భారతదేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం 

దేశంలో అణు విద్యుత్, పరిశోధనకు మూల కారకుడు హోమిజహంగిర్ బాబా. ఆయనను భారత అణు పితామహుడిగా కూడా పిలుస్తారు. 1948 ఆగస్టు 10న బాబా అధ్యక్షతన ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పడిన తరువాత అణురంగాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం 1954 ఆగస్ట్ 3న డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ (DAE) ని ఏర్పాటు చేశారు. అణు ఇంధనమైన యురేనియంను సర్వే చేయడం, వెలికితీయడం వంటి వాటికోసం 1967 అక్టోబర్ 4 యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UCIL) ను జాదుగఢ్ లో ఏర్పాటు చేశారు. అణఇంధనాన్ని శుద్ధి చేసి ట్యూబుల్లో నింపి, అణు విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ (NFC) ని 1968 డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. అణురియాక్టర్లో మితకారిగా, చల్లబరిచేందుకు ఉపయోగపడే భారజలం (హెవీవాటర్) ను ఉత్పత్తి చేయడానికి 1969 మే 1న హెవీవాటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత్ లో అనేక భారజల కర్మాగారాలు ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లా మణుగూరులో భారజల కర్మాగారం కలదు.

భారతదేశ అణువిద్యుత్ అవసరాలను తీర్చడానికి మూడు దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, రియాక్టర్లను నెలకొల్పుతున్నారు. దీనికి రూపకల్పన చేసింది హోమి జహంగీర్ బాబా. మొదటి దశలో సహజ యురేనియంను హెవీ వాటర్ రియాక్టర్లలో ఉంచి, విద్యుతను, ఫ్లూటోనియంను ఉత్పత్తి చేస్తారు. ఇలాంటి రియాక్టర్లు ప్రస్తుతం భారత్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. రెండో దశలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో ఇంధనంగా వాడతారు. దీనివల్ల విద్యుత్, ఇంధనం ఏర్పడుతుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తాను వినియోగించుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూడోదశలో ధోరియంను ఇంధనంగా వినియోగించుకునే ఆధునిక అణువిద్యుత్ కేంద్రాలను నిర్మిస్తారు. రెండో దశలో ఉపయోగించే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కల్పకంలో ప్రారంభమైంది. భారతదేశ తీరప్రాంత ఇసుకలో లభించే థోరియం నిల్వలను ఉపయోగించుకునే మూడోదశ రియాక్టర్లను నిర్మించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.


 RELATED TOPICS 

భారత్ లో అణు రియాక్టర్లు

అంతరిక్ష పరిశోధన-ఇస్రో

ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహ వ్యవస్థలు