ఆర్థిక సంస్కరణలు 

1991లో పి.వి.నర్సింహారావు ప్రభుత్వం ఎల్ పిజి పేరుతో నూతన ఆర్థిక సంస్కరణలు అమలు చేసింది. ఎల్ - లిబరలైజేషన్ (సరళీకరణ), పి- ప్రైవేటైజేషన్ (ప్రయివేటీకరణ), జి-అంటే గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) 

సరళీకరణ

గత ఆర్థిక విధానంలో ఉన్న ప్రభుత్వ నియంత్రణలను తొలగించడాన్ని సరళీకరణగా పేర్కొంటారు. సరళీకరణలో భాగంగా పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో మార్పు అంటే లైసెన్సింగ్ అవసరం అయ్యే పరిశ్రమల సంఖ్యను తగ్గించారు. 1991 నాటికి ఈ సంఖ్యను 18కి తగ్గించారు. ఆల్కహాల్ ఉత్పత్తులు, పోగాకు ఉత్పత్తులు, హానికర రసాయనాలు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరిశ్రమలకు మాత్రమే ప్రస్తుతం లైసెన్సింగ్ అవసరం అయ్యే జాబితాలో చేర్చారు. ఎంఆర్ టి పి యాక్ట్ ను సవరించారు. అంటే దత్ కమిటీ సిఫార్సుల మేరకు ఎంఆర్ టి పి యాక్ట్ ను 1969లో చేశారు. 1970లో ఎంఆర్టిపి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎంఆర్టిపి యాక్ట్ ప్రకారం గరిష్ఠ ఆస్తుల పరిమితి 20 కోట్లుగా నిర్ణయించారు. 1985లో గరిష్ఠ ఆస్తుల పరిమితిని 100 కోట్లకు పెంచారు. 1991లో ఈ పరిమితిని ఎత్తివేశారు. 2002లో రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు ఎంఆర్టిపి యాక్ట్ ను రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టం చేశారు. 1994-95లో కరెంట్ అకౌంట్ లో రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు రూపాయిని పూర్తిగా మార్చుకొనే అవకాశం కల్పించారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు 1991లో నర్సింహ్మన్ కమిటీని నియమించారు. పన్నుల వ్యవస్థపై అధ్యయనం చేయడానికి 1991లో రాజా చెల్లయ్య కమిటీని నియమించారు.

ప్రైవేటీకరణ 

ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించి ప్రైవేట్ ప్రాధాన్యాన్ని పెంచడాన్ని ప్రైవేటీకరణ అంటారు. ప్రైవేటీకరణలో భాగంగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఉత్పాదక కార్య కలాపాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. 1992లో పెట్టుబడుల ఉపసంహరణ పై అధ్యయనం చేయడానికి రంగరాజన్ కమిటీని నియమించారు. ప్రభుత్వ గుత్తాధిపత్యంలో పరిశ్రమల సంఖ్యను 1991నాటికి 8కి తగ్గించారు. ప్రస్తుతం ఇవి మూడు ఉన్నాయి. అవి రైల్వేలు, అణుశక్తి, అణు ఇంధన ఖనిజాల తవ్వకం. కార్పొరేట్ రంగ విస్తరణకు చర్యలు తీసుకొన్నారు.

ప్రపంచీకరణ

భారత ఆర్థిక వ్వవస్థను విదేశీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేస్తూ విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడాన్నే ప్రపంచీకరణ అంటారు. ప్రపంచీకరణలో భాగంగా భారతదేశంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి 1992లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఎజెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నారు. రూపాయి పూర్తి మార్పిడి విధానం అమలు చేశారు. ఎగుమతుల ప్రోత్సాహక చర్యలు తీసుకొన్నారు.

భారతదేశంలో మొదటి తరం ఆర్థిక సంస్కరణలు

మొదటి తరం ఆర్థిక సంస్కరణల్లో భాగంగా లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించారు. ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న పరిశ్రమల సంఖ్యను తగ్గించారు. ఎంఆర్ టి పి యాక్ట్ ను సవరించారు. ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల పునరావాసానికి జాతీయ పునరుజ్జీవ నిధిని ఏర్పాటు చేశారు.

గోల్డెన్ షేక్ హ్యాండ్ కింద సంస్థల్లో స్వచ్ఛంద పదవీ విరమణ విధానం ప్రవేశపెట్టారు. మినీ రత్న, నవరత్న, మహారత్న వంటి విధానాలు ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేశారు. సిఆర్ఆర్, ఎస్ఎఆర్ వంటి రేట్లు తగ్గించారు. ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నారు. బ్యాంకుల కంప్యూటీకరణకు చర్యలు తీసుకొన్నారు. ఎపిఎ తగ్గించేందుకు చర్యలు తీసుకొన్నారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. బిఎస్ఆర్ బిని రద్దు చేశారు. రూపాయి విలువను 1991లో తగ్గించారు. సెజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నారు. రూపాయి పూర్తి మార్పిడి విధానం అమలు చేశారు.

ఈ సంస్కరణలలో భాగంగానే సబ్సిడీలు తగ్గించేందుకు చర్యలు తీసుకొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. 1996లో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1992లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును ఏర్పాటు చేశారు. బీమా రంగంలో సంస్కరణలకు 1993లో మలోత్ర కమిటీని నియమించారు. 1999లో 'ఫెరా' ను 'ఫెమా'గా మార్చారు.

రెండో తరం ఆర్థిక సంస్కరణలు

ఇందులో భాగంగా జాతీయ వ్యవసాయ విధానం 2000లో ప్రవేశపెట్టారు. అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్ జోన్స్ ను ఏర్పాటు చేశారు. ఎంఆర్ టిపి స్థానంలో పోటీ చట్టం చేశారు. ఎఆర్ బిఎం యాక్ట్ ను 2003లో చేశారు. వ్యాట్ ను దేశవ్యాప్తంగా అమలు చేశారు. సాంకేతిక విద్య అభివృద్ధికి చర్యలు తీసుకొన్నారు. జిఎస్టి అమలుకు చర్యలు తీసుకొన్నారు. సుస్థిరత అభివృద్ధికి చర్యలు తీసుకొన్నారు. ప్రణాళికేతర వ్యవయం పెరుగుదలపై అధ్యయనం చేయడానికి గీతాకృష్ణన్ కమిటీని నియమించారు.


 RELATED TOPICS