ఏడవ నిజాం 'మీర్ ఉస్మాన్ అలీ ఖాన్' తన ప్రధాని 'అలీ ఇమామ్' సహకారంతో ముల్కీ నిబంధనలను ఫర్మానా ద్వారా విడుదల చేశాడు. అంతకు ముందున్న నిబంధనలతో పోల్చితే ఇవి శాస్త్రీయతను కలిగి ఉన్నవిగా గుర్తింపు పొందాయి.

  • ప్రభుత్వ ఉద్యోగుల్లో ముల్కీలను మాత్రమే నియమించాలి ముల్కీలు అంటే హైదరాబాద్ రాజ్యంలో జన్మించినవారు లేదా 15 ఏళ్లు నిరవధికంగా ఈ ప్రాంతంలోనే నివసించినవారు. నిజాం సంస్థానంలో 15 ఏళ్లు ఉద్యోగం చేసిన వారి సంతానం
  • 15 ఏళ్ల స్థిర నివాసంతో పాటుగా ఉద్యోగ అనంతరం ఇతర ప్రాంతాలకు వలస పోమని 'మెజిస్ట్రేట్' ఎదుట ప్రమాణ పత్రం సమర్పించినవారు.
  • ముల్కీ పురుషున్ని వివాహం చేసుకొన్న స్త్రీ.
  • అయితే ముల్కీ స్త్రీని వివాహం చేసుకొన్న గైర్ ముల్కీ పురుషుడికి ఈ నిబంధన వర్తించదు. అదేవిధంగా బ్రిటీష్ రాజ్యానికి గానీ, బ్రిటీష్ రక్షిత రాజ్యానికి చెందిన వారికి గానీ స్థానికతను నిరాకరించారు. ముల్కీ ధ్రువ పత్రం కోసం చేసే దరఖాసులో పూర్వ వివరాలు పొందపరచాలి.

ఈ నేపథ్యంలో 1920లో ఏర్పాటయిన ఉస్మానియా ముల్కీ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల అసోసియేషన్, ద సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ మొదలైన సంస్థలు 'స్థానికులకే ఉద్యోగాలు' అనే భావజాలాన్ని వ్యాప్తి చేశాయి. ఏడవ నిజాం 1933లో మరో ఫర్మానాను విడుదల చేస్తూ, ఉద్యోగ నియామకాల్లో సమర్థులైన ముల్కీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నాడు.

వాస్తవంగా ముల్కీ నిబంధనల అమలు కోసం, విద్యావంతులైన హైదరాబాదీయులు నిజాయితీగా కృషి చేశారు. 1935లో 'జామియత్ రిఫాయమ్' నిజాం లేదా 'నిజాం సబ్జెక్ట్స్ లీగ్'ను ఏర్పాటు చేశారు. సర్ నిజామత్ జంగ్ అధ్యక్షులుగా, బూర్గుల రామకృష్ణారావు ప్రధాన కార్యదర్శిగా అనేక మంది ప్రముఖులు ఈ సంస్థలో సభ్యులుగా కృషి చేశారు. 'హైద్రాబాద్ ఫర్ హైద్రాబాదీస్' దీని ప్రధాన నినాదం. ఈ సంస్థ ముల్కీల రక్షణ కోసం, ఉద్యోగాల లబ్ధి కోసం కృషి చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఈ సంస్థ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి.

తరవాత కాలంలో నిజాం రాజ్యంలోని రాజ్యాంగ సవరణ కోసం అరవముడు అయ్యంగార్ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ముల్కీ నిబంధనలు సంపూర్ణంగా అమలు కావాలని, దాని కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించింది. స్థూలంగా నిజాంల పరిపాలన కాలంలో జరిగిన ముల్కీ ఉద్యమాలు-సంస్కరణలు పరిశీలిస్తే ప్రభుత్వ యంత్రాంగం ముల్కీ నిబంధనల రూపకల్పన, అమలు, లోపాల సవరణ పట్ల ధ్రుడ వైఖరిని అవలంభించినట్లుగా తెలుస్తుంది.


 RELATED TOPICS