భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో వందేమాతర ఉద్యమం తరువాత ముఖ్యంగా జరిగిన ముఖ్య ఉద్యమంగా "హోంరూల్" ఉద్యమాన్ని చెప్పవచ్చును. బ్రిటీష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా భారతదేశానికి సకల రాజ్యాంగ పద్ధతుల ద్వారా స్వయం పాలనాధికారం సాధించడం లక్ష్యంగా హోంరూల్ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశ ప్రజలను స్వపరిపాలన దిశగా చైతన్య పరచడానికి కృషి చేసిన వారు బాలగంగాధర్ తిలక్ మరియు అనిబీసెంట్. మొదటగా తిలక్ 1916 ఏప్రిల్ లో పూనాలో హోంరూల్ లీగ్"ను పూనాలో నెలకొల్పి స్వపరిపాలనావశ్యకతను తెలియజేశాడు. 1916 సెప్టెంబర్‌లో అనిబిసెంట్ మద్రాస్లో "హోంరూల్ లీగ్"ను ప్రారంభించిది. హోంరూల్ గురించి ప్రజల్లో తగిన ప్రచారం చేయడానికి గాను అనిబీసెంట్ “న్యూ ఇండియా", "కామన్ వీల్" పత్రికలు సైతం ప్రారంభించింది. మహారాష్ట్ర(బొంబాయి మినహా) కర్ణాటక, మధ్య రాష్ట్రాలు, బీహార్‌లలో నిర్వహించే హోంరూల్ ఉద్యమ బాధ్యత తిలక్ హోంరూల్ లీగ్ స్వీకరించింది. మిగతా యావత్ భారతదేశంలో హోంరూల్ ఉద్యమాన్ని నిర్వహించే బాధ్యత అనిబీసెంట్ లీగ్ స్వీకరించింది. తిలక్, అనిటీ సెంట్లు స్థాపించిన హోంరూల్ లీడ్లు వేర్వేరుగా ప్రారంభించబడినా, రెండూ కలిసే పనిచేశాయి. హోంరూల్ ఉద్యమ కాలంలో భారత వ్యవహారాల మంత్రిగా “లార్డ్ మాంటేగ్" ఉండేవాడు. 

సంబంధిత అంశాలు : వందేమాతర ఉద్యమం(1905-11)

స్వాతంత్ర్యం నా జన్మహక్కు దానిని నేను సాధించి తీరతాను" అనే నినాదంతో తిలక్ ఉద్యమాన్ని ప్రతి భారతీయుడికి చేరువచేయడంలో విజయం సాధించాడు. "స్వదేశీ, జాతీయ విద్యావిధానం, భారతదేశానికి హోంరూల్" నినాదాలుగా హోంరూల్ లీగ్ పరిచేసింది. జార్జ్ అరుండేల్ అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమ నిర్వాహక సెక్రటరీగా నియమించబడినాడు. జమునాదాస్ ద్వారకాదాస్, శంకర్‌లాల్ బ్యాంకర్, బి.పి.వాడియా ఇందూలాల్ యాగ్నిక్, ఇతర ముఖ్య అనుచరులు. అనిబీసెంట్ లీగ్ కు సంబంధించి అలహాబాద్లో జవహర్ లాల్ నెహ్రూ, కలకత్తాలో బి.చక్రవర్తి, జె.బెనర్జీ ముఖ్యులు. బ్రిటీష్ ప్రభుత్వం అనిబీసెంట్ ను, ఆమె అనుచరగణాన్ని ప్రభుత్వం 1917, జూన్ 1వ తేదీన ఉదకమండలం(ఊటీ)లో నిర్బంధించింది. 

సంబంధిత అంశాలు :  క్విట్ ఇండియా ఉద్యమం 

1917 భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా వార్షిక సమావేశానికి అధ్యక్షురాలిగా అనిబీసెంట్ ను తిలక్ సూచన మేరకు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎన్నుకున్నది. అనిబీసెంట్ అరెస్టుకు నిరసనగా సుబ్రహ్మణ్య అయ్యర్ తన బిరుదును త్యజించాడు. “ఇండియన్ అన్రెస్ట్" రచయిత అయిన వైలెస్టన్ చిరోల్ పై ఉన్న పరువు నష్టం దావా వాదించుటకు తిలక్ ఇంగ్లండ్ కు వెళ్ళడంతో హోంరూల్ ఉద్యమం క్షీణదశకు చేరింది. ఉద్యమ అణిచివేతలో భాగంగా తిలక్, బిపిన్ చంద్రపాల్ లు ఢిల్లీ, పంజాబ్ లో ప్రవేశించకూడదని బ్రిటీష్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం, 1917లో మాంటేగ్ స్వపరిపాలనా సంస్థలు, బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుపై విధాన ప్రకటన చేయడం వంటి అంశాలతో ఉద్యమం బలహీనపడింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లండగా నిలిచిన దేశాలు విజయం సాధించడంతో హోంరూల్ ఉద్యమం కూడా సమాప్తమైనది.

సంబంధిత అంశాలు : సహాయ నిరాకరణోద్యమం (1920-22)