ప్రజలు చెట్లను నరికి, రోడ్లపై వేసి, రాకపోకలకు అంతరాయం కలిగించారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగలను తెంపారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులను కాల్చి వేశారు. 
  • మహారాష్ట్రలోని సతారాలో నానాపాటిల్ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా పోటీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 
  • కర్ణాటకలోని 200 గ్రామాల్లో ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేశారు. అహ్మదాబాద్ పురపాలక సంఘాన్ని ప్రభుత్వం రద్దు చేయగా, ఉద్యోగులు సమ్మెకు దిగారు.
  • బీహార్ లోని సుల్తాన్ పూర్ లో పోటీ ప్రభుత్వం, ఉత్తర భగత్ పూర్ లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 
  • కలకత్తాలోని తామ్లాక్, నందిగ్రామ్ మొదలైన చోట్ల విద్యుత్ వాహిని అనే జాతీయ సైన్యం ఏర్పడింది. 
  • అస్సాంలో ప్రజల అవసరాలు తీర్చడానికి క్రాంతి సేన అనే స్వచ్ఛందదళ నిర్మాణం జరిగింది. 
  • పట్టణాలతో పాటు గ్రామాల్లో తిరుగుబాటు విస్తృతంగా జరిగింది. గ్రామాల్లో రైతులు తిరుగుబాటుకు మార్గదర్శకత్వం వహించారు.
  • పలుచోట్ల విద్యావంతులైన యువకులు పాల్గొన్నారు. బొంబాయి, పుణే, సతారా మొదలైన చోట్ల ఆయుధాల సరఫరా కోసం రహస్య సంస్థలు ఏర్పడ్డాయి. 
  • నాయకులు రహస్య జీవితం గడిపారు. అజ్ఞాత నాయకుల కోసం ఉషామెహతా, రామ్ మనోహర్ లోహియా రేడియోలో వార్తలను ప్రసారం చేశారు. 

ఉద్యమ క్షీణత

  • బ్రిటిషర్లు మెషీన్ గన్లను ప్రయోగించారు. జైళ్లల్లో చిత్రహింసలు పెట్టారు. గ్రామాల్లో పోలీసు, సైనికుల దౌర్జన్యాలు, గృహదహనాలు చోటుచేసుకున్నాయి. 
  • మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. సామూహిక జరిమానాలు విధించారు. ప్రభుత్వం రూ. 90 లక్షలు జరిమానాల కింద వసూలు చేసింది. 
  • జాతీయ నాయకులందరినీ అరెస్ట్ చేయడంతో ఉద్యమ దిశానిర్దేశం చేసేవారు లేకపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలు అముల జరిపి తక్కువ కాలంలోనే ఉద్యమాన్ని అణచివేసింది.

ఉద్యమ ప్రాముఖ్యత 

  • బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయడంలో విజయవంతమైనప్పటికీ, ఇలాంటిదే మరో హింసాయుత, భారీ ఉద్యమాన్ని ఎదుర్కోవడం కంటే సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. 
  • ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్ల భారత స్వాతంత్ర్య సమస్య నైతికమైందని సర్వత్రా భావించారు. 
  • సాధారణ వ్యక్తులు అంటే రైతులు, శ్రామికలు మొదలైనవారు స్వచ్ఛందంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. నాయకుల అరెస్టుతో తమంతట తామే దిశానిర్దేశంతో ఉద్యమాన్ని నడిపారు. 
  • త్రివిధ దళాలు, ప్రభుత్వోద్యోగులు ఉద్యమం పట్ల ప్రభావితం కావడం గొప్ప విషయమని మౌలానా అబుల్ కలాం ఆజాద్ 'ఇండియా విన్స్ ఫ్రీడం' లో తెలియజేశారు. 
  • పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యమ అజ్ఞాత నాయకులకు నైతిక, ఆర్ధిక సహాయం అందజేయడం విశేషం. అచ్యుత్ పట్వార్దన్ పోలీసుల కంటబడకుండా ఉండేందుకు మహిళా పారిశ్రామికవేత్త సుమతి మొరార్జీ రోజుకొక మోటర్కారు ఇచ్చారు. 
  • అహింసాయుత మార్గాన్ని ఎంతో కాలం పాటించడానికి గాంధీ సైతం సిద్ధంగా లేడనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించేలా చేసింది. ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ, విప్లవ పంథాలో కూడా ప్రజాపోరాటం నడిపించగల శక్తిగా అవతరించింది. 
  • ఉద్యమ తీవ్రతను బట్టి దేశస్వాతంత్ర్యం అనివార్యమయిందనే విషయం స్పష్టమైంది. భారతదేశాన్ని ఇక ఎంతో కాలం తమ గుప్పిట్లో పెట్టుకోలేమని, బ్రిటిష్ నాయకులకు అర్థం అయింది. 
  • స్వాతంత్ర్య ఉద్యమాల్లో ఈ ఉద్యమం హింసాత్మకంగా, నాయకత్వం లేని పోరాటంగా మిగిలింది. 
  • జాతీయోద్యమ నాయకులను బ్రిటిషర్లు అరెస్ట్ చేయడంతో, ప్రతి వ్యక్తి తనకిష్టమొచ్చిన రీతిలో ఉద్యమాన్ని నడపటంతో పాటు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించాడు.
  • ఉద్యమం సఫలం కాకపోయినా, పూర్తి స్థాయిలో విఫలమైందనడానికి వీలులేదు. దానివల్ల భారత స్వాతంత్ర్యం కనుచూపుమేరలోకి వచ్చింది.

'క్విట్ ఇండియా' పద ప్రాచుర్యం

స్వాతంత్ర్య పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మహాత్మాగాంధీ తన సహచరగణంతో వ్యూహ రచన చేస్తున్న సమయంలో ముంబైలో జరిగిన సమావేశంలో స్వాతంత్ర్య పోరాటానికి పనికొచ్చి మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరగా 'రిట్రీట్ ఆర్ విత్ డ్రా' అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న ముంబై మేయర్ గా పనిచేస్తున్న 39 ఏళ్ల యూసుఫ్ మెహరల్లీ 'క్విట్ ఇండియా' పదాన్ని సూచించారు. ఆ పదం గాంధీజీకి నచ్చి వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. ఈ విధంగా 'క్విట్ ఇండియా' అనే నినాదం మొదట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వాతంత్ర్యోద్యమానికి ఊపునిచ్చిన 'క్విట్ ఇండియా' అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కే. గోపాలస్వామి రాసిన 'గాంధీ అండ్ బాంబే' పుస్తకంలో వివరించారు.