భారతదేశంలో పారిశ్రామిక తీర్మానాలు 

1948 పారిశ్రామిక తీర్మానం

భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి తీర్మానం ఇది. 1948 ఏప్రిల్ 6న భారత ప్రభుత్వం మొదటి సారిగా పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంలో పరిశ్రమలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. 1) ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న పరిశ్రమలు 2) ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పరిశ్రమలు 3) మిశ్రమ రంగంలో ఉన్న పరిశ్రమలు 4) ప్రైవేటు రంగ పరిశ్రమలు 

1956 పారిశ్రామిక తీర్మానం

1956 ఏప్రిల్ 30న భారత ప్రభుత్వం ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటిచింది. ఈ తీర్మానంలో పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు. 1) జాబితా ఎ- 17 రకాలు పరిశ్రమలు, 2) జాబితా బి- 12 రకాల పరిశ్రమలు, 3) జాబితా సి- మిగిలిన పరిశ్రమలు. జజాబితా 'ఎ' లోని పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. జాబితా 'బి'లోని పరిశ్రమలు మిశ్రమరంగంలో, 'సి'లోని పరిశ్రమలు ప్రయివేట్ రంగంలో ఉంటాయి.

పారిశ్రామిక తీర్మానం-1970

ఎస్. దత్ కమిటీ (1969) సిఫార్సుల మేరకు, 1970లో ప్రభుత్వం నూతన లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం పరిశ్రమలను నాలుగు రకాలుగా విభజించారు. అవి. 1. కోర్ రంగం, 2. అధిక పెట్టుబడి రంగం, 3. మధ్య పెట్టుబడి రంగం, 4. చిన్న పరిశ్రమల రంగం.

1973 పారిశ్రామిక తీర్మానం 

దత్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కోర్ సెక్టార్, జాయింట్ సెక్టార్ అనే భావనలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో 19 రకాలైన పరిశ్రమలను కోర్ రంగానికి కేటాయించారు.

1977 పారిశ్రామిక తీర్మానం

ఈ తీర్మానాన్ని జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంలో చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వు చేసిన వస్తువుల సంఖ్యను 180 నుంచి 807కు పెంచారు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి పరిమాణం ఒక లక్ష రూపాయలుగా, చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి పరిమాణం పది లక్షల రూపాయలుగా, అనుబంధ పరిశ్రమల పెట్టుబడి పరిమాణం 15 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.

1980 పారిశ్రామిక తీర్మానం

ఈ తీర్మానంలో ఆర్థిక ఫెడరలిజం, న్యూక్లియస్ భావన అనే అంశాలను చేర్చారు. ఈ తీర్మానంలో పరిశ్రమల పెట్టుబడి పరిమాణాన్ని పెంచారు. సూక్ష పరిశ్రమల పెట్టుబడి పరిమాణం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచారు. చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమాణం 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. అనుబంధ పరిశ్రమల పెట్టుబడి పరిమాణం 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు.

1985 పారిశ్రామిక తీర్మానం

ఈ తీర్మానాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బ్రాడ్ బ్యాండ్ విధానాన్ని అమలు చేశారు. ఈ తీర్మానం ప్రకారం ఎంఆర్టిపి యాక్ట్ గరిష్ఠ ఆస్తుల పరిమితిని 20 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలకు పెంచారు.

1990 పారిశ్రామిక తీర్మానం

ఈ తీర్మానాన్ని అజిత్ సింగ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ప్రకారం చిన్నతరహా పరిశ్రమలకు విత్త సహాయం చేయడానికి 1990లో లక్నో ప్రధాన కేంద్రంగా 'సిడీ'ని ఏర్పాటు చేశారు.

1991 పారిశ్రామిక తీర్మానం

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ప్రకారం కింది చర్యలు తీసుకొన్నారు. ఇందులో లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించారు. ప్రభుత్వరంగ ప్రాధాన్యతను తగ్గించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. ఎంఆర్ టి పి యాక్ట్ ను సవరించారు.


 RELATED TOPICS