జీఎస్టీ (వస్తు సేవల పన్ను)

అమల్లో ఉన్న పన్ను విధానంలో బహుళ స్థాయుల్లో పన్నుల విధింపు, ముడిసరుకు పై ముందు స్థాయిలో చెల్లించిన పన్నులకు తదుపరి స్థాయిలో పన్నుల చెల్లింపు సమయంలో వ్యత్యాసాలు, ఒకటి కన్నా ఎక్కువ అధికార పరిధిలోని ప్రాంతాల్లో పన్నుల విధింపు మొదలైనవి దేశ ఆర్థికాభివృద్ధికి సవాళ్లుగా నిలిచాయి. ఇటువంటి వ్యత్యాసాలను నిరోధించి ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టడానికి గాను అత్యంత ఉత్తమమైన మార్గంగా భారత ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టడానికి నిర్ణయించింది. దేశానికంతటికీ వర్తించే పరోక్ష పన్ను విధానమే వస్తు సేవల పన్ను. దీన్నే జిఎస్ (గూడ్స్ సర్వీస్ టాక్స్) అని పిలుస్తారు. వస్తువులు, సేవలపై విధించే ఒకే ఏకీకృత పరోక్ష విధానంగా కూడా జిఎస్టిని చెప్పవచ్చును. 'ఒకటే దేశం ఒకటే పన్ను విధానం' అనే నినాదంతో జీఎస్టీని తెరపైకి తేవడం జరిగింది. ఈ విధానం వల్ల పన్నుల విధింపునకు సంబంధించి ఒకటే మార్కెట్ అవుతుంది. ఒక వస్తువు లేదా సేవకు వివిధ దశల్లో జత కలిసే విలువ ఆధారంగా ఇన్‌పుట్ క్రెడిట్ లభిస్తుంది. తుది, వినియోగదారుడు తాను ఏ రిటైల్ వర్తకుడి నుంచి వస్తువు లేదా సేవలు తీసుకొంటున్నాడో ఆ వర్తకుడు చెల్లించే జిఎస్టిని భరిస్తే సరిపోతుంది.

122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన జిఎస్టి బిల్లు 2016 ఆగస్టు 8న లోక్ సభలో, ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదం పొందింది. సెప్టెంబరు 8న రాష్ట్రపతి ఆమోదం పొంది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఏర్పడింది. ప్రస్తుతం అమలవుతున్న కొన్ని పన్నులు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై సాధారణంగా చట్టాలు చేసే అధికారం ఉమ్మడి జాబితాలోకి చేర్చేందుకు రాజ్యాంగ సవరణ అవసరమైంది.

జీఎస్టీ నేతృత్వం

2000లో పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి దాస్ గుప్తా నేతృత్వంలో వాజపేయి ప్రభుత్వం సాధికార కమిటీని నియమించడంతో జిఎస్ పై చర్చ ప్రారంభమైంది. అలా ప్రారంభమైన జిఎటి ప్రస్థానం 2011లో రాజ్యాంగ సవరణ బిల్లు 115ను ప్రవేశపెట్టింది. 15వ లోక్ సభ రద్దుకావడంతో మార్చిలో ఆ బిల్లు కూడా రద్దు అయింది. 2012లో మళ్లీ జిఎస్టి రూపకల్పన కమిటీని ఏర్పాటు చేశారు. అది 2013లో నివేదిక ఇచ్చింది. 2014లో రాజ్యాంగ సవరణ బిల్లు 122ను ప్రవేశపెట్టారు. 2015 మే 6న లోకసభ ఆమోదం పొందింది. రాజ్యసభ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. ఈ సెలెక్ట్ కమిటీ సిఫార్సుల మేరకు కొన్ని మార్పులు చేసి మళ్లీ 2016 ఆగస్టు 3న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆగస్టు 8న లోక్ సభ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది.

సమాఖ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకొని జిఎస్టి మూడు భాగాలుగా రూపొందించారు. అవి : 

1. కేంద్ర జీఎస్టీ : కేంద్ర వస్తువుల సేవలపై విధించి వసూలు చేసే పన్నులు 

2. రాష్ట్ర జీఎస్టీ : రాష్ట్రాలు వస్తువులు, సేవలపై పన్నులు విధించి వసూలు చేయడం.

3. ఇంటర్ స్టేట్ జీఎస్టీ: రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా సేవలపై పన్నును కేంద్రం వసూలు చేసి తరవాత రాష్ట్రాలకు పంచుతుంది. 

జీఎస్టీ పరిధిలోకి వచ్చే పన్నులను గమనిస్తే కేంద్ర, రాష్ట్రాల్లో అమ్మకం పన్ను అంటే వస్తువుల ఎగుమతులపై వేసే మొట్టమొదటి పన్ను, చరాస్థులు, మార్కెట్లో అమ్మే వస్తువులపై విధించే పన్ను, ఏదైనా ఒక ప్రాంతంలో లేదా మున్సిపాలిటీలో వస్తువులను విక్రయించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఆక్టోయ్ పన్ను, వస్తు ఉత్పత్తి పై వేసే పరోక్ష పన్ను, ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, సినిమా మొదలైన రంగాలపై విధించే వినోదపు పన్నులు దాదాపు 17 పరోక్ష పన్నుల స్థానే జిఎసీని విధిస్తారు. దేశ సమాఖ్య స్వభావం ఇందులో ఉండటం వల్ల సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే 27 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు ఆమోదించాలి. ప్రథమంగా 17 రాష్ట్రాల ఆమోదం పొందిన ఈ చట్టం 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మొదట అసోం ఈ బిల్లును ఆమోదించింది. సాంకేతికతను బాగా ఉపయోగించడం వల్ల అనవసర ఖర్చు, సమయం, శ్రమ ప్రభుత్వానికి మిగులుతాయి. వాణిజ్యంలో దళారులు, లంచగొండితనం తగ్గుముఖం పడుతుంది. నల్లధనం పైన కూడా నియంత్రణ కలుగుతుంది.

జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు 

జీఎస్టీ పన్నును ప్రవేశపెట్టడం వల్ల అనేక రంగాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది. జీఎస్టీ వల్ల కేంద్రం, రాష్ట్రాలు విధించే వివిధ పన్నుల స్థాయుల్లో ఒకే విధానం రావడం వల్ల పున్నపై పన్ను కట్టే భారం తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూలు ప్రక్రియ సులభతరమవుతుంది. ఒకే పన్ను విధానమవడం వల్ల పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. పన్నుల భారం తగ్గడంతో వర్తకులు, వ్యాపారస్థులు కూడా ఎగవేతకు సిద్ధపడకపోవచ్చు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. అంతేకాకుండా పన్నుల వసూళ్లకు ప్రభుత్వం వెచ్చించే వ్యయం తగ్గుతుంది. జీఎస్టీ వల్ల వ్యాపారాలు సులభమవుతాయి. దాంతో పెట్టుబడులు పెరిగి వ్యాపారాలు పెరుగుతాయి. ప్రజలకు కొన్ని రకాల వస్తువులపై పన్నుభారం తగ్గుతుంది. ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులతో పోలిస్తే తక్కువ పన్నును చెల్లించి వస్తువులను పొందవచ్చు. స్థానికంగా తయారయ్యే వస్తువుల ధర తగ్గి వినియోగదారులకు తాము ఎంత పన్నుల భారాన్ని మోస్తున్నామనేది సులువుగా అర్థమవుతుంది.

వ్యాపార సంస్థలకు రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు, రిఫండ్ కోరడం ఎంతో సులువు అవుతుంది. ఏకీకృత పన్ను కావడంతో వస్తువును ఎక్కడ కొన్నా ఒకే ధర ఉంటుంది. ఏకీకృత పన్ను విధానం వల్ల ఎగుమతిదారులకు లబ్ధి చేకూరుతుంది. 10 నుంచి 14 శాతం ఎగుమతుల్లో వృద్ధి సాధించనున్నది. దీర్ఘకాలంలో జీడీపీ వృద్ధి రేటు 1.5 నుంచి 2 శాతం వరకు వృద్ధి చెందే సూచనలు ఉన్నాయి.


 RELATED TOPICS