బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతదేశంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అలముకొన్న సమయంలో, జలియన్ వాలాబాగ్ సంఘటన, ఖిలాఫత్ సమస్య, చాలీ చాలని సంస్కరణలతో మరింత అసంతృప్తి చెందిన గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు.

కారణాలు 

జలియన్ వాలాబాగ్ సంఘటన: 

రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13న 'జలియన్ వాలాబాగ్'లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళనకారులపై సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతీసుకొనే బదులు విచారం వ్యక్తం చేయడం.

సంబంధిత అంశాలు : వందేమాతర ఉద్యమం(1905-11)

ఖిలాఫత్ సమస్య: 

మొదటి ప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని భారతీయులు కోరారు.

మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు: 

1919లో మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు స్వయంపరిపాలన బదులు ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాయి. స్వయంపాలనకు ద్వంద్వ ప్రభుత్వం ప్రత్యామ్నాయం కాదని, సంస్కరణల పట్ల భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం: 

1914-1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఆర్థికమాంద్యం, పరిశ్రమల మూతకు కారణమై, కార్మికవర్గాల్లో అలజడి రేపింది. వ్యసాయం దెబ్బతినడం, అధిక రెవెన్యూ శిస్తుభారం చెల్లించలేక రైతులు అసంతృప్తి చెందడం మొదలైనవి బ్రిటిష్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. బ్రిటిష్ వారు ప్రదర్శిస్తున్న జాత్యహంకారం, అకృత్యాలు భరించడానికి వీల్లేని స్థాయికి ఎదిగాయని సామాన్య ప్రజలు భావించారు. 

సంబంధిత అంశాలు :  హోంరూల్ ఉద్యమం (1916)

బ్రిటిష్ పాలనను అంతమొందించాలనే తహతహ ప్రజల్లో విపరీతంగా పెరిగింది. రాజ్యాంగబద్ద విధానాల ద్వారా స్వరాజ్యం సాధించలేమనే అభిప్రాయం భారత జాతీయ కాంగ్రెస్ కు కలగడం. గాంధీజీ చేపట్టిన చంపారన్, అహ్మదాబాద్, ఖేదా సత్యాగ్రహాలు విజయవంతం కావడంతో గాంధీజీపై భారతీయ ప్రజలకు నమ్మకం పెరిగింది. 

లక్ష్యాలు 

 • ఏడాది కాలంలో స్వరాజ్యాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యమని గాంధీజీ చెప్పారు. 
 • ఖలీఫా పదవిని పునరుద్ధరించాలి. 
 • పంజాబ్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటనపై బ్రిటిష్ ప్రభుత్వం యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పాలి. 

కార్యక్రమాలు: 

 • 1920 సెప్టెంబరులో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది. భారతీయులకు జరుగుతున్న అన్యాయాలను నివారించి, జాతీయ గౌరవాన్ని నిలబెట్టేందుకు స్వరాజ్య స్థాపన అత్యంత అవసరమని, దీనికోసం సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించాలని సమావేశంలో తీర్మానం చేశారు. 
 • 1920 డిసెంబరు సాధారణ కాంగ్రెస్ సమావేశం (నాగపూర్) సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఆమోదించింది. 
 • ఉద్యమ కార్యక్రమాలు రెండు భాగాలుగా జరిగాయి. అవి 1. బహిష్కరణ కార్యక్రమాలు 2. నిర్మాణాత్మక కార్యక్రమాలు.
 • 1921 మే లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
 • విదేశీ వస్త్రాలు, వస్తువుల బహిష్కరణ: బొంబాయిలో ప్రజలు విదేశీ వస్త్రాలను బహిష్కరించి, అగ్నికి ఆహుతి చేశారు. 
 • చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన వారు న్యాయస్థానాలను బహిష్కరించారు. 
 • లెజిస్లేటివ్ కౌన్సిల్ కు నామినేషన్లు వేసి, ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఓటర్లు 80% దాకా ఓటు వేయలేదు.
 • విద్యాలయాల బహిష్కరణలో బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు ముందు నిలిచాయి. 
 • 1921లో ఇంగ్లండ్ దేశ యువరాజు వేల్స్ బొంబాయి పర్యటనను భారతీయులు బహిష్కరించారు. 
 • బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన కైజర్-ఇ-హింద్ బిరుదును గాంధీజీ త్యజించారు. 
 • ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, పంజాబ్, ఆంధ్ర మొందలైన ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానికి నిరాకరించారు. 
 • ప్రభుత్వం ఏర్పాటేచేసిన సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించారు.
సంబంధిత అంశాలు :  క్విట్ ఇండియా ఉద్యమం 

నిర్మాణాత్మక కార్యక్రమాలు 

 • తిలక్ స్మారకనిధికి విరాళాలు కోటి రూపాయలు సేకరించాలని లక్ష్యం కాగా రూ.1.15 కోట్లతో నిధిని ఏర్పాటు చేశారు. 
 • రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారు చేయడం. దేశంలో 20 లక్షల రాట్నాలను పని చేయించాలని నిర్ణయించారు. 
 • ఖద్దరు వస్త్రాల తయారీకి ప్రాధాన్యం ఇస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు, గాంధీ కూడా స్వయంగా నూలు వడికి ఖద్దరు వస్త్రాలు తయారు చేశారు. 
 • ఆంగ్ల విద్యాలయాలను బహిష్కరించిన విద్యార్థులకు ఉపయోగపడేందుకు జామియామిలియా, కాశీ విద్యాపీఠం మొదలైనవి ఏర్పాటు చేశారు. 
 • బెంగాల్ జాతీయ కళాశాలకు సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. 
 • అస్పృశ్యతను తొలగించడంతోపాటు హరిజనోద్దరణకు తగు చర్యలు చేపట్టడం, హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కృషి చేయడం, స్త్రీ జనోద్ధరణకు ప్రాముఖ్యత గ్రామీణ న్యాయ సమస్యల పరిష్కారానికి పంచాయతీల ఏర్పాటు చేయడం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. 

సహాయ నిరాకరణోద్యమ ఫలితాలు: 

చరిత్రలోనే ప్రప్రథమంగా నిజమైన ప్రజా ప్రాతిపదికన సమకూర్చుకొంది. శ్రామికులు, రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్త్రీలు మొదలైన విభిన్న వర్గాల వారు ఉద్యమంలో పాలు పంచుకొన్నారు. హిందూ-ముస్లిం సఖ్యత విరాజిల్లింది. ఖిలాఫత్ ఉద్యమాన్ని ఇందులో విలీనం చేయడంతో ఒకరికొకరు బాగా సహకరించుకున్నారు. ఉద్యమ సమీక్షపై నియమించిన హకీం అజ్మల్ ఖాన్ కమిటీ నివేదిక ప్రకారం, ఉద్యమంవల్ల సామాన్య ప్రజల్లో రాజకీయ జాగృతి ఏర్పడి, హక్కులను గుర్తించారు. బ్రిటిష్ పరిపాలనా యంత్రాంగంపట్ల ప్రజల్లో విశ్వాసం పూర్తిగా నశించింది.  తమ శక్తి సామర్థ్యాలతోనే స్వరాజ్యం సాధించుకోగలమనే మనోభావం వారికి కలిగింది. స్వాతంత్ర్యం కోసం పోరాడగలిగే ఏకైక సంస్థ కాంగ్రెస్ అని అందరూ భావించారు. 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరా గ్రామంలో (ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లా) పోలీస్ స్టేషన్ కు ఉద్యమకారులు నిప్పు పెట్టారు. తద్వారా ప్రభుత్వ యంత్రాంగం పట్ల ప్రజలకు భయభ్రాంతులు తొలగాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం బాగా పెరిగింది. బ్రిటిష్ వారికి ఆర్థిక నష్టం కలిగింది. 1920-21 మధ్య విదేశీ వస్త్రాల దిగుమతుల విలువ రూ. 102 కోట్లు కాగా, 1921-22 మధ్య రూ. 57 కోట్లకు పడిపోయింది. టంగుటూరి ప్రకాశం, సుభాష్ చంద్రబోస్, రాజ గోపాలాచారి మొదలైన నాయకులతో కాంగ్రెస్ పటిష్టంగా మారింది. స్వాతంత్ర్య సముపార్జనకు విద్యార్ధిశక్తి తోడయింది. జైళ్లంటే ప్రజలకు భయం పోవడమే కాకుండా, జైళ్లకు వెళ్లడం గౌరవ చిహ్నం అయింది. 

ఉద్యమ వైఫల్యాలు: 

గాంధీజీ ప్రతిజ్ఞ చేసినట్లు ఒక సంవత్సరంలో స్వరాజ్యం సాధించలేకపోయారు. ఖిలాఫత్ విషయంలో గానీ, పంజాబ్ దురాగతాల విషయంలో గానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏ మాత్రం దిగిరాలేదు. శాసనసభల, న్యాయస్థానాల, విద్యాలయాల బహిష్కరణ అనుకొన్నంతగా జరగలేదు. రైతాంగ, కార్మిక సమస్యలు పరిష్కారం కాలేదు. ఉద్యమ ఆశయాలైన ద్వంద్వ ప్రభుత్వ రద్దు చోటు చేసుకోలేదు. భారత ప్రభుత్వ చట్టం 1919 యథావిధిగా కొనసాగింది. గాంధీజీ అర్ధంతరంగా సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడంతో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ మొదలైనవారు కాంగ్రెస్ ఖిలాఫత్-స్వరాజ్య పార్టీని స్థాపించారు. ఖిలాఫత్ ఉద్యమకారులైన అలీ సోదరులను సంప్రదించకుండా (మహ్మద్ 1లీ, కౌకత్ అలీ) గాంధీ ఏకపక్షంగా ఉద్యమాన్ని నిలిపివేయడంతో ముస్లింలు కాంగ్రెస్ ను నమ్మని పరిస్థితి ఏర్పడింది. మతతత్వం మరింత, బలపడటానికి కారణమైంది. ఏదో ఒక గ్రామంలో (చౌరీచౌరా) జరిగిన సంఘటన వల్ల దేశం మొత్తం సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడం స్వరాజ్యోద్యమానికి తీరని విఘాతమని దేశ, విదేశ రాజకీయ వర్గాలవారు భావించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సహాయ నిరాకరణోద్యమంలోని విదేశీ వస్త్రాల దహనాన్ని వ్యతిరేకించారు. ఉద్యమంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ బీద, సాధు జీవులుగా చెలామణి అవుతున్న లక్షలాది భారతీయులు జాతీయోద్యమాన్ని నడిపించగలరనే నమ్మకాన్ని ఈ ఉద్యమం కలిగించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై భారతీయులు రాబోయే రోజుల్లో విజయం సాధిస్తారనే ధైర్యం భారతీయుల్లో కలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ప్రజలకు భయం పోయింది. తరువాత కాలంలో ఉద్యమాలను ఉదృతం చేసేందుకు ఈ ఉద్యమం ఎంతగానో దోహదం చేసింది.