ముల్కీ ఉద్యమానికి దక్కన్ పీఠభూమిలో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తొలుత ఈ ఉద్యమం బహమనీల పరిపాలన కాలంలో సుల్తాన్ 'ఒకటవ మహ్మద్ షా (1427-1435), అతని ప్రధాని 'హసన్'ల ముల్కీ వ్యతిరేక విధానాల ఫలితంగా తలెత్తింది. మూడో అహ్మద్ షా పాలనాకాలంలో అతడి ప్రధాని 'మహ్మద్ గవాన్' దక్కనీలకు వ్యతిరేకంగా అఫాఖీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య మరింత జఠిలమైంది. బహమనీల పరిపాలన కాలంలో దక్కనీ-అఫాఖీల సంఘర్షణ చివరకు బహమనీ రాజ్యాన్నే కూల్చివేసింది.
ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలం నుంచే దక్షిణ భారతదేశ మధ్య భూభాగం 'దక్కన్'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో జన్మించిన వారిని, స్థిర నివాసం ఏర్పరచుకొన్న వారిని 'దక్కనీ'లుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం అధికార భాషగా పర్షియన్ ఉంది. ఈ ప్రాంతానికి చెందని వారిని, సహజ కారణాలతో ఈ ప్రాంతంతో సంబంధం లేని వారిని 'అఫాఖీ'లుగా గుర్తించారు. ఉర్దూ భాషలో దక్కనీలను ముల్కీలుగా, అఫాఖీలను గైర్ ముల్కీలుగా పిలిచేవారు. గైర్ అంటే ఉర్దూలో 'చెందని వారు' అని అర్థం.
గోల్కొండను కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించిన కుతుబ్ షాహీలు దక్కనీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జగనాథరావు, మాదన్న, అక్కన్న, అబ్దుల్ రజాక్ వంటి యోధులు కీలకమైన పరిపాలన, సైనిక బాధ్యతలను నిర్వహించారు. 'కుతుబ్ షాహీల' ఉన్నతమైన సామరస్య ఆదర్శాల వల్ల ముల్కీల సమస్య ఉత్పన్నం కాలేదు.
ముల్కీ ఉద్యమం - అసఫ్ జాహీల పాలన
అసఫ్ జాహీల పరిపాలన కాలంలో సుదీర్ఘ కాలం ప్రధానిగా వ్యవహరించిన సాలార్‌జంగ్(1853-1883) అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు అమల్లో ఉన్న సర్ బస్తీ (మధ్య దళారీ) వ్యవస్థను రద్దు చేసి, నూతన ప్రభుత్వ యంత్రాంగాన్ని క్రమంగా ఏర్పాటు చేశాడు. అయితే ఈ యం త్రాంగంలో ముల్కీలకు కాకుండా, గైర్ ముల్కీలకు ఉద్యోగ అవకాశాలు అధికంగా లభించాయి. గైర్ ముల్కీ అధికారులు స్థానిక ప్రజలను చులకనగా, అవమానకరంగా చూశారు. స్థానిక సంస్కృతిని అలవర్చుకోలేదు అందువల్ల గైర్ ముల్కీ అధికారులను స్థానికులు దిగుమతి అధికారులుగానే భావించారు. ఈ భిన్న వైరుధ్యాల వల్ల సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 1868లో ప్రత్యేక ఉత్తర్వును విడుదల చేశారు. ఈ ఉత్తర్వు సక్రమంగా అమలు కాలేదు. 
మొదటి సాలార్‌జంగ్ మరణాంతరం కొంతకాలం 'కౌన్సెల్ ఆఫ్ రీజెన్సీ' పరిపాలన చేసింది. 1884 ఫిబ్రవరి 5న ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. మల్కీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే క్రమంలో భాగంగా 1888లో ఒక ప్రత్యేక గెజిట్ ను విడుదల చేశారు. ఈ గెజిట్ లోనే తొలిసారిగా 'ముల్కీ' అనే పదం వాడుకలోకి వచ్చింది. రాజ్యంలోని ఉద్యోగాలన్నీ ముల్కీలకేనని ప్రకటించారు. ఒక వేళ గైర్ ముల్కీలు ఉద్యో గం పొందాలంటే ప్రధాని నుంచి ప్రత్యేక అనుమతి పొందాలనే నియమం విధించారు. ఈ గెజిట్ అమల్లో వైఫల్యం చెం దింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సాధారణ జాబితా విడు దలైందిన మొత్తం గెజిటెడ్ ఉద్యోగుల్లో అత్యధికం గైర్ ముల్కీలు ఉన్నారనే విషయాన్ని ఆ జాబితా వెల్లడించింది. ఈ సమ స్య పరిష్కారం కోసం 1901లో నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహారాజా కిషన్ పెర్షాద్ కృషి చేశాడు.
కాసన్ వాకర్ అనే బ్రిటీషర్, నిజాం సంస్థానంలో ఆర్థిక కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఇంగ్లీష్ భాష నిపుణత పేరుతో గైర్ ముల్కీలను అనేక కీలకమైన ఉద్యోగాల్లో నియమించాడు. దీన్ని కిషన్ పెర్హాద్ తీవ్రంగా వ్యతిరేకించి, ఆ ఉద్యోగాలు తాత్కాలికమేనని రాజుతో ప్రకటన చేయించాడు. 1910లో ఉద్యోగ నియామకాలకు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ తొలి ముల్కీ ఉద్యమ స్ఫూర్తి దాతగా కిషన్ పెర్షాద్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేట్ సర్వీసుల పూర్తి స్థాయి సర్వీసు నిబంధనలను 1919లో 'మీర్ ఉస్మాన్ అలీఖాన్' నేతృత్వంలో రూపొందించారు. 1919 ఫర్మానాను అనుసరించి 'హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ'ని ఏర్పాటు చేశారు.