హైదరాబాద్ రాజ్యం విలీనం అనంతరం ఏర్పాటయిన మిలట్రీ ప్రభుత్వం జయంత్ నాథ్ చౌదరీని మిలట్రీ గవర్నర్ జనరల్ గా, దత్త ప్రసన్న సదాశివను ప్రధాన పౌర పరిపాలన అధికారిగా నియమించుకొంది. 1950లో సివిల్ అధికారి ఎం.కె. వెల్లోడి జూన్ 12న కింగ్ కోరిలో ఏడుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఈ ప్రభుత్వం ఈ ముల్కీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది.

వెల్లోడి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో రెగ్యులేషన్ లోని 1(ఎ) అంటే పుట్టుకతో స్థానికత, 1(సి) అంటే సంతానం యొక్క తండ్రి 15 ఏళ్లు ప్రభుత్వ సర్వీసును పూర్తి చేయాలి అనే నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. ఈ ఉత్తర్వులను 1950 జనవరిలో హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం తప్పుబట్టింది.

ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ అధికారులను పూర్తిగా ప్రక్షాలన చేసి ఆ ఉద్యోగాల్లో స్థానికులను గాక, మద్రాస్, బాంబే రాష్ట్రాల నుంచి పాత బ్రిటీష్ ఇండియా ఉద్యోగులకు స్థాయికి మించిన ప్రమోషన్లు కల్పించి హైదరాబాదు రప్పించింది. ఈ పద్దతులు స్థానిక నిరుద్యోగులకు, ప్రజలకు అసంతృప్తిని కలిగించింది. 1948-52 మధ్య కాలంలో జరిగిన ఈ పరిణామాలే 1952 ముల్కీ ఉద్యమానికి దారితీసాయి. అయితే తరవాత వచ్చిన ప్రభుత్వాలు తప్పిదాలను సరిచేసే ప్రయత్నాలు చేయలేదు. సరికాదా 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంలో ఈ అక్రమ నియామకాలన్నీ న్యాయబద్ధతను సాధించాయి.

కొత్తగా ప్రజాస్వామ్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంపై హైదరాబాద్ ప్రజలు అనేక ఆశలు పెంచుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రధానంగా మద్రాస్, ఆంధ్రా ప్రాంతం నుంచి రకరకాల పద్ధతుల ద్వారా వచ్చిన ఉద్యోగులు, ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా వచ్చారనేది ప్రజల అభిప్రాయం. వీరిని వెనుకకు పంపించే ప్రయత్నాలు బూర్గుల ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా చేయలేకపోయింది. ఫలితంగా 1952లో ముల్కీ ఉద్యమం ఆరంభమైంది.

వాస్తవంగా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్ర అసెంబ్లీ తీర్మానాలు-హామీలు, పెద్ద మనుషుల ఒప్పందాలు, గ్యారంటీలు, పార్లమెంట్ కల్పించిన రక్షణలతో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్ర ఏర్పాటు జరిగింది. తెలంగాణ నాయకులను కొంతమేర సంతృప్తి పరచి ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు వైపు వారిని నడిపించారు. ప్రధానంగా ముల్కీ నిబంధనల రక్షణ కోసం 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ ఆర్టికలకు చేర్చిన 3వ క్లాజు ఈ నిబంధనలు కొనసాగుతాయనే నమ్మకాన్ని యాక్ట్ 1957 వ్యక్త పరచింది. అదే విధంగా 1959 మార్చి 21లో విడుదలైన ఎంప్లాయ్ మెంట్ చట్టాలు ముల్కీ నిబంధనల అమలుపై భరోసాను పెంచాయి. కానీ, క్రమంగా ప్రత్యక్ష, పరోక్ష పద్దతుల ద్వారా ఈ నిబంధనలను నీరు గార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి.


 RELATED TOPICS